వైసీపీ నేత‌, విజ‌య‌వాడ‌లో బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వంగ‌వీటి రాధాకృష్ణ‌కు వ‌రుసగా అవ‌మానాలు ఎదుర‌వుతుండ‌టాన్ని అనుచ‌రులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. పార్టీలోని కొంత‌మంది నాయ‌కులు జ‌ట్టుగా ఏర్ప‌డి ఆయ‌న ప్రాధాన్యం త‌గ్గిస్తున్నార‌ని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గ్రూపు రాజ‌కీయాల‌కు త‌మ నేత బ‌లైపోతున్నార‌ని ఆందోళ‌న చెందుతున్నారు. విజ‌య‌వాడ రాజ‌కీయాలు రోజురోజుకూ హీటెక్కుతున్నాయి. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి వంగ‌వీటి రాధాకృష్ణ‌తో పాటు మ‌ల్లాది విష్ణు మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంది.

మ‌ల్లాది విష్ణుకి పార్టీ పెద్ద‌ల అండ‌దండ‌లు ఉండ‌టంతో.. ఈసారి టికెట్ ఆయ‌న‌కే ద‌క్కే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ టికెట్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకుని.. ఎన్ని అవ‌మానాలు ఎదుర‌వుతున్నా పార్టీ అధినేత జ‌గ‌న్ మాట‌కు క‌ట్టుబడి వాటన్నింటినీ భ‌రిస్తున్న రాధా.. పార్టీలో ఏకాకిగా మారిపోయార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న పార్టీ మారతార‌నే ప్ర‌చారం జోరందుకుంది. మ‌రీ ముఖ్యంగా త‌మ సామాజికవ‌ర్గానికే చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ చెంత‌కు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. 


విజ‌య‌వాడ‌ వైసీపీలో గ్రూపు రాజ‌కీయాలు మ‌రోసారి బ‌య‌ట‌పడ్డాయి. ముఖ్యంగా రాధా వ‌ర్సెస్ మ‌ల్లాది విష్ణు ఎపిసోడ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ బాధ్య‌త‌లు మ‌ల్లాది విష్ణుకి అప్ప‌గించేందుకు పార్టీ సీనియ‌ర్లు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో రాధా అభిమానులు, అనుచ‌రులు తీవ్రంగా నిరాశ‌కు గుర‌వుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వంగవీటి రాధా ఆశలపై అధిష్ఠానం నీళ్లు చల్లింది. వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. పార్టీ సినియ‌ర్ నాయ‌కులు ఇందులో పాల్గొని విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు సంబంధించి చ‌ర్చించారు. పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి వ్యతిరేకంగా నిర్వ‌హిస్తున్న ప‌లువురికి.. వంగవీటి రాధా అండదండలు ఉన్నాయని వెలంపల్లి భావిస్తున్నారు. ఇదే విషయమై అధిష్ఠానానికి కూడా ఆయన గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో వెల్లంప‌ల్లికి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పార్టీ సీనియ‌ర్ నేత పెద్దిరెడ్డి ప్ర‌క‌టించారు. 


మరోవైపు సెంట్రల్‌ నియోజకవర్గంలో వంగవీటి రాధా, మల్లాది విష్ణు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాధాకు చెక్‌ పెట్టేందుకు.. ఇదే అదనుగా భావించిన వెలంపల్లి సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలను మల్లాది విష్ణుకు దక్కేలా పావులు కదిపారు. అంతేగాక సెంట్రల్‌ నియోజకవర్గం బాధ్యతలు మల్లాదికే అని చెప్పించడంలో వెలంపల్లి వర్గం విజయవంతమైంది. దీంతో రెండు వైపులా రాధాకు చెక్ చెప్పిన‌ట్ల‌యింది. రాధాను సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గంపై కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి సారించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయాన్ని రాధా వ్యతిరేకించి, సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఇక పార్టీ కార్య‌క్ర‌మాలు కూడా మల్లాది విష్ణు నాయకత్వంలో చేపట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్లు సమాచారం. దీంతో సెంట్రల్‌ సీటు రాధాకు దక్కడం అనుమానమేనని వెలంపల్లి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. 


ఈ నేప‌థ్యంలో రాధా ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఆయ‌న గతంలోనే పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రిగినా.. అధిష్టానం బుజ్జ‌గింపుల‌తో వెన‌క్కు త‌గ్గారు. ముఖ్యంగా సెంట్ర‌ల్ టికెట్ విష‌యంలో ఆయ‌న ప‌ట్టు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌రోసారి ఆయ‌న‌కు సీనియ‌ర్లు ఊహించ‌ని షాక్ ఇవ్వ‌డం ఆయ‌న‌ అనుచ‌రుల‌ను అవాక్క‌య్యేలా చేస్తోంది. పార్టీలో ఇన్ని అవ‌మానాలు భ‌రించే కంటే.. స‌ముచిత స్థానం క‌ల్పించే పార్టీలోకి వెళ్ల‌డ‌మే మంచిద‌నే అభిప్రాయంలో ఉన్నారట‌. మ‌రీ ముఖ్యంగా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే ఆయ‌న్ను పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించార‌ని తెలుస్తోంది. అంతేగాక పార్టీ జిల్లా ప‌గ్గాలు అప్ప‌గిస్తామ‌ని చెప్పినట్లు చెబుతున్నారు. మ‌రి ఆయన ఇప్పుడు తీసుకునే నిర్ణ‌యంపైనే అంద‌రి దృష్టి ఉంది. ఒక‌వేళ పార్టీని వీడితే వైసీపీకి మైన‌స్‌గా మారే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌న‌డంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: