అంద‌రూ ఊహింన‌ట్టే జ‌రిగింది. కొండా సురేఖ సీఎం కేసీఆర్ కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బ‌హిరంగ లేఖ విడుద‌ల చేశారు. మీడియా స‌మావేశంలో ఆమె స్వ‌యంగా ఆ లేఖ‌ను చ‌దివి వినిపించారు. కేసీఆర్ పాల‌న‌పై మండిప‌డ్డారు. కేసీఆర్‌ది దొర‌ల‌పాల‌న‌, గుడ్డి పాల‌న‌, తుగ్ల‌క్ పాల‌న, మోస‌పూరిత పాల‌న‌ అంటూ ఏకిపారేశారు. టీఆర్ఎస్ పార్టీలో బ‌హుజ‌నుల‌ను స్థానం లేద‌ని, కేవ‌లం అగ్ర‌కులాల వారికే ప్రాధాన్యం ఉంద‌ని ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ లేఖ‌లో ప్ర‌ధానంగా కేసీఆర్ తీరును టార్గెట్ చేశారు. ఒక్క‌రోజు కూడా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రాని, సెక్ర‌టేరియ‌ట్‌కు రాని ముఖ్య‌మంత్రి కేసీఆరేన‌ని అన్నారు. అయితే.. ఆమె కేసీఆర్‌పై వ్యూహాత్మ‌కంగా దాడి చేశారు. అంశాల వారీగా ప్ర‌శ్న‌లు వేస్తూ.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కేటీఆర్‌, క‌విత‌ల గురించి కూడా ప్ర‌స్తావించారు.


ఈనెల 6న అసెంబ్లీని ర‌ద్దు చేసి ఏకంగా 105 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందులో వ‌రంగ‌ల్ తూర్పు తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు లేదు. దీంతో ఆమె మ‌రునాడే మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి.. ఈ నెల 23న బ‌హిరంగ లేఖ‌తో త‌మ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని అన్నారు. అయితే.. రెండు రోజుల ఆల‌స్యంతో మంగ‌ళ‌వారం వారు మీడియా ముందుకు వ‌చ్చి కేసీఆర్‌కు బ‌హిరంగ లేఖ‌ను సంధించారు. అయితే.. కొండా సురేఖ సంధించిన ప్ర‌శ్న‌లు, అంశాల‌ను చూస్తుంటే.. పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా టీఆర్ఎస్ పార్టీ బ‌హుజ‌నుల‌కు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు, అమ‌ర‌వీరుల కుటుంబాలు, పేద రైతుల‌కు వ్య‌తిరేక‌మ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అంతేగాకుండా.. ద‌ళిత వ్య‌తిరేకి కేసీఆర్ అని చెప్పేందుకు కూడా ప‌లు ఉదాహార‌ణ‌లు సురేఖ చెప్ప‌డం గ‌మ‌నార్హం.


అగ్ర‌వ‌ర్ణానికి చెందిన వ్య‌క్తి రాష్ట్రప‌తి అయితే కేసీఆర్ కాళ్లు మొక్కుతార‌ని.. ద‌ళిత సామాజిక‌వ‌ర్గానికి చెందిన రాష్ట్ర‌ప‌తి రాంనాథ్‌కోవింద్‌కు మాత్రం చేతులు క‌లిపారంటూ కొండా సురేఖ చెప్ప‌డం గ‌మ‌నార్హం. రైతుబంధ ప‌థ‌కాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఇది ధ‌నిక రైతుల కోసమేన‌ని, నిరుపేద‌, కౌలు రైతుల‌కు కాద‌ని ఆమె చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంతేగాకుండా.. మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్‌లో ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డారంటూ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. అంతేగాకుండా.. మంత్రి హ‌రీశ్‌రావు పేరును కూడా ఆమె ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా ప్ర‌స్తావించారు. హ‌రీశ్‌లాంటి వారే తీవ్ర నిరూత్సాహం.. నిస్తేజంతో మాట్లాడుతున్నారంటూ.. మామా అల్లుళ్ల మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని ఆమె ప‌రోక్షంగా చెప్పారు. కేటీఆర్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోసం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తున్నార‌ని ఆమె ఆరోపించారు. కేటీఆర్ రాజ‌కీయ స‌న్యానం తీసుకోవ‌డానికి సిద్ధంగా ఉండాలంటూ స‌వాల్ విసిరారు. అయితే.. ఆమె కాంగ్రెస్ పార్టీని.. అందులోనూ సోనియాగాంధీని పొగుడుతూ మాట్లాడ‌డం గ‌మ‌నార్హం.


ఈ నేప‌థ్యంలో కొండా దంప‌తులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో క్లారిటీ రావాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే. అయితే.. కొండా దంప‌తులు టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని భూపాల‌ప‌ల్లి, ప‌ర‌కాల, వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అంతేగాకుండా.. మ‌రికొంద‌రు నేత‌లు కూడా టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్తార‌నే టాక్ వినిపిస్తోంది. నిజానికి కొండా విడుద‌ల చేసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భావం  చూపుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.  ఏదేమైనా.. కొండా సురేఖ బ‌హిరంగ లేఖ గులాబీ గూటిలో ఎలాంటి ప‌రిణామాల‌కు, ఎంత‌టి దుమారానికి దారితీస్తుందో చూడాలి. ఈ లేఖ‌పై గులాబీద‌ళం ఏమంటుందో మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: