గులాబీ గూటిలో రోజురోజుకూ టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాలు ఆప‌డం లేదు. చివ‌రివ‌ర‌కూ త‌మ ప్ర‌య‌త్నం తాము చేస్తామ‌ని తెగేసి చెబుతున్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గ్రూపులుగా చీలిపోయింది. ఈ ప‌రిణామాలే పార్టీ కొంప ముంచుతాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ఈనెల 6న అసెంబ్లీని ర‌ద్దు చేసి, ఏకంగా 105మంది పార్టీ అభ్య‌ర్థుల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించ‌డమే ఆల‌స్యం.. ఒక్క‌సారిగా అస‌మ్మ‌తి భ‌గ్గుమంది. ఈసారి ఎలాగైనా త‌మ‌కే టికెట్ వ‌స్తుంద‌ని అనుకున్న నాయకులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణ‌యంపై తీవ్ర‌స్థాయిలో గుర్రుగా ఉన్నారు. అయితే.. సుమారు 15 నుంచి 20మందిని మార్చే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నార‌నే లీకుల‌తో.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆశావ‌హులు గ‌ట్టిప‌ట్టుబ‌డుతున్నారు.


ఒకానొక ద‌శ‌లో చెన్నూరు టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలుకు ఇవ్వ‌కుండా.. పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క సుమన్‌కు ఇవ్వ‌డాన్ని ఓదెలు వ‌ర్గం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఈ క్ర‌మంలో ఓదెలు అనుచ‌రుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవ‌డం.. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌`తి చెంద‌డం తెలిసిందే. మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన నేత‌లు.. ఇంకా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య‌కే ఇచ్చారు. కానీ.. అప్ప‌టివ‌ర‌కు త‌న‌కే టికెట్ వ‌స్తుంద‌ని చెప్పుకున్న పార్టీ రాష్ట్ర నాయ‌కుడు రాజార‌పు ప్ర‌తాప్ మాత్రం ప‌ట్టువీడ‌డం లేదు. ఎలాగైనా అధిష్టానాన్ని ఒప్పించేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చివ‌రికి రాజ‌య్య‌కు బీఫాం ఇవ్వ‌కుండా.. కేసీఆర్ త‌న‌కే టికెట్ ఇస్తార‌ని చెప్పుకుంటూ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు.


ఇదిలా ఉండ‌గా.. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ టికెట్‌ను ఉప ముఖ్య‌మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి కూడా ఆశించారు. ఆయ‌న కూడా సైలెంట్ ఇంకా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. ఇటీవ‌ల బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కూడా చేశారు.  డోర్నక‌ల్ టిక్కెట్ ఆశించిన స‌త్యవ‌తి రాథోడ్ కూడా విశ్వప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఆమెను క‌లిసి మ‌ద్దతు ఇవ్వాల‌ని కోరినా సానుకూలంగా స్పందించ‌న‌ట్లు తెలుస్తోంది. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో లొల్లి ముదిరి పాకాన ప‌డిన‌ట్లు స‌మాచారం. ఉప్పల్ టికెట్‌ను బేతి సుభాష్ రెడ్డికి కేటాయించారు. అయితే మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడ ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి దిగాల‌ని భావిస్తున్నారు. రామ్మోహ‌న్‌కు ఇక్క‌డ‌ మెజారిటీ కార్పోరేట‌ర్ల మ‌ద్దతు ఉంది. అయితే.. అధిష్టానం స‌ర్దుకు పోవాల‌ని చెప్పినా.. బొంతు వినక‌పోవ‌డం గ‌మ‌నార్హం. 


కుత్భుల్లాపూర్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. పార్టీ సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు‌కు ఈ సారి కూడా నిరాశే ఎదురైంది.  టీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు వర్గాలు రెండు గ్రూపులుగా మారిపోవ‌డంతో క్యాడ‌ర్లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. నిజానికి ఇక్క‌డ మెజార్టీ మ‌ద్ద‌తు రాజుకే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాలు పార్టీ గెలుపును తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ టిక్కెట్ ఆశించిన మాజీ ఎంపీ ర‌మేష్ రాథోడ్ కూడా టికెట్ కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేసి చివ‌ర‌కు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. ముథోల్ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డికి ఇవ్వ‌డంతో వేణుగోపాల‌చారి గుర్రుగా ఉన్నారు. నోటిఫికేష‌న్ వ‌చ్చేస‌రికి ఇది మ‌రింత తీవ్రం కానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: