రాజ‌కీయాల్లో `న‌మ్మ‌కం` అనే మాట‌కు చాలా విలువ ఉంటుంది. అస‌లు అధినేత‌కు, కిందిస్థాయి నాయ‌కుల‌కు మ‌ధ్య ఉండేదే `న‌మ్మకం` మ‌రి ఆ న‌మ్మ‌కం స‌డ‌లిపోతే..?  ఏం జ‌రుగుతుంది? అంత‌రాలు, అవ‌రోధాలు.. ఆపై అవ‌మానాలు.. ఇదీ నేడు తెలంగాణాలో క‌నిపిస్తున్న రాజ‌కీయాలు. కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నేత‌గా ఎదిగి.. త‌న‌కు తిరుగులేని ప్ర‌జాభి మానం సంపాయించుకుని ఎంపీగా విజ‌యం సాధించిన ఎంపీ గుత్తా సుంఖేద‌ర్‌రెడ్డి త‌ర్వాత కాలంలో కేసీఆర్ పంచ‌కు చేరిపోయారు. కాంగ్రెస్‌ను కాద‌ని టీఆర్ ఎస్‌లోకి వెళ్లిన ఆయ‌న‌కు కేసీఆర్ ఆదిలో బాగానే వాల్యూ ఇచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం ప‌రిస్థితి మారిపోయింది. పైన చెప్పుకొన్న‌ట్టుగా న‌మ్మ‌కం స‌డ‌లి పోయింది. నాకు విలువ ఇవ్వ‌డం లేదు! అనే ప‌రిస్థితి త‌లెత్తింది. 

Image result for gutta sukender reddy

వాస్త‌వానికి గుత్తా సుఖేంద‌ర్ రెడ్డికి ఉన్న‌త స్థానం క‌ల్పించాల‌ని కేసీఆర్ చూశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న‌తో రాజీనా మా చేయించి త‌న స‌త్తా చాటించాల‌ని కూడా భావించారు. ఏవో కార‌ణాల‌తో కేసీఆర్ వెన‌క్కి త‌గ్గారు. వాస్త‌వానికి రాష్ట్ర కేబినెట్ హోదాతో కూడిన ప‌ద‌విని ఆశించి గుత్తా.. టీఆర్ ఎస్‌లోకి చేరిపోయారు.  అయితే కొద్దికాలం వేచి చూడ‌మ‌ని చెప్పి కేసీఆర్‌.. రైతు స‌మ‌న్వ‌య స‌మితుల‌ను ఏర్పాటు చేశారు. రైతు స‌మ‌న్వ‌య‌ రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడిగా గుత్తాను నియ‌మించారు.దీంతో కొంత మేర‌కు గుత్తా ఖుషీ అయినా.. మ‌న‌సులో మాత్రం ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టును అంట‌గ‌ట్టాడ‌ని గుత్తా వాపోయిన ప‌రిస్థితి ఉంది. 


ఇది ఒక ప‌క్క ర‌గుతుండ‌గానే.. తాజాగా తెలంగాణా ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఎంపీ పోస్టుకు రాజీనామా చేసి ఎమ్మెల్యే బ‌రిలో నిల‌వాల‌ని గుత్తాపై కేసీఆర్ ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డిపై పోటీ చేయాల‌ని ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో గుత్తా త‌న పోటీపై అంత‌ర్గ‌తంగా చేయించుకున్న స‌ర్వేలో రివ‌ర్స్ గేర్ ప‌డుతుంద‌ని గుర్తించి కేసీఆర్ మాట‌ను ప‌క్క‌న పెట్టారు. ఇది పెద్ద ఎత్తున ఇద్ద‌రి మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది. ఈ క్ర‌మంలోనే గుత్తాకు సెగ పెట్ట‌డం ప్రారంభ‌మైంది. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ప్రచార సభల్లో మాజీమంత్రి చెరుకు ముత్యం రెడ్డిని రాబోయే ప్రభుత్వంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించబోతు న్నట్లు కేసీఆర్ ప్రకటించేశారు. 


అంటే.. గుత్తా ప్ర‌స్తుతం అలంక‌రించిన రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్ష ప‌ద‌వి కేవ‌లం రోజుల్లోకి వ‌చ్చేసింద‌న్న మాట‌. ఇదిలా ఉంటే కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరిన త‌ర్వాత మ‌రి కొంత‌మంది కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని చెప్ప‌డంతో సుఖేంద‌ర్‌రెడ్డి కూడా ఉండ‌వ‌చ్చ‌నే అనుమానాలు త‌లెత్తాయి.  రెడ్డి సామాజిక వ‌ర్గం నేత‌లే పార్టీని వీడుతున్నారు అనే వార్త‌లు ఇప్ప‌టికీ ప్ర‌చారంలో ఉన్నాయి. మ‌రి టీఆర్ ఎస్‌లో త‌గిన ప్రాధాన్యం లేద‌ని భావిస్తున్న ఎంపీ పార్టీని వీడడ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: