తెలంగాణా ఎన్నిక‌ల్లో తురుపు ముక్క‌లాగా రంగంలోకి దిగిన టీడీపీ.. గ‌త ఎన్నిక‌ల అనుభ‌వాల నుంచి నేర్చిన పాఠాల‌ను వ‌ల్లెవేస్తూ.. ఇప్పుడు ఒంట‌రిగా కాకుండా.. మ‌హాకూట‌మిగా ముందుకు వెళ్తోంది. అయితే, ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు వ్యూ హాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇచ్చిన స్థానాలు తీసుకుని, కేటాయించిన టికెట్ల‌లో నే పోటీ చేయాల‌ని ఆయ‌న తెలం గాణా నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. అయితే, ఇప్పుడు తొలుత ఓకే అన్న టీడీపీ తెలంగాణా నాయ‌కులు ఇప్పుడు మాత్రం త‌మ పంతం త‌మ‌దేన‌ని చెబుతున్నారు. దీంతో టీడీపీ అస‌లు ఇంట గెలిచేనా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నా యి. సీపీఐ మినహాయిస్తే కూటమిలోని భాగస్వామ్యపక్షాలు టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌ నగరం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 

Image result for telangana

గ్రేటర్‌లోని 24 సీట్లలో 7 నుంచి 9 సీట్లలో బరిలో నిలవాలని టీడీపీ భావిస్తోంది. ఇందులో ఒకటి లేదా రెండు నియోజకవ ర్గాలు హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోనివి ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్‌ కూడా పార్టీ సీనియర్‌ నాయకులకు ఎలాగైనా అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే సనత్‌నగర్‌, కుత్బుల్లా పుర్‌, మహేశ్వరం నియోజకవర్గాలను టీడీపీ కోరుతున్నా.. ఇంకా స్పష్టత ఇవ్వలేదు.  ఆయా స్థానాలకు బదులు ఇతర చోట్ల అవకాశం కల్పిస్తామని చెబుతున్నట్టు తెలిసింది. ఇక‌, ప్రొఫెస‌ర్ కోదండ‌రాం నేతృత్వంలోని టీజేఎస్‌ రెండు, మూడు స్థానాలు అడుగుతుండగా... మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, సికింద్రాబాద్‌లో ఒకటి లేదా రెండు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం.

 

2014 ఎన్నికల్లో గెలిచిన మెజార్టీ స్థానాలు కావాలని టీడీపీ కోరుతోంది. ఎక్కువ సీట్ల కోసం పట్టుపట్టని నేపథ్యంలో కనీసం పార్టీ బలంగా ఉండే నియోజకవర్గాలై నా కేటాయించాలని టీడీపీ నాయకులు అడిగినట్టు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన పలు చోట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు టికెట్‌ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు స్థానాల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం టికెట్‌ సబితా ఇంద్రారెడ్డి ఆశిస్తోన్న నేపథ్యంలో 2014లో ఆ సీటు టీడీపీ గెలిచినప్పటికీ.. పొత్తులో భాగంగా ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ఇంకా ఒప్పు కోలేదని సమాచారం. రాజేంద్రనగర్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఒక స్థానం ఇస్తామని చెబుతున్నట్టు తెలిసింది.


మర్రి శశిధర్‌రెడ్డి కోసం సనత్‌నగర్‌ కావాలంటున్న కాంగ్రెస్‌... సికింద్రాబాద్‌ స్థానాన్ని టీడీపీకి ఇచ్చేందుకు సుముఖత చూపుతున్నట్టు సమాచారం. సికింద్రాబాద్‌ నుంచి పోటి చేసేందుకు కూన వెంకటేష్‌గౌడ్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు.  సనత్‌నగర్‌పై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకున్నా... ఇప్పుడు మరో చోటికి వెళ్లలేను.. అదే స్థానం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఎల్‌బీనగర్‌ స్థానం తనదే అని మొదటి నుంచి చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ఈ స్థానం టీడీపీకి కేటాయించే అవకాశముందని చెబుతున్నారు. అదే జరిగితే పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి బరిలో నిలిచే అవకాశముంది. ముషీరాబాద్‌ లేదా కంటోన్మెంట్‌లో ఒక స్థానం అని ప్రచారం జరిగింది. 


అయితే, టీడీపీ అగ్రనాయకుల విజ్ఞప్తి మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావు కోసం ముషీరాబాద్‌ కేటాయించేందుకు కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు. కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైందని పేర్కొంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్‌ ఆశిస్తోన్నా.. టీడీపీ గెలిచే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ స్థానం తమ్ముళ్లకు దక్కే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వెలువడితే కానీ... ఏ నియోజకవర్గం ఎవరికి..? అన్న దానిపై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం లేదు. కాగా... పొత్తుల లెక్కలు తేలాయన్న ప్రచారం నేపథ్యంలో ఆశావహులు ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీలో అంత‌ర్గ‌త డిమాండ్లు కూడా తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి: