తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయాలు ఎవ్వరి ఊహలకు అందని విధంగా సాగుతున్నాయి. స్టేట్‌ రాజకీయాలే కాదు చివరికి కొన్ని ఆసక్తికర నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం సైతం ఎవ్వరికీ అంతు పట్టని విధంగా సాగుతోంది. టీఆర్‌ఎస్‌, తెలుగుదేశం, కాంగ్రెస్‌, బీజేపీలకు కీలకమైన... తెలంగాణకు గుండెకాయ లాంటి గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం అవుతుంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్‌, సనత్‌నగర్‌, శేరిలింగంపల్లి, ఉప్పల్‌, ఎల్‌బినగర్‌ లాంటి కీలక నియోజకవర్గాల్లో సెటిల‌ర్స్‌ ఓట్లు గెలుపు, ఓటములను ప్రభావితం చెయ్యడంతో ఈ నియోజకవర్గాల్లో ఎవరి పోటీ... ఎవరి గెలుపునకు ఎర్త్‌ పెడుతుందో ? ఎవరు ఎవరి విజయ అవకాశాలు దెబ్బ తీస్తారో అన్నది అంతు చిక్కడం లేదు. 


గ్రేటర్‌ హైదరాబాద్‌లో సెటిలర్స్‌ ఓట్లు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో సనత్‌నగర్‌ నియోజకవర్గం ఒకటి. ఇక్కడ అభ్యర్థుల గెలుపు, ఓటమిలను వారే ప్రభావింతం చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రా సెటిలర్స్‌ సనత్‌నగర్‌లో కీలకంగా మారారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తర‌పున అంతకు ముందు సికింద్రాబాద్‌లో వరస విజయాలు సాధించిన తాజా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ 30వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో ఘ‌న‌విజయం సాధించారు. సెటిలర్స్‌ ఓట్లతో పాటు బీజేపీతో పొత్తు ఉండడంతో తలసానికి భారీ విజయం సాధ్యం అయ్యింది. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తలసాని తిరిగి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. 


ఇక్కడ నుంచి బండారు పోటీకి దిగితే తలసాని వర్సెస్‌ బండారు మధ్య హోరా హోరి పోరు ఉండడం ఖాయం. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీతో కేసీఆర్‌ అంతర్గతంగా ఓ ఒప్పందానికి వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని విపక్షాలు సైతం  తమ వ్యాఖ్య‌లతో మరింత బలపరుస్తున్నాయి. కొన్ని సంఘటనలు సైతం కేసీఆర్‌ బీజేపీ మధ్య నిజంగా తెర వెనక ఒప్పందం కుదిరిందా అన్నట్లుగానే ఉన్నాయి. అయితే అసెంబ్లీకి టీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ వరకు కేసీఆర్‌ బీజేపీకి సపోర్ట్‌ చేస్తారా ? అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. 


నిజంగా తెర వెనకు అలాంటి ఒప్పందం జరిగితే సనత్‌నగర్‌లో తలసాని వర్సెస్‌ బండారు దత్తాత్రేయ మధ్య ఎందుకు పోటీ ఉంటుందని, దత్తాత్రేయ ఇక్కడ పోటీ చెయ్యరు కదా అని మరికొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వాద‌నలో ఎలాంటి నిజం ఉందో తెలియదు గాని ప్రస్తుతం ఈ ప్రచారం మాత్రం జోరుగా సాగుతుంది. అదే టైమ్‌లో టీడీపీ సైతం ఇక్కడ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తుంది. మహాకూటమితో పొత్తుతో భాగంగా మాజీ టీ కాంగ్రెస్ సీనియర్‌ లీడర్‌ మర్రి శశిధర్‌ రెడ్డి సైతం ఇక్కడ పోటీ చేసే ఛాన్స్‌ ఉంది. ఏదేమైన సనత్‌నగర్‌ రాజకీయం మాత్రం గ్రేటర్‌లోనే యమా హాట్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: