తెలంగాణ‌లో సీఎం కేసీఆర్‌కు స‌మానంగా ప్ర‌జాదర‌ణ సంపాదించిన‌ నేత‌ల్లో ఆయ‌న మేన‌ల్లుడు హ‌రీశ్‌రావ్ పేరు మొద‌టి వ‌రుస‌లో వినిపిస్తుంది! గ‌త కొన్ని రోజులుగా తెలంగాణ అంత‌టా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట‌.. హ‌రీశ్‌రావుకు అన్యాయం జ‌రుగుతోంది! ఆయ‌న స‌న్నిహితుల నుంచి రాజ‌కీయాల గురించి కొంచెం అవ‌గాహ‌న ఉన్న‌వారెవ‌రైనా ఇదే మాట చెబుతున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి ఇది మ‌రింత తీవ్ర‌మ‌వుతోంది. `ఇలా ఆద‌రాభిమానాలు ఉన్న‌ప్పుడే రాజ‌కీయాల నుంచి విర‌మించుకుంటే బాగుంటుందేమో` అని ఆయన చేసిన‌ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం కూడా రేపాయి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా.. ప్ర‌తిప‌క్షాల నుంచి టీఆర్ఎస్‌లోకి నాయ‌కుల‌ను తీసుకురావ‌డంలో హ‌రీశ్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే!  ఈ నేప‌థ్యంలో ఆయ‌న అనుచ‌రుల‌తో పాటు ఈ నేత‌లు ఏ నిర్ణ‌యం తీసుకోబోతున్నారు? అనే ప్ర‌శ్న కొంత‌కాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు వీరంతా మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి చేరుతున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే ఒక‌రిద్ద‌రు నేత‌లు కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకోగా.. మ‌రి కొంత‌మంది అదే బాట‌లో ప‌య‌నించ‌బోతున్నార‌ని స‌మాచారం!

Image result for telangana

`ముంద‌స్తు` ఎఫెక్ట్ టీఆర్ఎస్‌పై బాగా ప్ర‌భావితం చూపుతోంది. ఒకేసారి 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు కేసీఆర్‌! అయితే టికెట్‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న వారంతా తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఈ అసంతృప్తి సెగ‌లు రాష్ట్ర వ్యాప్తంగా చెల రేగుతున్నాయి. కొంద‌రు నేత‌లు ఇప్ప‌టికే వేరొక దారి చూసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా కొత్తవాళ్లే ఉన్నారు. కొంద‌రు పాత వాళ్లు. వీరంతా హరీష్‌రావుతో వ్యవహారాలు నడిపిన వాళ్లే. ప్ర‌ముఖంగా వీరంతా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ సంస్థాగ‌తంగా అంత బలంగా లేదు. కానీ తర్వాత కేసీఆర్ అధికార మంత్ర దండాన్ని వాడారు. తెలుగుదేశం, కాంగ్రెస్ మాత్రమే కాదు.. లెఫ్ట్ పార్టీలనే తేడా చూపకుండా ప్రతి ఒక్కరినీ ఆకర్షించారు. ఇందులో ఆకర్ష్‌లో హరీశ్‌ రావుదే కీలక పాత్ర. నిధుల హామీలు కావొచ్చు.. నియోజకవర్గ అభివృద్ధి పనులు కావొచ్చు. వ్యక్తిగతంగా బెదిరింపులు, బుజ్జగింపులు కావొచ్చు. అన్నీ ఆయ‌నే చూసేవారు. 


దీంతో సహజంగానే వారంతా హరీశ్‌తో టచ్‌లో ఉండటం ప్రారంభించారు. ఇప్పుడు హరీశ్‌రావుకే టీఆర్ఎస్‌లో ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేద‌నే విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా పార్టీ వీడిపోతున్నారు. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ దగ్గర నుంచి.. పటాన్ చెరులోని సఫాన్ దేవ్ అనే నేత వరకూ అనేక మంది కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. ఇందులో సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్ నేతలు కూడా ఉన్నారు. గజ్వేల్ పర్యటనకు వెళ్లిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ సమక్షంలో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కేసీఆర్ ఫాం హౌస్ ఉన్న జగదేవపూర్ ఎంపీపీ రేణుక ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అన్ని పార్టీల నేతలను కలిపేసుకుంది. వీరందరినీ దగ్గరుండి హరీశ్‌ రావే చేర్పించారు. 


ఒక‌ సిట్టింగ్ ఎమ్మెల్యే తప్ప నియోజకవర్గంలో మెరుగైన స్థానాల్లో ఉన్న వారంతా కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. వీరిలో మొదటి నుంచి హరీశ్‌ అనుచరులుగా పేరు పడిన వాళ్లు కూడా ఉన్నారు. ముందు ముందు ఈ వలసలు మరింత పెరుగుతాయని.. టీఆర్ఎస్ వర్గాల్లోనే ఆందోళన వ్యక్తమవుతోంది. మ‌రి ఈ వ‌ల‌స‌లు మ‌రింత ఎక్కువ‌వుతాయ‌న‌డంలో సందేహం లేదంటున్నారు విశ్లేష‌కులు. అస‌లే టీఆర్ఎస్‌కు ప్రాణ సంక‌టంలా మారిన ఎన్నిక‌ల్లో.. వీటిని కేసీఆర్ ఎలా ఆపుతారో వేచిచూడాల్సిందే! 



మరింత సమాచారం తెలుసుకోండి: