`ముంద‌స్తు` ముచ్చ‌టలో ఎన్నో ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో.. అది కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇల్లే ఒక రాజ‌కీయ రంగ‌స్థ‌లంగా మారిపోయింది. `ఈ ఆద‌రాభిమానాల‌తోనే రాజ‌కీయాల నుంచి విర‌మించుకుంటే బాగుంటుందేమో` అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేన‌ల్లుడు, మంత్రి హ‌రీశ్‌రావ్ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొడుకు కేటీఆర్‌కు ఎక్క‌డ అడ్డు వ‌స్తాడోన‌నే భ‌యంతో కేసీఆర్‌.. హ‌రీశ్‌రావుకు కావాల‌నే ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్నార‌నే విమ‌ర్శ‌లకు మ‌రింత తావిస్తున్నాయి. ఇక టికెట్ల కేటాయింపులోనూ హ‌రీశ్ వ‌ర్గానికి మొండి చేయి ద‌క్కిద‌నే ఆరోప‌ణలు లేక‌పోలేదు. ఇన్ని జ‌రుగుతున్నా.. తాను మాత్రం కేసీఆర్ వెన్నంటే న‌డుస్తాన‌ని చెబుతూనే ఉన్నారు హ‌రీశ్‌రావు!!  తాను ఎప్ప‌టికీ కేటీఆర్‌కు పోటీ కాద‌ని.. ఆయ‌న సీఎం అయినా వెన్నంటే ప‌నిచేస్తాన‌ని వివర‌ణ‌లు ఇచ్చుకుంటున్నారు. వీటిన్నింటికీ తోడు ఇప్పుడు మ‌రో బాంబు ఆయ‌నపై వేసి వెళ్లిపోయారు కొండా సురేఖ దంప‌తులు. తాము హరీశ్ వ‌ర్గం అయినందుకే కేటీఆర్‌, క‌విత టికెట్లు ఇవ్వ‌లేదంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 

Image result for telangana

హ‌రీశ్ రావు వ‌ర్గానికి అన్యాయం జ‌రిగింది అని విశ్లేష‌కులు! హ‌రీశ్ ఉంటే ప్ర‌గతి నివేద‌న స‌భ ఇంత పేల‌వంగా నిర్వ‌హించే అవ‌కాశ‌మే ఉండేది కాద‌ని పార్టీని కొంద‌రు ద్వితీయ శ్రేణి నాయ‌కులు! హ‌రీశ్‌రావును రాజ‌కీయంగా బ‌లిప‌శువును చేస్తున్నారంటూ విప‌క్షాలు!.. ఇలా ఎవ‌రి మాట విన్నా..హ‌రీశ్‌రావు ముచ్చ‌టే! ఒకటి కాదు రెండు కాదు.. టీఆర్ఎస్‌లో ఏ ముఖ్య సంఘ‌ట‌న జ‌రిగినా ఇలాంటి కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆయ‌న మైకు ముందుకు రావ‌డం.. ఇవ‌న్నీ ఖండించి వెళిపోతుంటారు. ఇందులో ఏది వాస్త‌వం.. ఏది అవాస్త‌వం అనే విష‌యం అటుంచితే.. ముంద‌స్తు ఎన్నిక‌ల స‌మ‌యంలో.. టీఆర్ఎస్‌లో హ‌రీశ్‌ రావు కేంద్రంగా రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. పార్టీ నుంచి బయటికి వెళ్తూ కొండా దంపతులు పేల్చిన హరీశ్‌ బాంబు.. గులాబీ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలింతకూ హరీశ్‌ కేంద్రంగా ఎందుకిలా జరుగుతోంది? అనేది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మిగిలిపోతోంది. 


తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన నుంచి కేసీఆర్‌తో కలిపి పనిచేస్తున్న మంత్రి హ‌రీశ్ రావుకు పార్టీలో మంచి పేరుంది. పార్టీలో ట్రబుల్ షూటర్‌గా ప్రసిద్ది. కొద్ది రోజులుగా హ‌రీశ్‌కు పార్టీలో ప్రాధాన్యం తగ్గిస్తున్నారని...పార్టీలో అయన మాట చెల్లుబాటు కావడం లేదనే ప్రచారం సాగుతోంది. కొంగరకలాన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ఆయ‌న ఎక్క‌డా కనిపించలేదు. ఆ టైంలో ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. సభలో సీఎం ప్రసంగం స‌మ‌యంలో.. జనాన్ని చూసిన నేతలు, హరీశ్ పాత్ర లేకపోవడంతో ఇంత పేలవంగా జరిగిందని, లేకుంటే సభ సక్సెస్ ఫుల్‌గా జరిగేదని ప్రచారం చేశారు. ఆ వెంటనే హుస్నాబాద్‌లో  ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఎన్నికల ప్రచార సభను ప్రారంభించారు కేసీఆర్. ఆ సభను ఆద్యంతం హరీశ్ దగ్గరుండి పర్యవేక్షించి విజయవంతం చేశారు. ఇక సిద్దిపేటలో ఎన్నికల ప్రచారానికి వెల్లిన హరీశ్‌, తన దత్తత గ్రామం ఇబ్రహీం నగర్‌లో ప్రజలను చూసి ఇంత ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల్లోంచి తప్పుకుంటే బాగుంటుందని చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి.


ఈ వ్యాఖ్యల మరుసటి రోజే, ప్రతిపక్షాలు హరీష్‌ అస్త్రాన్ని మరోసారి టీఆర్ఎస్‌పై ప్రయోగించాయి. కావాలనే హరీష్ రావు ప్రాధాన్యాన్ని కేసీఆర్ తగ్గిస్తున్నారని, తన కుమారుడిని ఎలివేట్ చేసేందుకు హరీశ్‌ను డౌన్‌ చేస్తున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు, ప్రచారం చేశారు. సిద్దిపేట నియోజక వర్గం నుంచి హరీష్ రావు కాకుండా  ఈసారి సీఎం కేసీఆర్ పోటీ చేయబోతున్నారని కూడా ఆరోపించారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్తున్న కొండా దంపతులు, పోతూపోతూ మరో బాంబు పేల్చారు. పార్టీలో తాము హరీష్ రావు వర్గంగా ఉన్నందునే ఎమ్మెల్యే టికెట్టు ఇవ్వుకుండా కేటీఆర్, కవితలు అఢ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మ‌రి ఇవి ఇంకెన్ని రాజ‌కీయ ప‌రిణామాల‌కు దారితీస్తాయో వేచిచూడాల్సిందే!! 



మరింత సమాచారం తెలుసుకోండి: