ఔన‌న్నా.. కాద‌న్నా ఇది నిజం!  తాను ప‌ట్టించుకోన‌ని, తెలంగాణ రాజ‌కీయాల‌తో త‌న‌కు సంబంధం లేద‌ని పైకి ఎంతగా చెబుతున్నా.. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు ఆ రాష్ట్ర రాజకీయాల్లో అధికారం మారేందుకు త‌న‌వంతు శాయ‌శ క్తులా తెర‌వెనుక చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు తెలంగాణ రాజకీయ విశ్లేష‌కులు. తెలంగాణ‌లో త‌న పార్టీని పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేలా చేసిన కేసీఆర్‌పైనా, త‌న పార్టీకి ప్ర‌ధాన అవ‌రోధంగా ఉన్నటీఆర్ ఎస్‌పైనా ఆయ‌న క‌త్తిక‌ట్టార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు అందివ‌చ్చిన అవ‌కాశాన్ని ఆయ‌న స‌ద్వినియోగం చేసుకుంటున్నార‌ని చెబుతు న్నారు. మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన కాంగ్రెస్‌-క‌మ్యూనిస్టులు-తెలంగాణ జ‌న‌స‌మితితో పొత్తు పెట్టుకునే విష‌యంలో చంద్ర బాబు ప్ర‌మేయం పూర్తిగా ఉంద‌ని చెబుతున్నారు. 


ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే తెలంగాణ టీడీపీ నాయ‌కులు అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. ఆయ‌న ప్ర‌మేయం లేకుం డా అడుగు ముందుకు వేసే సాహ‌సం కూడా టీడీపీ తెలంగాణ నాయ‌కులు చేయ‌లేర‌ని అంటున్నారు. నిత్యం చంద్ర బాబు ఏదో ఒక రూపంలో తెలంగాణ రాజ‌కీయాలపై స్పందిస్తున్నార‌ని, అక్క‌డి వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ద్వారా టీఆర్ ఎస్‌ను దెబ్బ‌కొట్టేందుకు బాబు వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తున్నార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 500 కోట్ల రూపాయ‌ల‌నుకూడా పార్టీకి ఖ‌ర్చుల కోసం ఇస్తున్న‌ట్టు ఇటీవ‌ల ఆప‌ద్ధ‌ర్మ సీఎం, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే, ఇంత మొత్తం కాక‌పోయినా.. హైద‌రా బాద్‌లోని ఐటీ కంపెనీల నుంచి 200 కోట్ల‌ను సేక‌రించేందుకు బాబు వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్టు చెబుతున్నారు. 


ఇక‌, టీడీపీ ఐటీ విభాగాన్ని కూడా ఆయ‌న విస్తృతంగా తెలంగాణ ఎన్నిక‌ల్లో వినియోగించేందుకు ప్లాన్ చేసుకున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల ఏపీనిఘా విభాగం అధికారుల‌ను హైద‌రాబాద్‌లోనే మ‌కాం వేయించి అక్క‌డి టీడీపీ గెలుపు ప‌రిస్థితిని అంచ‌నా వేయించుకున్నార‌ని, దీంతో ఏపీలో మావోయిస్టులు రెచ్చిపోయార‌ని క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. ఈవిష‌యాన్ని అధికారులు కానీ, పార్టీ కానీ, ప్ర‌భుత్వం కానీ ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదేస‌మ‌యంలో టీఆర్ ఎస్ ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీష్‌రావు ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఏపీ ఇంటిలిజెన్స్ అధికారుల‌కు హైద‌రాబాద్‌లో ఏం ప‌ని అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇక‌, టీడీపీ ప్ర‌చారంలో ఏపీకి చెందిన ఎమ్మెల్యే, సీఎం చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌కృష్ణ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఖ‌మ్మంలో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. రాబోయే రోజుల్లో మ‌రింత మంది ఏపీకి చెందిన నాయ‌కులు అక్కడ ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇలాంటి ప‌రిణామాలు చూస్తే.. తెలంగాణ రాజ‌కీయాల‌ను చంద్ర‌బాబు ఏపీ నుంచే శాసిస్తున్నార‌ని అనుకోవ‌డంలో వింత క‌నిపించ‌డం లేదని అంటున్నారు విశ్లేష‌కులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: