తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఏర్పడడంతో అధికార టీఆర్‌ఎస్‌తో పాటు విపక్ష పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే కేసీఆర్‌ దూకుడు మీద ఉండడంతో పాటు ఒకేసారి 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో విపక్షాల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. సాధారణ ఎన్నికలకు 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఒకేసారి భారీ స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి అప్పుడే ప్రచార ప్రణాళికలు కూడా రెడీ చేసుకోవడంతో విపక్ష పార్టీలు కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమన్న అభిప్రాయానికి దాదాపు వచ్చేసాయి. ఈ క్రమంలోనే విపక్ష పార్టీలన్నీ చేతులు కలిపేందుకు సిద్ధమౌతున్నాయి. కాంగ్రెతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ సుముఖంగానే ఉందన్న వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. 

Image result for telangana

ఇప్పుడు సీపీఐతో పాటు ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ జనసమితి  మహాకూటమిలో చేరడానికి దాదాపు సంసిద్దంగానే ఉంది. మహాకూట‌మిపై త్వరలోనే మరింత క్లారిటీ రానుంది. ఇప్పుడున్న‌ పరిస్థితుల్లో కేసీఆర్‌ను గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్ని ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల చీలికలో అది కేసీఆర్‌కే అంతిమంగా లాభం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో విపక్ష పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టే తెలంగాణలో ఎన్నికలు మంచి రసవత్తరంగానే ఉంటాయని అనడంలో సందేహమే లేదు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ మహాకూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ పార్టీ ఏఏ స్థానాల్లో పోటీ చేస్తుంది అన్నదే పెద్ద చిక్కుముడిగా ఉంది. గత ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న టీడీపీకి ఈ సారి పొత్తులో అన్నే సీట్లు ఇవ్వొచ్చంటున్నారు.


తెలంగాణలో పున‌ర్వైభోగం కోసం కాంగ్రెస్‌తో జట్టు కట్టి కేసీఆర్‌ను చిత్తు చేయాలన్నదే టీడీపీ ప్రధాన టార్గెట్‌. ఇందు కోసం ఖ‌మ్మం, మల్కాజ్‌గిరి ఎంపీ సీట్లతో పాటు 15కు తగ్గకుండా అసెంబ్లీ సీట్లు అడగాలన్నదే టీడీపీ టార్గెట్‌గా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌, టీడీపీ మధ్య సీట్ల కేటాయింపులో చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇదే మహాకూటమిలోకి చేరేందుకు  రెడీ అవుతున్న సీపీఐ, కోదండరాం నేతృత్వంలో తెలంగాణ జనసమితి పాత్ర ఏమిటి? ఈ రెండు పార్టీలు ఎన్ని సీట్లు కోరుకుంటున్నాయి ? నాలుగు పార్టీలు ఉమ్మడిగా కోరుకుంటున్న సీట్లు ఏంటి ? అన్నదానిపై తీవ్రమైన తర్జనభ‌ర్జనలు జరుగుతున్నాయి.


ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఖ‌మ్మం జిల్లాలో ఆ పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా చాలా బలంగా ఉంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో ఖ‌మ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం స్థానాల కోసం పట్టుపడుతుంది. ఇక కాంగ్రెస్‌ సైతం ఖ‌మ్మం, కొత్తగూడెం తమకే కావాలని చెబుతోంది. దీంతో సీట్ల లెక్క ఓ పట్టాన తేలేలా లేదు. ఇక ఇటీవల టీఆర్‌ఎస్‌పై అసమ్మ‌తి గళం వినిపించిన కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌లోకి రావొచ్చంటున్నారు. ప్రస్తుతం సురేఖ ఎమ్మెల్యేగా ఉన్నా వరంగల్‌ తూర్పుతో పాటు పరకాల సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే తెలంగాణ మహాజనసమితి అధినేత కోదండరాం వరంగల్‌ తూర్పు సీటు నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఒకే సీటు నుంచి రెండు లేదా అంతకు మించిన పార్టీలు కన్నెయ్యడంతో ఫైన‌ల్‌గా ఆ సీటు ఎవరికి దక్కుతుందన్నది క్లారిటీ లేకుండా పోయింది. 


అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌న‌గ‌ర్‌ సీట్లపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఈ రెండు స్థానాల నుంచి కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ కుమార్‌ రెడ్డి ఆయన భార్య పద్మావతి ఉన్నారు. ఈ రెండు సీట్లు కాంగ్రెస్‌ వదులుకోవడం అసాధ్యం.ఈ లెక్కన నల్గొండ జిల్లాల్లో టీడీపీకి ఆప్ష‌న్‌ లేకుండా పోయింది. ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో జూబ్లిహీల్స్‌ సీటుపై టీడీపీ కన్నేసిన అక్కడ గట్టి అభ్యర్థిగా ఉన్నా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌ రెడ్డిని కాంగ్రెస్‌ వదులుకునే ఛాన్స్‌ లేదు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో చాలా సీట్లలో కాంగ్రెస్‌, టీడీపీ మధ్య‌ సమస్య ఓ కొలిక్కి వచ్చేలా లేదు. ఒకే సీటును కాంగ్రెస్‌, టీడీపీ కొన్ని చోట్ల సీపీఐ కోరుకోవడంతోనే ఈ పరిస్థితి వస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో కొత్తగూడెం సీటును టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు సీపీఐ కూడా కోరుకుంటుంది. దీంతో మహాకూటమిలో సీట్ల సమస్య, సీట్ల సద్దుబాటు ఓ కొలిక్కి వచ్చేలా కనపడడం లేదు. 


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో మంచిర్యాల‌, చెన్నూరు స్థానాలపై టీజెఎస్‌ కన్నేసింది. మంచిర్యాల‌, వరంగల్‌ తూర్పులో పోటీ చేయాలనుకుంటున్న కోదండరాం మంచిర్యాలను కూడా ఆప్ష‌న్‌గా పెట్టుకున్నారు. అయితే మంచిర్యాల కాంగ్రెస్‌ టికెట్‌ కోసం హేమాహేమీలు  ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఈ సీటు ఫైన‌ల్‌గా ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి. చిన్నూరు నుంచి సుదీర్ఘ‌కాలంగా కోదండరాంతో పని చేస్తున్న పొడేటి సంజీవ్‌ రేసులో ఉన్నారు. అయితే ఆ సీటును కాంగ్రెస్‌ వదులుకుంటుందా ? అన్నది సందేహం. ఏదేమైన మహాకూటమి సక్సెస్‌ అవ్వాలంటే చాలా మంది కీలక నాయకులు సైతం పొత్తులో భాగంగా త్యాగాలు చెయ్యక తప్పని పరిస్థితి. అలా అయితేనే టీఆర్‌ఎస్‌ను గద్దె దించడం సాధ్యం అవుతుంది. కూటమి కూర్పు పూర్తి అయితే సీట్ల విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కలహాలు లేని మహాకూటమి అయితేనే సక్సెస్‌ అవుతుంది లేకపోతే 2009 ఎన్నికల మాదిరిగానే మహాకూటమి చిత్తు అవ్వడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: