ఒక్క మాట చాలు .. వెయ్యి మంది శ‌త్రువుల‌నైనా.. మ‌చ్చిక చేసేస్తుంది. అదే ఒక్క‌మాట ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌ను కూడా దూరం చేసేస్తుంది. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి తెలంగాణా సార‌ధి.. సీఎం కేసీఆర్‌కు ఎదుర‌వుతోంది. ఆయ‌న ఆలోచించే అన్నారో.. ఆలోచ‌న చేయ‌కుండా ఆవేశంలో అన్నారో తెలియ‌దు కానీ.. ఆయ‌న అన్న ఒకే ఒక్క మాట ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీలకు వ‌జ్రాయుధంగా మారిపోయింది. రెండు రోజుల కింద‌ట ఓ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కేసీఆర్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.  ఈ స‌మ‌యంలోనే త‌న గురించి కూడా చెప్పుకొచ్చారు. తాను గెలిస్తే.. బంగారు తెలంగాణా సాధ‌న‌లో ముందుకు వెళ్తామ‌ని చెప్పారు. ఇప్పుడు జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు ముందుకు తీసుకు వెళ్తాన‌ని అన్నారు. 


అలా కాకుండా మ‌హాకూట‌మికి ఓట్లేస్తే.. ఏపీ ఓళ్ల పాల‌న తెలంగాణాలో పున‌రావృతం అవుతుంద‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ త‌న టంగ్ ను స్లిప్ చేశారు. త‌న‌ను ఓడించినా త‌న‌కు పోయేది ఏమీ లేద‌ని, ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాన‌ని చెప్పారు. నిజానికి ఇప్పుడు ఈ వ్యాఖ్య‌నే మ‌హాకూట‌మి పార్టీలు ఆయుధంగా వాడుతున్నాయి. ప్ర‌తి నియోజ‌వ‌క‌ర్గంలోనూ విస్తృతంగా వాడుతున్నారు. ప్ర‌జ‌ల కోసం పార్టీ స్థాపించిన నాయ‌కుడు చేసే వ్యాఖ్య‌లేనా అని దుమ్మెత్తి పోస్తున్నాయి. కేసీఆర్‌కు కేవ‌లం అధికారం ఒక్క‌టే రావాల‌ని, కావాల‌ని, ఆయ‌న అధికారం లేక పోతే.. నిద్ర‌కూడా పోయే ప‌రిస్థితి లేద‌ని, ఆయ‌న‌తోపాటు త‌న కుటుంబానికి కూడా రాజ‌కీయ ఉద్యోగాలు ఇచ్చుకుని మురిసిపోతున్నాడ‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ఆయ‌న సిద్ధంగా లేర‌ని ఉతికి ఆరేస్తున్నారు. 


నిజానికి కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు ఇంత హ‌డావుడి, ప్ర‌చారం ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. కానీ, కేసీఆర్ ప్ర‌సంగాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆ ప్ర‌సంగాల్లోని లోపాల‌ను, ప్ర‌జావ్య‌తిరేక వ్యాఖ్య‌ల‌ను ఆయుధాలుగా చేసుకుని కేసీఆర్‌పై వాటిని ప్ర‌యోగించి ఆయ‌న క‌న్నును ఆయ‌న వేలుతోనే పొడిపించేలా ప‌క్కా వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌-గెలిపిస్తే.. ఓకే!  లేకుంటే వెళ్లి రెస్ట్ తీసుకుంటా! అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను అందిపుచ్చుకుని ఆయ‌న‌పై వ్య‌తిరేక ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.

సోమ‌వారం నుంచి ఈ వ్యాఖ్య‌ల‌ను రికార్డులుగా మార్చి.. మ‌హాకూటమి నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు దీనిపై అవ‌గాహ‌న ఏర్ప‌డిన‌ట్టు స‌మాచారం. రాబోయే రోజుల్లో దీని ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే పెద్ద‌లు చెప్పిన‌ట్టు నోరా వీపుకు చేటు! అన్న‌ట్టుగా ఉన్న‌ట్టు ఉంది కేసీఆర్ ప‌రిస్థితి. 



మరింత సమాచారం తెలుసుకోండి: