రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు లేనిదే నాయ‌కులు త‌ట్టుకుని రాజ‌కీయాలు చేయ‌డం సాధ్యం కాదు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అమ‌లు చేస్తున్నారు. కీల‌క‌మైన జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌న ముద్ర ప‌డేలా చేసుకుంటున్నారు. ఎక్క‌డో తెర‌మ‌రుగైన అభ్య‌ర్థుల‌ను సైతం తెర‌మీదికి తెచ్చి రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెట్టించేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలోనే ఏకంగా ప‌వ‌న్‌.. త‌న‌ను ధిక్క‌రించి, త‌న‌ను తూల నాడుతున్న, త‌న అండ‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, త‌న‌కు విలువ ఇవ్వ‌కుండా విమ‌ర్శిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు చెక్ పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఏకంగా చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరునే ప‌వ‌న్ ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. 


చిత్తూరు జి్ల్లాలో వాస్త‌వానికి వైసీపీ-టీడీపీ మిశ్ర‌మంగా బ‌లాబ‌లాల‌ను చూపుతున్నాయి. చాలా చోట్ల వైసీపీ విజ‌యం సాధించింది. అయితే, చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం టీడీపీ అభ్య‌ర్థిగా 2014లో పోటీ చేసిన స‌త్య ప్ర‌భ విజ‌యం సాధించారు. అదే ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున టికెట్ ఆశించిన ఏఎస్ మ‌నోహ‌ర్‌ను ప‌క్క‌న‌పెట్టి ఈయ‌న స‌మీప బంధువు జంగాలపల్లె శ్రీనివాసులుకు జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. ఇక్క‌డ బ‌లిజ సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండడం ఈ రెండు పార్టీలూ బ‌లిజ వ‌ర్గానికి చెందిన‌ నాయ‌కుల‌కే ఛాన్స్ ఇచ్చాయి. స‌త్య ప్ర‌భ విజ‌యం సాధించారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ చిత్రం మారిపోతోంది. 


త‌న‌కు టికెట్ ఇవ్వ‌లేద‌నే తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోయిన మ‌నోహ‌ర్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అయితే, తాజాగా ప‌వ‌న్ ఆయ‌న‌ను చేర‌దీసి టికెట్ ఇవ్వ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే శెట్టి బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ పితాని బాల‌కృష్ణ‌కు ప‌వ‌న్ ముమ్మిడివ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను క‌న్ఫ‌ర్మ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బ‌లిజ వ‌ర్గానికి చెందిన మ‌నోహ‌ర్‌కు అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. ఒక‌వైపు సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం మ‌రోవైపు త‌న స్టార్ ఇమేజ్ కూడా ప‌నికి వ‌స్తుంద‌ని, దీంతో చంద్ర‌బాబు సొంత జిల్లాలో చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌సేన ఖాతాలో ప‌డే అవ‌కాశం ఖాయ‌మ‌ని భావిస్తున్న‌ట్టు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 


ఇదిలా ఉంటే ఇక్క‌డ స‌త్య‌ప్ర‌భ‌ను మార్చ‌డం త‌ప్ప టీడీపీకి అవ‌కాశం లేదు. దీనికి కార‌ణం.. ఆమె రాజ‌కీయంగా చ‌తికిల ప‌డిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కూడా ప‌వ‌న్‌కు క‌లిసి వ‌స్తుంది. ఎలాగూ.. తాను ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్నందున మ‌నోహ‌ర్‌కు కూడా ఈ విష‌యం క‌లిసివ‌చ్చే అవ‌కాశం. దీంతో చంద్ర‌బాబుకు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా క‌దుపుతున్న పావులు ఫ‌లిత‌మిస్తాయో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: