ఏపీ సీఎం చంద్ర‌బాబుకు `స‌ర్వేల బాబు` అని మ‌రో పేరు కూడా ఉండ‌డం తెలిసిందే. ఆయ‌న ఏ ప‌నిచేసినా.. దాని నుంచి క్రెడిట్ పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటారు. అది చిన్న‌దైనా.. పెద్ద‌దైనా.. క్రెడిట్ ఉండాల‌ని కోరుకుంటారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు త‌ను చేసే ప్ర‌తి ప‌నికీ ఆయన ప్ర‌జ‌ల నుంచి నేరుగా స‌ర్వే ద్వారా వారి అభిప్రాయం తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే త‌న పాల‌న‌పై దాదాపు 30కి పైగా స‌ర్వేలు ఆయ‌న చేయించారు. రాజ‌ధాని నిర్మాణం మొద‌లు.. పోల‌వ‌రం నిర్మాణం.. వ‌రకు ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థకాలు, ప్ర‌వేశ పెడుతున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల వ‌ర‌కు కూడా ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌పై ఇప్ప‌టికే స‌ర్వే చేయించారు. ఏకంగా ఆర్టీజీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసి మ‌రీ ఈ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తున్నారు. 


ఆయా స‌ర్వేల్లో వ‌చ్చిన మార్కుల‌ను కూడా ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు నేత‌ల‌కు తెలియ‌జేసి.. వారిని అలెర్ట్ చేస్తున్నారు. ప‌నితీరు మెరుగు ప‌రుచుకునేందుకు ఛాన్స్ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా నేరుగా చంద్ర‌బాబు వాయిస్‌తో స‌ర్వే ప్రారంభ‌మైంది. నేను మీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నాను... మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరుపై నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అంటూ సంతృప్తిగా ఉన్నట్లయితే మీ ఫోన్‌లో 1 నెంబరు నొక్కండి.. అసంతృప్తిగా ఉన్నట్లయితే 2 నొక్కండి అంటూ వివిధ ప్రశ్నలకు ప్రజల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ముఖ్యంగా ఒకే ఫోన్‌ నెంబర్‌కు మూడు నాలుగుసార్లు ఎమ్మెల్యేల పనితీరుపైనే వేర్వేరు ప్రశ్నావళితో ఫోన్లు వస్తున్నాయి. 


ప్రధానంగా టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల్లో ఉన్న వారికి ఈ ఫోన్‌కాల్స్‌ వస్తుండటంతో మెజార్టీ శాతం ప్రజలు తమ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఐవీఆర్‌ఎస్‌ ద్వారా ఎమ్మెల్యేల పనితీరుపై సమాచారాన్ని సేకరిస్తుండటంతో ఎమ్మెల్యేల పనితీరు తేలనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు తమకు అనుకూలమైన వారికి కాల్‌ చేసి మరీ సానుకూలంగా సమాచారం ఇవ్వాలంటూ కోరుతుండడం గమనార్హం! మొత్తం మీద ఎమ్మెల్యేల పనితీరుపై అధినేత చంద్రబాబు చేస్తున్న సర్వేలు రానున్న ఎన్నికల్లో వారి అభ్యర్థిత్వాలపై ప్రభావం చూపనుంది. మ‌రోప‌క్క‌, ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఐవీఆర్‌ఎస్‌ సర్వేతో కొంతమంది ఎమ్మెల్యేలు బెంబేలెత్తుతున్నారు. 


ప్రధానంగా గ్రామదర్శిని, జన్మభూమి, సభ్యత్వ నమోదు, సంక్షేమ పథకాల అమలులో చురుగ్గా వ్యవహరించని ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. 2-3 నెలల్లో ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే తరుణంలో నేరుగా టీడీపీ క్రియాశీలక కార్యకర్తలతో అధినేత చంద్రబాబునాయుడు నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం! కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లు ఇప్పుడున్న జూనియర్లతో సర్దుకోలేక పోతున్నారు. సీనియర్‌, జూనియర్లను ఎమ్మెల్యే సమన్వయ పర్చడం లేదు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలపై ఐవీఆర్‌ఎస్‌లో వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఏ విధమైన పరిణామాలకు దారితీస్తోందనని పలువురు ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: