రాజ‌కీయాల్లో అయినా మామూలుగా అయినా నాయ‌కుల‌కు ఆశ‌లు ఉండొచ్చు! కానీ, అత్యాశే ఉండ‌కూడ‌దు. కానీ, వైసీపీ నేత‌లకు తాజాగా వెల్ల‌డైన స‌మాచారాన్ని బ‌ట్టి ఆశ‌ను దాటిపోయి అత్యాశ‌లో కూరుకుపోయార‌ని తెలుస్తోంది. వారి వ్య‌వ‌హారం చూస్తుంటే.. ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమ‌లింగం అన్న‌ట్టుగానే ఉంది. ప్ర‌స్తుతం విప‌క్షంలో ఉన్న వైసీపీ నాయ‌కులు ఆ పాత్ర‌నే స‌రిగా పోషించ‌లేక‌పోయార‌నే ప్ర‌చారం అన్ని ప‌క్క‌లా సాగుతోంది. ముఖ్యంగా అదికార టీడీపీ, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇదే త‌ర‌హా ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి ఇలాంటి స‌మయంలో ప్ర‌జ‌ల్లో పార్టీపై వ్య‌తిరేక‌త రాకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అంతేకాదు, 175 స్థానాల్లో క‌నీసం 120 చోట్ల పాగా వేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేక‌పోతే.. అధికారంలోకి వ‌చ్చినా ఇత్త‌డే! 


మ‌రి ఈ విష‌యంలో వైసీపీ నాయ‌కులు దృష్టి పెట్టడం మానేసి ఊహ‌ల్లో తేలిపోతున్నారు. అప్పుడెప్పుడో.. జ‌గ‌న్ ఓ పోలీ సు అధికారితో విశాఖ విమానాశ్ర‌యంలో మాట్లాడుతూ.. నేను సీఎంను.. నువ్వు సీఎంనే ప‌ట్టుకుంటున్నావే! అన‌డం సం చలనం సృష్టించింది. అచ్చు ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లోనే మిగిలిన నాయ‌కులు కూడా మునిగిపోయిన‌ట్టు తెలుస్తోంది.  తమ పార్టీ అధికారంలోకి వచ్చేసినట్లు రేపో మాపో మంత్రిగా ప్రమాణం చేసేసినట్లుగా ఊహించేసుకుంటున్నారు. ఈ ప‌రిణామా ల‌ను గ‌మ‌నిస్తున్న విశ్లేష‌కులు స‌హా ప్ర‌తిప‌క్షం నాయ‌కులు తెగ న‌వ్వుకుంటున్నారు. ఒక్క ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేత‌ల్లో ఇదే త‌రహా ఆలోచ‌న చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.  వైసీపీ తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి గుడివాడ గురునాధరావు కుమారుడు గుడివాడ అమర్ నాధ్ మంత్రి కావాలని నేతలంతా గట్టిగా కోరుకుంటున్నారు. 


ఇటీవల జరిగిన ఓ మీటింగులో నేతల ప్రసంగాలు చూస్తే అపుడే ఎన్నికలు అయిపోయి జగన్ ముఖ్యమంత్రి అయినట్లు గానే సాగాయి. అమరనాధ్ తండ్రి మంత్రి అయ్యారు. కొడుకు కూడా కావాలని, ఆ వారసత్వాన్ని నిలబెట్టాలని నేతలు ముక్త కంఠంతో కోరుకోవడమే ఇక్కడ విశేషం. ఇక‌,  విశాఖ అర్బన్ జిల్లాకు చెందిన నాయకులు కొంతమంది ఆరు నెలలు ఆగితే మనదే రాజ్యం, మనమే మంత్రులం అంటూ వైసీపీ నాయకులు మాట్లాడుకోవడం సర్వ సాధారణమైపో యింది. మొన్నీ మ‌ధ్య చిల‌క‌లూరి పేట స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ను మార్చిన సంద‌ర్భంలో కూడా జ‌గ‌న్‌.. అక్క‌డి మాజీ స‌మ‌న్వ‌య‌క‌ర్త మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు త‌న కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. 


ఇది అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారి తీసి అంద‌రూ న‌వ్వుకున్నారు. మొత్తానికి జగన్ ముఖ్యమంత్రి అని ఇన్నాళ్ళు ప్రచారం చేసిన నాయకులు ఇపుడు మేమే మంత్రులం అనుకుంటూ సంబరాలు చేసుకోవ‌డం .. ఆకాశానికి అప్పుడే నిచ్చెన‌లు వేసుకున్న‌ట్టే అంటున్నారు విశ్లేష‌కులు. చంద్ర‌బాబు వంటి కీల‌క రాజ‌కీయ దురంధ‌రుడిని ఓడించ‌డంపై ముందు దృష్టి పెట్టాల‌ని చెబుతున్నారు. మ‌రి నాయ‌కులు ఆదిశ‌గా ఆలోచిస్తారో.. లేక ఇలానే ఊహ‌ల్లో తేలిపోయి 2014 ఎన్నికల్లో  వ‌చ్చిన ఫ‌లితాన్నే చ‌విచూస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: