రాజ‌కీయాల్లో ఏమైనా చేయొచ్చ‌నేది టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్లాన్‌. అయితే, అది అంలత ఈజీ కాద‌నేది సీనియ‌ర్ల మాట‌. అయినా.. చంద్ర బాబు వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌తి క‌ద‌లిక‌ను కూడా చాలా జాగ్ర‌త్త‌గా తీసుకుంటున్నారు. ఈ క్ర‌మం లోనే త‌న సొంత జిల్లా చిత్తూరులో రాజ‌కీయాల‌పై గ‌త కొన్నాళ్లుగా ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. గ‌త 2014ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ బొక్క‌బోర్లా ప‌డింది. విప‌క్షం వైసీపీ చెల‌రేగిపోయింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా .. ఇక్క‌డ టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. 


గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై గెలుపొందిన వారికి ఆహ్వానం ప‌లికారు.  ఇలా వ‌చ్చిన ప‌ల‌మ‌నేరు ఎమ్మెల్యే అమ‌ర్నాథ‌రెడ్డికి ఏకంగా మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌క వ్యూహాలు వేస్తున్న సీఎం చంద్ర‌బాబు.. ఏకంగా పుంగ‌నూరు విష‌యంలో ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక్క‌డ నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌ర్నాథ‌రెడ్డి త‌మ్ముడి భార్య అనీషా రెడ్డిని ఇక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు టికెట్ కూడా ఖాయం చేశారు. అయితే, ఇక్క‌డ అనీషా రెడ్డి గెలుపు సాధ్య‌మేనా? అనేది పెద్ద ప్ర‌శ్న. దీనికి అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా ఈమె రాజ‌కీయాల‌కు కొత్త‌. రాజ‌కీయ కుటుంబంలో నుంచే వ‌స్తున్నా.. స్థానికంగా బ‌లంగా ఉన్న టీడీపీ నేత‌లను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం అంటే.. ఈమెకు మాట‌లతో అయ్యే ప‌నికాదు. 


ఇక‌, ఆర్థికంగా చూస్తే.. ఒకింత ఫ‌ర్వాలేద‌ని అనిపించినా.. ఇక్క‌డ ఎప్ప‌టి ఉంచో పార్టీ కోసం ప‌నిచేస్తూ.. టికెట్‌ను ఆశిస్తున్న‌వారు ఇప్పుడు హ‌ఠాత్తుగా ఆమెను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డంపైనా క‌న్నెర్ర‌గా ఉన్నారు. మ‌రోప‌క్క‌, ప్ర‌స్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నేత పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి రాజ‌కీయాల్లో దిట్ట‌. దీంతో ఆయ‌న వ్యూహాల ముందు అనీషా రెడ్డి నిలుస్తుంద‌నేది ప్ర‌ధాన సందేహం. దీనికితోడు స్థానికంగా పెద్దిరెడ్డి సెంటిమెంటు ఎక్కువ‌. అంద‌రూ ఆయ‌న‌ను పెద్దాయ‌న‌గా సంబోధించ‌డం, ఏ స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న ద‌గ్గ‌రకు వెళ్ల‌డం వంటివి ఇక్క‌డ కామ‌న్‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను కాద‌ని ఇప్పుడిప్పేడే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న అనీషా రెడ్డిని గెలిపించేందుకు ఎవ‌రూ ముందుకు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌నేది కూడా ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌ధాన విష‌యం. 


అదేస‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో అమ‌ర్నాథ‌రెడ్డి వైసీపీ త‌ర‌ఫున గెలిచి.. పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లారు. అయితే, ఆయ‌నే ఇప్ప‌టికీ.. పార్టీపై ప‌ట్టు సాధించ‌లేక పోవ‌డం గ‌మ‌నార్హం. అధినేత‌తో ప‌రిచ‌యాలు, మంత్రిగా ఆయ‌నకుండే స‌ర్కిల్ వంటివి రేపు ఓట్లు వేయిస్తుంద‌నేది సాధ్యమ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ పెద్దిరెడ్డికే అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయ‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: