టీడీపీ ప‌రువును సొంత పార్టీ నేత‌లే బ‌జారున ప‌డేస్తున్నారా?  పార్టీని కంటికి రెప్ప‌లా కాపాడుతూ, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి అధికారంలోకి తీసుకు రావాలని అధినేత చంద్ర‌బాబు చేస్తున్న కృషిని వీరు ప‌ట్టించుకోవ‌డం లేదా?  త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల‌కోసమే పార్టీని వాడుకుంటున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి వంటి టీడీపీకిమంచి ప‌ట్టున్న జిల్లాలోనే పార్టీ ప‌రువును బ‌జారుకీడ్చేలా వ్య‌వ‌హ‌రిస్తు న్న నాయ‌కుల సంఖ్య పెరుగుతోంది. పోతే.. పోనీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోటికెట్ రాదు! అంతేక‌దా? అనుకూంటూ వారు త‌మ ప‌ద్ధ‌తుల్లో ముందుకు సాగుతున్నారు. నిజ‌మే వారికి టికెట్ రాక‌పోవ‌చ్చు. కానీ, పార్టీకి పోయిన ప‌రువు వ‌స్తుందా? మ‌ళ్లీ ఇక్క‌డ వేరే నాయ‌కుడికి టీడీపీ త‌ర‌ఫున ప్ర‌జ‌లు ఓట్లు వేస్తారా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారిపోయింది. విష‌యంలోకి వెళ్తే.. తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పిల్లి అనంత‌ల‌క్ష్మి ఉన్నారు. 

Related image

2014 ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యం సాధించారు. మ‌హిళ కాబ‌ట్టి మ‌రింత ఎక్కువ‌గా పార్టీకి సేవ చేస్తుంద‌ని చంద్ర‌బాబు అనుకుని ఉండోచ్చు. కానీ, అలా జ‌ర‌గ‌డం లేదు స‌రిక‌దా.. పార్టీ ప‌రువు పోయేలా ఆమె, ఆమె భ‌ర్త వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సీనియ‌ర్ నాయ‌కులు త‌ల‌బాదుకుంటున్నారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో నిర్మించిన రోడ్ల‌కు సంబంధించిన క్రెడిట‌న్ ఎమ్మెల్యే త‌న ఖాతాలో వేసుకోవాల‌ని బావించారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, దీనికి సంబంధించిన‌ శిలాఫలకాలపై వేసిన ఫొటోలు మాత్రం ఇప్పుడందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పసుపు రంగుతో, ఫొటోలతో శిలాఫలకాలు వేయడం, దాంట్లో ప్రజాప్రతినిధి కాని ఎమ్మెల్యే భర్త ఫొటోను ముద్రించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎన్నుకున్న మహిళా నేతల విషయంలో పురుషాధిక్యం పెత్తనం చెలాయిస్తున్న విషయం తెలిసిందే. స‌ర్పం చైనా, ఎంపీపీ అయినా, జెడ్పీటీసీ సభ్యులు అయినా, ఎమ్మెల్యే అయినా భర్తల పెత్తనం, షాడోల అజమాయిషీ ఎక్కువగా ఉందనేది సర్వత్రా విన్నదే. 


కానీ, ఎమ్మెల్యే భర్త హోదాలో ఏకంగా శిలాఫలాకాలపై ప్రజాప్రతినిధి కాని పిల్లి సత్తిబాబు ఫొటోను ముద్రించడం చూస్తుంటే ఇక్కడ ఏ స్థాయిలో షాడో ఎమ్మెల్యేగా ఆయన దందా సాగిస్తున్నారో కళ్లకు కట్టినట్టుగా కనబడుతున్నద‌ని పార్టీలోని సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్తగా తప్ప పిల్లి సత్తిబాబుకు మరే హోదా లేదు. కనీసం వార్డు మెంబర్‌గా, సర్పంచ్‌గా, కార్పొరేటర్‌గా కూడా ప్రాతినిధ్యం వహించడం లేదు. కానీ, అధికారులంతా ఆయన కనుసైగల్లోనే పనిచేస్తున్నారు.

ఇప్పటికే సూపర్‌ ఎమ్మెల్యేగా అన్నింట్లోనూ తలదూర్చుతున్నారు. ఎమ్మెల్యేను వెనక ఉంచి అంతా తానై వ్యవహరిస్తున్నారు.  ఏ ఒక్క అధికారి నియోజకవర్గానికి వచ్చినా తొలుత ఆయనను కలవాల్సిందే. ఆయనకు చెప్పే నియోజకవర్గంలోకి రావాలి. అంతకన్న ముందు నియోజకవర్గంలో పనిచేయాలనుకుంటే సత్తిబాబు అనుమతి తీసుకోవాలి. ఆ స్థాయిలో నియోజకవర్గంలో పెత్తనం చెలాయిస్తున్నారు. దీంతో అనంత‌ల‌క్ష్మిపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు ఇలాంటి చ‌ర్య‌ల‌ను ఖండించ‌క‌పోతే.. ఎన్నిక‌ల్లో గ‌ట్టిగా ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డం ఖాయ‌మ‌నే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీ ప‌రువు కూడా న‌వ్వుల పాల‌వుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: