మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మారుతీరావుకు మద్దతుగా తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో శాంతిర్యాలీ నిర్వహించారు.  మరో వైపు మిర్యాలగూడ సెంటర్ లో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఆర్యవైశ్యులు ఘాటుగా స్పందించారు.. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేస్తే, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని వైశ్య సంఘాల ప్రముఖులు వ్యాఖ్యానించారు.


విగ్రహ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని వారు స్పష్టం చేశారు. స్థానిక వాసవీభవన్‌ నుంచి జిల్లా జైల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. జైల్‌లో మారుతీరావుని కలిసేందుకు ములాఖాత్‌ కోరగా అందుకు పోలీస్‌ అధికారులు నిరాకరించారు. జైల్‌లో ఉన్న మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ను ములాఖాత్‌ పై కలిసారు.  సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. విగ్రహం ఏర్పాటు వల్ల భావిసమాజానికి చెడుసంకేతాలు వెళతాయన్నరు. 


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకు గురికావడం చాలా బాధాకరమైన విషయమన్నారు. కానీ పట్టణ నడిబొడ్డున ప్రణయ్‌ విగ్రహం పెడితే భవిష్యత్‌లో యువత అదేబాటలో నడుస్తారని భయపడుతున్నామని ఆందోళనవ్యక్తం చేశారు. ప్రణయ్ ఒక సామాన్య వ్యక్తి అని..అతను దేశం కోసం..రాష్ట్రం కోసం ఏమైనా త్యాగాలు చేసినవాడా..ఒకవేళ అతని విగ్రహం ప్రతిష్టే అలా చేసిన వారిని ఘోరంగా అవమానించినట్లు అవుతుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: