టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న వాడీవేడి ప్ర‌సంగాల‌తో మ‌ళ్లీ ప్ర‌తిపక్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు. మునుప‌టి కంటే త‌న మాట‌ల్లో ఘాటు త‌గ్గింద‌ని వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు.. ధీటైన స‌మాధానం చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబుపై చేస్తున్న విమర్శ‌లు హీట్ పెంచుతున్నాయి. టీడీపీకి ఓటేస్తే అమ‌రావ‌తికి ఫైళ్లు తీసుకు పోవాల్సిందేనని, కాంగ్రెస్‌ను ఓటేస్తే ఢిల్లీ పెద్ద‌ల కాళ్ల ద‌గ్గ‌ర పడి ఉండాల్సిందేనని.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్న‌ది? ఒక్క‌సారి ఆలోచించండి అంటూ సెంటిమెంట్ అస్త్రాలు ప్ర‌జ‌ల‌పై సంధిస్తున్నారు. మ‌ళ్లీ తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెడ‌తారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు! త‌ప్పులెన్ను వారు త‌మ త‌ప్పులెరుగ‌రు అన్న చందంగా.. ప్ర‌తిప‌క్షాల‌కు ఓటేస్తే అమ‌రావ‌తి, ఢిల్లీ పోవాల్సిందే అనుకుందాం! మ‌రి ఈ నాలుగేళ్ల‌లో ప్ర‌జ‌లు కేసీఆర్‌ను క‌ల‌వ‌డానికి ఎన్నిసార్లు వ‌చ్చారు? ఇక‌ టీఆర్ఎస్ నేత‌లు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీఆర్ ద‌ర్శ‌నం ఎన్నిసార్లు ద‌క్కింది? ఆయ‌న ద‌ర్శ‌న భాగ్యం కోసం ప్ర‌జల సొమ్ముతో నిర్మించిన ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముందు ఎంత‌లా ప‌డిగాపులు కాశారు? మ‌రి ఆత్మ‌గౌర‌వం కేసీఆర్‌కు తాకట్టు పెట్టినా ఫ‌ర్వాలేదా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి!!

Image result for telangana

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. కేసీఆర్ పాల్గొన్న కొంగ‌ర‌క‌లాన్ స‌భ‌కు ఆశించిన స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ ల‌భించ‌లేద‌ని పార్టీ వ‌ర్గాలే అసంతృప్తి వ్య‌క్తం చేశాయి. కేసీఆర్ ప్ర‌సంగంలోనూ వాడి తగ్గింద‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఈ నేప‌థ్యంలో న‌ల్ల‌గొండ‌లో నిర్వ‌హించిన స‌భ‌లో మాత్రం విప‌క్షాలపై పంచుల‌తో.. మునుప‌టి కేసీఆర్‌ను గుర్తుచేశారు. మ‌రీ ముఖ్యంగా చంద్ర‌బాబును టార్గెట్ చేసుకుని.. మ‌హా కూట‌మిపై విమ‌ర్శ‌ల దాడి చేశారు. తెలంగాణ ద్రోహులు అంటూ విరుచుకుప‌డ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ ర‌గిల్చి.. ప్ర‌జ‌ల్లో భావోద్వేగాలను ఓట్లుగా మ‌లుచుకోవాల‌నే వ్యూహంతో ఆయ‌న అడుగులు వేస్తున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ప‌దేప‌దే గుర్తుచేస్తున్నారు. టీడీపీ అంటే అమ‌రావ‌తి, కాంగ్రెస్ అంటే ఢిల్లీ అంటూ చెబుతున్నారు. అయితే దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  


ఢిల్లీ వెళితే కాంగ్రెస్ నేతలు రాహుల్  గాంధీని కలుస్తారు. అమరావతి వెళితే తెలుగుదేశం నేతలను చంద్రబాబు కలుస్తారు. ఎందుకంటే వారు పార్టీ అధ్య‌క్షులు క‌నుక‌. వారు ఉండేది అక్క‌డే! మరి హైదరాబాద్ లో ఉన్నా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నేతలకు ఆ పార్టీ అధినేత‌ కేసీఆర్ మాత్రం క‌ల‌వ‌రు. నాలుగున్నరేళ్ల‌లో తెలంగాణలో ఏం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉండటమే తప్పా? అంటే.. మరి పార్లమెంట్ ఢిల్లీలో ఉందని తెలంగాణ బిల్లును ఆపుకోలేదు కదా? ఇదే కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీని కేసీఆర్‌.. కుటుంబంతో సహా కలిశారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు! ఢిల్లీలో సోనియాను కేసీఆర్ కలవగా లేని తప్పు.. సొంత పార్టీ నేతలు కలిస్తే తప్పేంటి? అనేదే ప్ర‌శ్న‌! కేసీఆర్ లెక్కే నిజం అయితే ఆదిలాబాద్ నేతలు పార్టీ టిక్కెట్ల కోసం హైదరాబాద్ వచ్చి అధిష్టానాన్ని ఎందుకు కలవాలి?  వాళ్ల‌కు ఆత్మ గౌరవం లేనట్లేనా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి! ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా ఆత్మగౌరవం అంటే? సాధ్యమవుతుందా?


హైదరాబాద్ లో ఉండి కూడా కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కలవని సందర్భాలు ఎన్నో. కేవలం ఎంపిక చేసిన నేతలకు తప్ప.. చాలా మందికి ప్రగతి భవన్ గేటు బ‌య‌టే ఉండిపోవాల్సిందే! ఒక్క‌ ఎమ్మెల్యేలే కాదు.. మంత్రులదీ ఇదే పరిస్థితి. ఈ తీరు చూసి అసెంబ్లీ రద్దుకు ముందే ఓ సీనియర్ మంత్రి.. తనను పిలిస్తే తప్ప మరోసారి ప్రగతి భవన్ వైపు రానని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఒక్క మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు.. అధికారులకూ ప్రగతి భవన్ లో కాలు పెట్టేందుకు కూడా వెనుకాడ‌తారు. ప్రజల డబ్బుతో కట్టిన ప్రగతి భవన్‌లో ఏ అంశంపై అయినా ప్రజలు సీఎం ను కలసి వినతిపత్రాలు అందజేస్తామంటే అది జరిగే పని కాదు. సామాన్యులకు ప్రగతి భవన్ తాళాలు ఏ రోజూ తెరుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు? మ‌రి ఇన్ని లోపాలు ప‌క్క‌నే పెట్టుకుని.. ఎదుటివారిని దుమ్మెత్తిపోయ‌డం ఆయ‌న‌కే చెల్లుతుందేమో!! 


మరింత సమాచారం తెలుసుకోండి: