కుందూరు జానారెడ్డి. తెలంగాణాలో మంచి పేరున్న నాయ‌కుడు. న‌ల్ల‌గొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేత‌. గ‌తంలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన మొద‌ట్లో టీడీపీ టికెట్‌పై కూడా గెలిచి ఉమ్మ‌డిఏపీ ర‌వాణా శాఖ మంత్రిగా అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన నాయ‌కుడు. అయితే, ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లో చేరి.. ఇప్ప‌టికీ కాంగ్రెస్‌లోనే ఉన్న సీనియ‌ర్. మ‌ధ్య‌లో అనేక సార్లు.. కేసీఆర్ నుంచి ఆహ్వానాలు వ‌చ్చినా.. ప‌ద‌వుల ఆశ‌చూపించినా.. ఎందుకో ఆయ‌న మ‌న‌సు క‌ర‌గ‌లేదు. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఆయ‌న‌కు కూడా సీఎం అవ్వాల‌న్న కోరిక మిగిలి న‌లుగురైదుగురు నాయ‌కుల్లాగానే బ‌లంగానే ఉంది. అయితే, అది తీర‌ద‌ని ఆయ‌న‌కు కూడాతెలుసు. అయితే, క‌నీసం ఏ మంత్రి ప‌ద‌వైనా ద‌క్క‌క పోతుందా? అనే ధీమాతో కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్నారు. 


అయితే, ఆయ‌న ఒక‌టి త‌లిస్తే.. ప్ర‌జ‌లు మ‌రొక‌టి త‌లిచే విధంగా ఉంద‌ట ఆయ‌న ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఆయ‌న నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలిచారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి.. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం. కాంగ్రెస్‌లోనే ఉంటూ.. కేసీఆర్ ను ఆయ‌న అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను మెచ్చుకున్న తీరు! దీనికితోడు.. ఇప్పుడు వ‌రుస విజ‌యాలు కూడా ఆయ‌న‌కు ప్రాణ‌సంక‌టంగానే ప‌రిణ‌మిస్తున్నాయి. ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త నాలుగుసార్లుగా అంటే 20 ఏళ్లుగా గెలుస్తూనే ఉన్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో కొంత మేర‌కు వ్య‌తిరేకత పెరిగింది. దీనికితోడు వ్యూహాత్మ‌కంగా ఇక్క‌డ నుంచి అధికార టీఆ ర్ ఎస్ పార్టీ మాజీ క‌మ్యూనిస్టు నేత‌, ప్ర‌ముఖ లాయ‌ర్ నోముల న‌ర్సింహ‌య్య‌ను రంగంలోకి దింపింది. ఇక‌, వాక్చాతుర్యంలో జానాను మించిన నాయ‌కుడు నోముల. దీంతో ఆయ‌న దూసుకు పోతున్నారు. 


ఈ రెండు ప‌రిణామాలు జానాకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. మ‌రోప‌క్క‌, సోష‌ల్ మీడియా తీవ్రంగా ప‌నిచేస్తోంది. సాధార‌ణ మీడియానైతే.. ఏదో ఒక ర‌కంగా క‌ట్ట‌డిచేయొచ్చేమోకానీ. సోష‌ల్ మీడియాను క‌ట్ట‌డిచేయ‌డం సాధ్య‌మా?  ఈ ఇర‌వై ఏళ్ల‌లో అంటే సాగ‌ర్ నుంచి జానా గెలుస్తూ వ‌చ్చిన ఈ 20 ఏళ్ల‌లో జ‌రిగిన అబివృద్ధి అంటూ ఏమీ లేద‌ని టీఆర్ ఎస్ యువ విభాగం ఫొటోల‌తో స‌హా సోష‌ల్ మీడ‌యాలో దంచి కొడుతోంది. దీంతో త‌న ప్లేటు చిరిగిపోవ‌డం ఖాయ‌మ‌ని ఇప్ప‌టికే ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చేశారు జానా. అయినా కూడా ఆయ‌న ఏదో ఒక ఆశ‌తో మాత్రం ప్ర‌చారం చేస్తున్నారు. పైగా మ‌హాకూట‌మిలో భాగంగా త‌న‌కు ఎవ‌రైనా వ‌చ్చి ప్ర‌చారం చేస్తారా? అంటే.. అంద‌రూ ఆయ‌న‌క‌న్నా జూనియ‌ర్లే! సో.. ఇది మ‌రీ బాగోదు! మ‌రి ఏం చేయాలి? ఇప్పుడు ఈ స‌మ‌స్యే జానాకు 104 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చేలా చేస్తోంది. దీంతో ఇక‌, జానా క‌ల క‌ల్ల‌లే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: