రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. రాష్ట్రంలో ప్ర‌భంజ‌నం సృష్టిస్తాడ‌ని, సీఎం అవుతాడ‌ని, సామాజిక న్యాయం జ‌రుగుతుంద‌ని భావించిన స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోకి దూసుకు వ‌చ్చిన ప్ర‌జారాజ్యం పార్టీ అన‌తి కాలంలో కేవ‌లం ఒక ఎన్నిక‌ల వ్య‌వ‌ధిలోనే కాంగ్రెస్‌లో విలీనం అయిపోవ‌డం రాష్ట్ర చ‌రిత్ర‌లో ఓ పీడ‌క‌ల‌గా మిగిలిపోయింది. మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం ప‌రిస్థితి ఇలా అయింది. ఇక‌, ఆయ‌న 2009 ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీని న‌డిపించ‌డం సాధ్యం కాక పోయి పోయి కాంగ్రెస్‌కు స‌రెండ‌ర్ అయి.. తాను కేంద్రంలో మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. అస‌లు వాస్త‌వానికి చిరంజీవి గురించి తెలిసిన వారు ఎవ‌రూ కూడా ఇలా జ‌రుగుతుంద‌ని ఊహించ‌లేక పోయారు. జ‌రిగాక చెప్పుకొన్నారు. 


ఇక‌, ఇప్పుడు ఆయ‌న కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడిగానే ఉన్నారు. అయితే, ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తు న్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో రాజ‌కీయాలు వ‌డివ‌డిగా మారుతున్న నేప‌థ్యంలో చిరంజీవి నిర్ణ‌యం అత్యం త ప్రాధాన్యం సంత‌రించుకుంది. చిరంజీవి సోద‌రుడు ప‌వ‌న్‌.. జ‌న‌సేన పార్టీ పెట్టుకుని దూసుకుపోతున్నాడు. వ‌చ్చే ఎ న్నిక‌ల్లో త‌న‌ను సీఎంను ఎందుకుచేయాలో చెప్పుకొస్తున్నాడు. అంతేకాదు సీఎంను చేయ‌క‌పోయినా.. తాను ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోజ‌న‌సేన అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం నిర్ణాయ‌క శ‌క్తిగా మాత్రం అవ‌త‌రించ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్ప‌డం ఖాయ‌మ‌ని నిన్నమొన్న‌టి వ‌ర‌కు కూడా వార్త‌లు వ‌చ్చాయి. 


ఇప్పుడు ఆ దిశ‌గానే చిరు ప‌య‌నిస్తున్న‌ట్టు చెబుతున్నారు. చిరంజీవి తీసుకున్న‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు. మ‌రోప‌క్క‌, జ‌న‌సేన ఎన్నిక‌ల హ‌డావుడి ఊపందుకుంది. మ‌రో ఆరు మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో చిరంజీవి కూడా జ‌న‌సేన త‌ర‌ఫున ప్ర‌చారం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే.. చిరంజీవి కుమారుడు రాంచ‌ర‌ణ్.. బాబాయి(ప‌వ‌న్‌) ఆదేశిస్తే.. తాను ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఈ క్ర‌మంలో  ఇప్పుడు చిరు అడుగులు కూడా త‌మ్ముడి కోస‌మేన‌ని అంటున్నారు. సో.. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు!


మరింత సమాచారం తెలుసుకోండి: