ఏపీ సీఎం చంద్ర‌బాబును ఘోర అవ‌మానం నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ‌య‌ట ప‌డేసింది.  వైసీపీ ఎంపీలు ఏపీ ప్ర‌త్యేక హోదా కోసం త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయా స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రగాల‌ని, అప్పుడు త‌మ స‌త్తా చాటుతామ‌ని చంద్ర‌బాబు అప్ప‌ట్లోనే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే, ఆయా స్థానాల్లో చంద్ర‌బాబు త‌ల‌కిందులుగా త‌పస్సు చేసినా గెలిచే ప‌రిస్థితి లేదు.  నిజానికి ఎక్క‌డైనా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జాప్ర‌తినిధులు రాజీనామాలు చేస్తే.. ఆయా స్థానాల్లో ఎవ‌రూ పోటీకి దిగ‌రు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా తాము వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన సీట్ల‌లో పోటీకి దిగుతామ‌ని ప్ర‌క‌టించి ఆయ‌న అప్ప‌ట్లోనే అభాసుపా ల‌య్యారు. ఒంగోలు ఎంపీ వైవీసుబ్బారెడ్డి, తిరుప‌తి ఎంపీ వ‌ర ప్ర‌సాద్‌, క‌డ‌ప ఎంపీ మిధున్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి, రాజంపేట ఎంపీ అవినాష్ రెడ్డిలు జ‌గ‌న్ పిలుపు మేరకు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో పోరాడారు. 


మొట్ట‌మొద‌ట కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు మొగ్గుచూపింది కూడా వైసీపీ అధినేత జ‌గ‌నే. ఆయ‌న అవిశ్వాసం పెట్టి మోడీతో ఢీ అనేందుకు సిద్ధ‌మైన నేప‌థ్యంలో ఎటూ దారి క‌నిపించ‌క‌.. తాను కూడా జ‌గ‌న్‌తో క‌లుస్తాన‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు అనూహ్యంగా తానే త‌న ఎంపీల‌తో అవిశ్వాసం ప్ర‌క‌టిస్తాన‌ని, కేంద్రంపై నోటీసులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, ఈయ‌న‌క‌న్నా ముందుగానే ఏపీ ప్ర‌యోజ‌నాల పై స‌రైన ల‌క్ష్యంతో ముందుకు పోయారు జ‌గ‌న్‌. ఈ క్ర‌మంలోనే వైసీపీ ఉన్న ఐదుగురు ఎంపీల‌తోనే అవిశ్వాసం ప్ర‌క‌టించారు. పార్ల‌మెంటులో ఆయ‌న త‌న ఎంపీల‌తో అవిశ్వాసం తీర్మానం ఇప్పించారు. అయితే, దీనిని కేంద్రం అనూహ్యంగా అడ్డుకుంది. ఒకప‌క్క తెలంగాణ ఎంపీలు, మ‌రోప‌క్క త‌మిళ‌నాడు ఎంపీల‌తో అప్ప‌ట్లో పార్ల‌మెంటులో యాగీ చేయించిన కేంద్రం.. దీనిని అడ్డు పెట్టుకుని వైసీపీ ఎంపీలు ఇచ్చిన తీర్మానంపై చ‌ర్చ‌లేకుండా చేసింది. 


ఈ క్ర‌మంలోనే విసుగెత్తిన జ‌గ‌న్‌.. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీ ప‌డేది లేద‌ని ప్ర‌క‌టించారు. అనుకున్న విధంగానే ఆయ‌న త‌న ఎంపీల‌తో రాజీనామాలు చేయించారు. ఈ రాజీనామాల విష‌యంలోనూ చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. వైసీపీ ఎంపీలు త‌మ రాజీనామాలు ఆమోదించుకోవ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. తీరా ఆమోదం పొందిన త‌ర్వాత‌.. కూడా ఆయ‌న వికృత రాజ‌కీయాల‌ను మానుకోలేదు. కేంద్రంపై పోరాటం చేయాల్సిన వైసీపీ ఎంపీలు తోక‌ముడిచారంటూ వ్యాఖ్యానించారు. అదేస‌మయంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఖాళీ అయిన ఈ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే పోటీ చేసి వైసీపీకి గ‌ట్టిగా బుద్ధి చెబుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక‌, తాజాగా ఎన్నిక‌ల సంఘం వీటిపై క్లారిటీ ఇచ్చింది. ఈ స్థానాల‌కు ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేద‌ని తేల్చి చెప్పింది. మొత్తానికి ఒక‌ర‌కంగా ఈసీ చంద్ర‌బాబుకు మేలే చేసింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. చంద్ర‌బాబు ఆయా స్థానాల్లో ఘోర ఓట‌మిని చ‌విచూడ‌డం ఖాయ‌మ‌ని.. అయితే, ఈ సీ నిర్ణ‌యంతో ఆయ‌న బ‌తికి పోయార‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: