ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల్లో మార్పులు, చేర్పులు అంతే వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని కృత నిశ్చ‌యంతో ఉన్న వైసీపీలో మార్పులు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. కీల‌క‌మైన రాజ‌ధాని గుంటూరు జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డిచిన నాలుగేళ్లుగా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లుగా ఉన్న వారిని ప‌క్క‌కు పెట్టి కొత్త‌వారికి ఇక్క‌డ అవ‌కాశం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చిల‌క‌లూరిపేట, గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు చేసిన జ‌గ‌న్‌.. ఇప్పుడు మ‌రో నియోజ‌క‌వ‌ర్గంలోనూ మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. 


జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క‌మైన తాడికొండలో వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను మారుస్తున్నార‌నే వార్త‌లు జోరందు కున్నాయి. వాస్త‌వానికి గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కత్తెర హెన్రీ క్రిస్టియానా ఇక్క‌డ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఢీ కొట్టి గెలిచే పరిస్థితిలో లేరని జగన్‌కు పలు నివేదికలు అందాయట. తాడికొండ నియోజకవర్గం ఏపీ రాజధాని కేంద్రం కావడంతో ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు వల్ల టీడీపీకి సానుభూతి పరులు ఎక్కువ అయ్యారని... ఇక్కడ నుంచి సాధారణ వ్యక్తిని పోటీలో దింపితే గెలుపు అంత సులువు కాదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. 


ఈ క్రమంలోనే పలు నివేదికలు తర్వాత ఇక్కడ ఆర్థికంగా, ఇతర‌త్రా సామాజిక సమీకరణల్లో మరో బలమైన అభ్యర్థిని దింపాలని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే డాక్ట‌ర్ శ్రీదేవి పేరు తెర‌మీదికి వ‌చ్చింది. ఆమెను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించబోతున్నట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. దీనిపై రెండు రోజుల్లోనే ఉత్త‌ర్వులు రావొచ్చని తెలుస్తోంది. అయితే, డాక్ట‌ర్ శ్రీదేవితాడికొండ నియోజ‌క‌వ‌ర్గానికే కాకుండా గుంటూరు జిల్లాకు కూడా కొత్త‌కావ‌డంతో ``ఆమె ఎవ‌రు?`` అనే ప్ర‌శ్న ఇప్పుడు జిల్లా రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. డాక్టర్‌ శ్రీదేవి హైదరాబాద్‌లో మెహిదీపట్నంలో డాక్టర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి మాదిగ సామాజికవర్గానికి చెందిన శ్రీదేవి తాడికొండ మండలానికి చెందినవారే.


ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు కావడం, ఆయన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మేనమామ‌ రవింద్ర‌నాథ్‌ రెడ్డికి బంధువు కావడంతో వారి ద్వారానే శ్రీదేవి జగన్‌ను కలిసినట్టు తెలిసింది. ఇక శ్రీదేవికి గుంటూరులోని లలితా హాస్పటల్స్ యాజమాన్యం నుంచి కూడా సపోర్ట్‌ ఉన్నట్టు సమాచారం. ఇటు సామాజిక సమీకరణల పరంగా రెండు కులాల ఈక్వేషన్లతో పాటు అటు ఆర్థికంగా శ్రీదేవి బలవంతురాలు అని నిర్ణయానికి వచ్చిన జగన్‌ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖ‌రారు చేసినట్టు తెలిసింది. శ్రీదేవి తాడికొండలో పాత వైసీపీ క్యేడర్‌ను కలుపుకుని ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి పోరు ఖాయమ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి జ‌గ‌న్ ఈక్వేష‌న్ ఇక్క‌డ ఏమేర‌కు ప‌నిచేస్తుందో చూడాలి. ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ తెనాలి శ్రావ‌ణ్‌కుమార్‌కుటికెట్ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు. ఈనేప‌థ్యంలో మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: