కొండా దంప‌తులు ప‌రిచ‌యం అక్క‌ర‌లేని నేత‌లు.. ప్ర‌జ‌ల్లో వారి ఫాలోయింగే వేరు. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తోనే ఏ పార్టీలో ఉన్నా రాజ‌కీయంగా స‌త్తాచాటుతున్నారు. కొండా సురేఖ పేరును కేసీఆర్ పెండిండ్‌లో పెట్ట‌డంతో ఆమె ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌దానిపై రాజ‌కీయవ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ జ‌రుగుతోంది. కొండా దంపతులు మ‌ళ్లీ సొంత‌గూటికే వెళ్తున్నార‌నే ప్ర‌చారం జోరందుకుంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్ కొండా దంప‌తులు ప్రెస్‌మీట్‌లో త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈనెల 11, లేదా 12వ తేదీల్లో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్ష‌డు రాహుల్ స‌మ‌క్షంలో వారు పార్టీలో చేరుతార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఇక త‌న‌తోపాటు త‌న కూతురుకు కేసీఆర్ టికెట్ ఇవ్వ‌ర‌ని తెలిసిన త‌ర్వాత‌నే కొండా సురేఖ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Image result for telangana

అయితే.. నిజంగానే.. వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే.. ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌న్న‌దే ఇప్పుడు హాట్ టాపిగ్ మారింది. కాంగ్రెస్ పార్టీకి ఎంత‌వ‌ర‌కు క‌లిసివ‌స్తుంది..?  టీఆర్ఎస్ పార్టీకి ఏమేర‌కు న‌ష్టం జ‌రుగుతుంది..? ఎంత‌మంది అభ్య‌ర్థుల‌పై ప్ర‌భావం ప‌డుతుంది..? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. నిజానికి.. కొండా దంప‌తుల‌కు ప్ర‌స్తుతం స్పీక‌ర్ సిరికొండ మ‌ధుసూద‌నాచారి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంతోపాటు తాజా మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ప్రాతినిధ్యం వ‌హించిన ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గాల‌పై కొండా దంప‌తుల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూపాల‌ప‌ల్లి లేదా ప‌ర‌కాల టికెట్ త‌మ కూతురుకు ఇవ్వాలంటూ కొండా దంప‌తులు చాలా కాలంగా అడుగుతున్నారు. 


ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కొండా దంప‌తుల‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. అంత‌ర్గ‌తంగా త‌మ అనుచ‌ర‌గ‌ణాన్ని పెంచుకునే కార్యాచ‌ర‌ణ కూడా చేప‌ట్టారు. ఒకానొక ద‌శ‌లో భూపాల‌ప‌ల్లిలో కొండా ముర‌ళి అనుచ‌రుల‌తో క‌లిసి భారీ బైక్ ర్యాలీ నిర్వ‌హించ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో స్పీక‌ర్‌కు ప‌ట్టులేద‌ని, ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉందంటూ కొండా సురేఖ కామెంట్ చేయ‌డం.. పార్టీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది. ఇదిలా ఉండ‌గా.. వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో మేయ‌ర్ న‌రేంద‌ర్‌తోపాటు మాజీ మంత్రి బ‌స్వ‌రాజు సార‌య్య‌, ఎర్ర‌బెల్లి ప్ర‌దీప్‌రావుల‌తో ఆమె తీవ్ర‌స్థాయిలో విభేదాలు ఏర్ప‌డ్డాయి. కొండా దంప‌తుల‌ను ఒంట‌రి చేసేందుకు వీరంద‌రూ ప‌క్కా ప్లాన్ వేశార‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ కేసీఆర్‌కు చెప్పిన‌ట్లుగా కూడా తెలుస్తోంది.  ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఆమె పేరును పెండింగ్‌లో పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 


అయితే.. కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాత్రం ఓరుగ‌ల్లు రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. వారి దారిలోనే ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లోని ద్వితీయ నాయ‌క‌త్వం కూడా కాంగ్రెస్‌లో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల‌లో టీఆర్ఎస్ గెలుపు ఇక క‌ష్ట‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ప‌ర‌కాల‌లో కూతురు సుష్మిత‌కు, వ‌రంగ‌ల్ తూర్పులో కొండా సురేఖ‌కు టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయ‌క‌త్వం ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే భూపాల‌ప‌ల్లి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ టికెట్లు ఆశించిన భంగ‌ప‌డిన ఆశావ‌హులు గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌, రాజార‌పు ప్ర‌తాప్‌లు రెబ‌ల్‌గా బ‌రిలోకి దిగుతామ‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇదే క్ర‌మంలో కొండా దంప‌తులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి వ‌స్తే.. మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్ట‌డం ఖాయ‌మ‌నే టాక్ వినిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: