ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణాలో రాజ‌కీయ పార్టీల జోరు పెరుగుతోంది. ప్ర‌జ‌లకు ఇస్తున్న ఎన్నిక‌ల హా మీల వ‌ర‌ద కూడా పెరుగుతోంది. ఒక పార్టీని చూసి మ‌రో పార్టీ.. ఒక నాయ‌కుడిని చూసి మ‌రో నాయ‌కుడు ఇలా ముందుకు పోతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న హామీలు కూడా లెక్క‌లు దాటిపోతున్నాయి. తాము అధికారంలోకి వస్తే.. ఇప్పుడున్న పింఛన్లను రెట్టింపు చేయడంతో పాటు రైతులకు రుణ మాఫీ చేస్తామని, నిరుద్యోగులకు భృతి ఇస్తామని టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే హామీలు గుప్పించాయి. వాస్త‌వానికి ఇప్పుడు విడుద‌ల చేసిన‌వి.. చిన్న‌పాటి మ్యానిఫెస్టోలే. పూర్తి స్థాయి మేనిఫెస్టోలను విడుదల చేసినప్పుడు వాటిలో మరిన్ని హామీలు ఇచ్చే అవకాశాలున్నాయి. 

Image result for unemployment telangana

దీంతో ఆయా మ్యానిఫెస్టోల‌ను చూస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు నోరెళ్ల బెడుతున్నారు. రైతు రుణ మాఫీకి ఒక్క ఏడాది నిధులు కేటాయిస్తే సరిపోతుంద‌ని, మిగిలిన పథకాలకు ఏటా నిధులను కేటాయించాల్సిందేన‌ని, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయా నిధులు ఎలా వ‌స్తాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ పార్టీలు ప్ర‌క‌టించిన వ‌రాల జ‌ల్లులు చూస్తే.. రైతులు, నిరుద్యోగులు, పింఛన్ల పథకాలకే దాదాపు రూ.50 వేల కోట్లు అవసరమవుతాయి! ఇక టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే ఏడాదికి సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా! 


ఈ లెక్కన ఐదేళ్లలో దాదాపు 7.5 లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది! ఈ హామీలను నెరవేర్చాలంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆదాయం సరిపోతుందా? అన్నది చర్చనీయాంశమైంది. నిరుద్యోగులకు రూ.3016 భృతి చెల్లిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. అసలు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత మంది ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో దాదాపు 13 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని కేసీఆర్‌ ప్రకటించారు. అయితే వీరి సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. కాంగ్రెస్‌ నేతలు కూడా 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని, ఒక్కొక్కరికి నెలకు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. 

Image result for telangana

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్‌టైం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు 24.55 లక్షల మంది ఉన్నారు. అయితే కనీస విద్యార్హత డిగ్రీగా పరిగణిస్తే 15.90 లక్షల మంది అభ్యర్థులు అర్హులు అవుతారు. మ‌రి ఇంత మందికి నెల‌నెలా భృతి అంటే ఎక్క‌డ నుంచి తెస్తారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మొత్తానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇస్తున్న హామీలు తెలంగాణా కొంప ముంచ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: