రాముల‌మ్మ‌గా పేరు తెచ్చుకున్న ప్ర‌ముఖ తెలుగు న‌టి.. విజ‌య‌శాంతి తెలంగాణా ఎన్నిక‌ల‌లో సెంట‌రాఫ్‌ది ఎట్రాక్ష‌న్‌గా మార‌నున్నారు. రాజ‌కీ యాల్లోకి వ‌చ్చిన ఆమె తొలుత బీజేపీలో చేరారు త‌ర్వాత‌ టీఆర్ ఎస్‌కు మ‌ద్ద‌తిచ్చారు. తెలంగాణా ఉద్య‌మ సార‌ధి, సీఎం కేసీఆర్‌ను దేవుడిచ్చిన అన్న‌గా పేర్కొంటూ.. రాజ‌కీయాల్లో మంచి రాణింపు తెచ్చుకున్నారు. వాస్త‌వానికి 1998లోనే రాజకీయ అరంగేట్రం చేసిన విజ‌య‌శాంతిబీజేపీలో చేరి మ‌హిళా విభాగానికి సెక్ర‌ట‌రీగా కూడా ప‌నిచేశారు. ఉమ్మ‌డి ఏపీలో నెల్లూరు నుంచి ఆమె రాజకీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. అంతేకాదు, క‌డ‌ప ఎంపీ బ‌రి నుంచి 1999లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించారు. అది కూడా కాంగ్రెస్ అప్ప‌టి అధ్య‌క్షురాలు సోనియా గాంధీ ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఆమెను ఓడించేందుకు బీజేపీ వేసిన ప్లాన్‌ను అమ‌లు చేయాల‌నుకున్నారు. 

Image result for telangana

అయితే, అనూహ్యంగా సోనియా.. త‌న స్థానాన్ని యూపీలోని రాయ‌బ‌రేలికి మార్చుకోవ‌డంతో విజ‌య‌శాంతి విర‌మించుకున్నారు. ఆ త‌ర్వాత కాలంలో ఆమె బీజేపీతో విభేదించి 2009లో సొంత‌గానే పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణా ఉద్య‌మ నేప‌థ్యంలో ఆమె త‌ల్లి తెలంగాణా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వ‌రంగల్‌కు చెందిన విజ‌య‌శాంతి పార్టీని ప్ర‌జ‌లు కూడా ఆహ్వానించారు. అయితే, స్వ‌ల్ప స‌మ‌యంలోనే ఆమె త‌న పార్టీని కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా రాష్ట్ర స‌మితిలో విలీనం చేశారు. అదే సంవ‌త్సరం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆమె మెద‌క్ పార్ల‌మెంటు నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. ఇక‌, కేసీఆర్‌తో క‌లిసి తెలంగాణా ఉద్య‌మం కోసం విజ‌య‌శాంతి కూడా రోడ్డెక్కారు. అంతేకాదు, ఎంపీ ప‌ద‌వికి సైతం ఆమె రాజీనామా చేశారు. 


ఇక‌, ఆ త‌ర్వాత తెర‌మీదికి వ‌చ్చిన రాజ‌కీయ విభేదాల కార‌ణంగా కేసీఆర్‌తోనూ విభేదించి ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. 2014లో మ‌ళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రాముల‌మ్మ‌.. రాష్ట్ర విభ‌జన త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ ఎంపీగా పోటీ చేసినా విజ‌యం అందుకోలేక‌పోయారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన తెలంగాణాలో విజ‌య‌శాంతి మ‌ళ్లీ త‌న అదృష్టం ప‌రీక్షించుకునేందుకు రెడీ అవుతు న్న‌ట్టు స‌మాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోయిన విజయశాంతి ఎట్టకేలకూ మనసు మార్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగాల్సిందేనని ఆమె తలపోస్తున్నారు. ప్ర‌స్తుత సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎన్నికల కదన రంగంలోకి దూకాలని రాములమ్మ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రకటించనున్న తదుపరి జాబితాలో విజయశాంతి పేరు ఉండటం ఖాయమని సమాచారం. 


వాస్తవానికి విజయశాంతిని ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం చేయాలని తొలుత అధిష్టానం భావించింది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశాలుండటంతో ఆమెను దుబ్బాక నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించినట్లు సమాచారం.  మరోవైపు అధికారంలోకి వచ్చేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం గెలుస్తారని బాగా నమ్మకమున్న నేతలనే ఎన్నికల్లో పోటీకి నిలబెడుతోంది. ఈ క్ర‌మంలోనే విజ‌య‌శాంతికి పెద్ద‌పీట వేసిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుంండ‌డం గ‌మనార్హం.మ‌రి ఇప్పుడైనా ఆమె గెలుస్తారా?  లేదా? అనే ది చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: