తెలంగాణాలో మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కొడంగల్ లో హై టెన్షన్ మొదలైంది.  నేడు కోస్గిలో కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి ప్రకటించడమే కాదు, అదే రోజు కొడంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో నియోజక వర్గంలో ఎలాంటి అల్లర్లకు తావు ఇవ్వకుండా ముందస్తుగా  ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై ఆయన భార్య గీత మండిపడ్డారు.  తన భర్త రేవంత్ రెడ్డిని పోలీసులు ఒక కరడుగట్టిన టెర్రరిస్టును తీసుకు వెళ్లినట్లు తీసుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడ్డారని ఆరోపించారు. అందరం ఉండగానే కేవలం ఐదు నిమిషాల్లోనే ఆయనను టెర్రరిస్టు లా ఈడ్చుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.  అర్థరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లలోకి పోలీసులు చొరబడి భయభ్రాంతులకు గురిచేసి, మహిళలను ఇబ్బంది పెడుతుంటే రేవంత్ రెడ్డి నిరసనకు దిగారు. కొడంగల్ ప్రజలమీద జరుగుతోన్న దాడులకు నిరసన తెలిపినందుకు తన భర్తను ఉగ్రవాదిలా ట్రీట్ చేస్తారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.తలుపులు బద్దలుగొట్టి ఒక 50 మంది పోలీసులు లోనికి చొరబడ్డారని మేము ఐడి కార్డులు అడిగినా..అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించినా సమాధానాలు ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లు ఆమె ఫైర్ అయ్యారు. 

 ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరింట్లోకి పడితే వారింట్లోకి వెళ్లడానికి పోలీసులకు హక్కు ఎవరిచ్చారని?.. అలాంటి హక్కును రాజ్యాంగం వారికేమైనా ఇచ్చిందా? అని నిలదీశారు.  ఇది కొడంగల్ ప్రజల మీద జరుగుతున్న దాడి అని పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానులు సంయమనం పాటించాలని, శాంతియుతంగా నిరసన తెలపాలని, హింసకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని ఓటు రూపంలో చూపించాలని, నియంత పాలనకు చరమ గీతం పాడాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: