వైసీపీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌పై నెటిజ‌న్లు స‌టైర్లు పేలుస్తున్నారు. ముద్దులు, సెల్ఫీలు అంటూ ఆయ‌న చేస్తున్న పాద యాత్ర‌పై విమ‌ర్శ‌ల బాణాల‌ను వ్యంగ్యంగా గుప్పిస్తున్నారు. ఇది ప్ర‌జాసంక‌ల్ప ముద్దుల యాత్ర‌గా ఒక‌రు పేర్కొంటుంటే... మ‌రికొంద‌రు..``నేను ఏ పార్టీలోనూ లేను. అయితే, జ‌గ‌న్ చేస్తున్న యాత్ర నాకు భ‌లే మ‌జాను పెంచుతోంది`` అంటూ మ‌రో నెటిజ‌న్ చేసిన‌కామెంట్ వైర‌ల్ అవుతోంది. నిజానికి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు జ‌గ‌న్ ఈ పాద‌యాత్ర‌ను సంక‌ల్పించారు. మొద‌టి నాలుగు, ఐదు నెల‌లు ఈ దిశ‌గానే పాద‌యాత్ర సాగింది. అదేస‌మ‌యంలో ఆయ‌న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. కానీ, రానురాను ఆయ‌న కేవ‌లం ముద్దులు, ఆశీర్వాదాల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నార‌నే విమ‌ర్శ‌లు జోరందుకుంటున్నాయి. ఏ నియోజ‌క‌వ‌ర్గంలోకి వెళ్తే.. అక్క‌డి ఎమ్మెల్యేని తిట్టిపోయ‌డాన్ని స‌హ‌జంగానే భావించిన ప‌స‌లేని విమ‌ర్శ‌లు కూడా ఉంటున్నాయ‌నే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. 


వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేందుకు అవ‌స‌ర‌మైన మార్గాన్ని సుగ‌మం చేసుకునేందుకు జ‌గ‌న్ ఎంచుకున్న పాద‌యాత్ర‌, నిర్దేశించుకున్న‌ ల‌క్ష్యంపై మొద‌ట్లో బాగానే మ‌ద్ద‌తు ల‌భించింది. కానీ, ఆయ‌న చేస్తున్న విమ‌ర్శ‌ల్లో రానురాను కొత్తద‌నం లోపించ‌డంతో ఆయ‌న‌పై పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌డం మానేశార‌నే చెప్పుకోవాలి. ఈ క్ర‌మంలోనే మీడియాల్లోనూ ఆయ‌న ఏదైనా సంచ‌ల‌న‌, వివాదాస్ప‌ద కామెంట్లు చేస్తేనే త‌ప్ప ఫొక‌స్ చేయ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం పాద‌యాత్ర చివ‌రి అంకానికి చేరుకుంది. ప్ర‌స్తుతం విజ‌య‌న‌గ‌రంలో చేస్తున్న యాత్ర త్వ‌ర‌లోనే శ్రీకాకుళంలోకి ప్ర‌వేశించ‌డం.. అక్క‌డ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయ‌డంతో ముగియ‌నుంది. ఆ త‌ర్వాత వ్యూహం ప్ర‌కారం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అంతా బాగానే ఉన్నా.. రెండు మూడు నెల‌లుగా జ‌గ‌న్ పాద‌యాత్ర తిరిగి ఓదార్పు యాత్ర‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తుండ‌డం మైన‌స్‌గా మారింద‌ని వైసీపీ అభిమానులే అంటున్నారు. 


ఇవ‌న్నీ ఇలా ఉంటే.. గ‌త న‌వంబ‌రు నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు కావొచ్చు, విప‌త్తులు కావొచ్చు వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డారు. ఈ క్ర‌మంలో ఆయా ప్రాంతాల‌కు వెళ్లి బాధితుల‌ను ఆదుకునేందుకు లేదా ఓదార్చేందుకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం కూడా వివాదానికి దారితీస్తోంది. క‌ర్నూలులో టీడీపీ నేత నిర్వ‌హించిన మైనింగ్ బ్లాస్ట్ జ‌రిగి దాదాపు 20 మంది మృతి చెందారు. వీరంతా ఒడిసా వాసులే అయినా.. కూడా.. ఇక్క‌డ నిర్వ‌హ‌ణ లోపం, లైసెన్స్ మంజూరు వంటి వాటిలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయి. అదేవిధంగా గోదావ‌రిలో ప‌డ‌వ మునిగి ప‌దుల సంఖ్య‌లో ప్రాణాలు పోయాయి. ఈ స‌మ‌యంలోనూ జ‌గ‌న్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి వారిని ఓదార్చింది లేదు. ఇక‌, ప‌క్క‌నే ఉన్న శ్రీకాకుళంలో ఇటీవ‌ల వ‌చ్చిన తుఫానుతో స‌ర్వ‌స్వం కోల్పోయిన రోడ్డున ప‌డ్డ‌వారిని ఓ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఆయ‌న వెళ్లి ఓదార్చింది కూడా లేదు. 


పోనీ.. పాద‌యాత్ర‌లోనే ఉన్నాను కాబ‌ట్టి ఈ బ‌రి నుంచి బ‌య‌ట‌కు రాను అని ఆయ‌న చెప్ప‌డానికి కూడా అవ‌కాశం లేదు. ఎందుకంటే.. ఆయ‌న ప్ర‌తి శుక్ర‌వారం హైద‌రాబాద్‌కు వెళ్తున్నారు. మ‌రి ఆయా సంద‌ర్భాల్లో విప‌క్షానికి అందిన అవ‌కాశాల‌ను జ‌గ‌న్ ఎందుకు స‌ద్వినియోగం చేసుకోలేక పోతున్నార‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఏదేమైనా.. నెటిజ‌న్లు మాత్రం జ‌గ‌న్‌యాత్ర‌ను ఆహ్వానిస్తూనే,, ఆయ‌న అనుస‌రిస్తున్న వైఖ‌రిని మాత్రం స‌టైర్ల రూపంలో విమ‌ర్శిస్తుండ‌డం గ‌మ‌నార్హం. 



మరింత సమాచారం తెలుసుకోండి: