తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హంగామా మొదలైంది.  ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసి కేసీఆర్ 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల లీస్ట్ కూడా వెల్లడించారు.  మరోవైపు కాంగ్రెస్ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.  రేపటి నుంచి కాంగ్రెస్ ఎన్నిక ప్రచారం మొదలు పెట్టబోతుంది.  టీఆర్ఎస్ కూడా ప్రచారం పర్వాన్ని వేగవంతం చేస్తుంది. అన్నీ సవ్యంగా జరిగితే.. నవంబర్ 24న తెలంగాణలో ఎన్నికలు జరగొచ్చు అని మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

తాజాగా ఈ విషయంపై  తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఈరోజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.  ఈ రోజు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఈసీ వర్క్ షాప్ నిర్వహించింది. నవంబర్ 24న తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తామని తాను చెప్పినట్లు కొన్ని టీవీలు, పత్రికలు ప్రచారం చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.

అంతే కాదు మీడియాలో వస్తున్న వార్తలపై జిల్లాల ఎన్నికల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా రజత్ కుమార్ సూచించారు. వచ్చే నెల 24న ఎన్నికలు నిర్వహిస్తామని తాను చెప్పినట్లు అసత్యపు వార్తలు రాయడం సరికాదన్నారు. ఇలాంటి సున్నితమైన విషయాలపై తప్పుడు వార్తలు రాసినా, ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: