తెలంగాణలో పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. మొదట్లో కేసీఆర్ ఏకపక్షంగా ఎన్నికల్లో గెలుస్తారని భావించినా.. క్రమంగా పోరాటం హోరాహోరీగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా నాలుగు రోజుల ముందు టీవీ9 ప్రసారం చేసిన సీపీఎస్ సర్వే టీఆర్ఎస్ వందకు పైగా సీట్లతో అఖండ విజయం సాధించబోతోందని తెలిపింది. టీఆర్‌ఎస్ పార్టీకి 94 నుంచి 104 వస్తాయని 49.7 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తెలిపింది.



ఈ సీపీఎస్ సర్వేలో ప్రజా కూటమి 32.3 శాతం ఓట్లతో 16 నుంచి 21 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడైంది. ఇక మజ్లీస్ తన ఏడు స్థానాలను తిరిగి గెలుచుకుంటుందట. బీజేపీకి 1 లేదా 2 సీట్లు, ఇతరులకు ఒక్క స్థానం గెలిచే అవకాశాలున్నాయని సీపీఎస్ సర్వే చెబుతోంది. ఈ సర్వే ఫలితాలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం కలిగించాయి. అందుకే ఈ సర్వేపై సోమవారం రాత్రి టీవీ9 చర్చ చేపట్టగానే కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు.



ఈ సర్వే ఫలితాలపై టీవీ9 చర్చలో ఫోన్ ద్వారా మాట్లాడిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేపై నిప్పులు చెరిగారు. సర్వేపై కంటే దాన్ని ప్రసారం చేసిన టీవీ9 ఛానల్ పై విపరీతమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కు ముందు తప్పుడు సర్వేల ద్వారా కేసీఆర్ కు లబ్ది చేయాలని టీవీ9 ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ కు టీవీ9 ఎంతకు అమ్ముడుపోయిందో చెప్పాలని లైవ్ లోనే యాంకర్ మురళీ కృష్ణను నిలదీశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.



మీ వాదన మీరు వినిపించండంటూ టీవీ9 యాంకర్ మురళీకృష్ణ చెబుతున్నా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం చల్లారలేదు. టీవీ9 కూడా కేసీఆర్ ఆధ్వర్యంలోని టీ న్యూస్ మాదిరిగా తయారైందని విమర్శించారు. అసలు ఈ సీపీఎస్ సర్వే ఎక్కడిది.. ఈ కంపెనీ పేరే వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పిచ్చి సర్వేలతో టీవీ9 విశ్వసనీయత కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: