తెలంగాణ జన సమితి (టీజేఎస్‌)కు షాకిస్తూ, రాజీనామా చేసిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనారెడ్డి, తీవ్ర విమర్శలు చేశారు.  అడ్వకేట్, టీజేఎస్ నేత రచనా రెడ్డి తెలంగాణ జనసమితి పార్టీకి రాజీనామా చేస్తూ మాట్లాడారు..‘రాహుల్ ప్యారాచూట్ వ్యక్తులకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పారు. కానీ, ఆయన మాటలు కూడా పక్కదారి పట్టించిన మా పెద్ద మనిషి కూటమికి కన్వీనర్ ఏ దేశానికి రాజు. నిన్ను నువ్వు చూసుకున్నవు, నిన్ను నమ్ముకొని వచ్చిన అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని  కోదండరామ్ పై నిప్పులు చెరిగిన ఆమె, ప్రజా కూటమి విషకూటమిగా మారిందని, ఇది టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాబోదని అన్నారు.

కూటమి నిండా రాజకీయ బ్రోకర్లు నిండిపోయారని, టికెట్లను అమ్మకున్నారని విమర్శించారు. మరో రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి ప్రచారానికి రావడమే తప్పని వ్యాఖ్యానించిన ఆమె, చంద్రబాబు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.  ఓడిపోవడానికే కూటమి కట్టారా? అని నిలదీశారు. చర్చల పేరుతో హోటల్స్‌లో సమావేశాలు చేసి టైంపాస్ చేశారు.. పైసలు వసూలు చేసి కూటమి కట్టారని దుయ్యబట్టారు.  ఆ కూటమిలో ఎస్సీలు,ఎస్టీలు లేరు.. సామాజిక న్యాయం పాటించలేదని చెప్పారు. కూటమి పేరిట రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించిన రచనా రెడ్డి, కూరగాయల మాదిరిగా అసెంబ్లీ సీట్లు అమ్ముకున్న ఘనత కూటమి నేతలదని అన్నారు.

ప్రజాకూటమిలో సామాజిక న్యాయం లేదని, ఇప్పుడు కోదండరామ్ చేస్తున్న పనులను చూసి ప్రజలకు కోపం వస్తోందని అన్నారు.  తెలంగాణ జనసమితి పెట్టడానికి కారణాలు ఏమిటి? మీరు చెస్తుందేమిటి? ప్రజలు ఆలోచించి ఓటు వేయండి. ప్రత్యామ్నాయం ఇక్కడ కనిపించడం లేదు. జన సమితి పార్టీలోని అన్ని వేదికలపై నేను ప్రశ్నిస్తే, నన్ను కొట్టడానికి వచ్చారు  అని మండిపడ్డారు రచనారెడ్డి. కూటమి ఏర్పడిన తరువాత చాలామంది నేతలు బలిపశువులు అయ్యారని రచనారెడ్డి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: