భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎందరో అభిమానులు స్టేడియానికి క్యూ కడుతుంటారు. కొన్నిసార్లు అభిమానం మితిమిరిన సందర్భాల్లో తమ అభిమాన క్రీడాకారుడితో సెల్ఫీ దిగాలనే ఉత్సాహంతో ఏకంగా మైదానంలోకే దూసుకొస్తుంటారు. టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కిస్సిచ్చి సెల్ఫీ దిగి హల్‌చల్ చేసిన కడప జిల్లాకు చెందిన మొహమ్మద్ ఖాన్‌పై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.


భారత్విండీస్ జట్ల మధ్య శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో రెండో టెస్టు సమయంలో ఈ సంఘటన జరిగింది.  ఈ మ్యాచ్ కోసం 1500 మంది పోలీసుల్ని కేటాయించినట్లు రాచకొండ సీపీ ఘనంగా ప్రకటించారు. పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎలాంటి ఆవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా గొప్పలు చెప్పారు. అయితే.. ఇందుకు భిన్నమైన ఘటన ఒకటి చోటు చేసుకొనే సరికి అందరూ షాక్ తిన్నారు.  

Fan, Breache Security, 2nd Test, Tries To Kiss, Virat Kohli

కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్నట్లు కనిపించగానే.. స్టాండ్స్ నుంచి వచ్చే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి.. మైదానంలోకి దూసుకెళ్లటమే కాదు.. కోహ్లీ వద్దకు నేరుగా చేరుకొని అతడు వారిస్తున్నా వినకుండా సెల్ఫీ దిగాడు. అనంతరం హగ్ చేసుకొని.. ముద్దాడాడు.  ఏం జరుగుతోందో తెలియక అంప్లైర్లు, ఆటగాళ్లు, స్టాండ్స్‌లోని ప్రేక్షకులు అలాగే చూస్తూ ఉండిపోయారు.


కోహ్లీతో సెల్ఫీ ముచ్చట తీరడంతో మొహమ్మద్ ఖాన్ ముఖం వెలిగిపోతుండగా, బౌండరీ లైన్ వద్ద ఉన్న బౌన్సర్లు యువకుడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు.  తనకు కోహ్లీ అంటే ప్రాణమని.. ఏం జరిగినా ఫర్లేదనుకొనే తాను అలా చేసినట్లుగా మహ్మద్ వెల్లడించాడు. అతడిపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: