కేసీఆర్.. తెలంగాణలో ఎదురులేని నాయకుడు.. అందులో ఎవరికీ అనుమానం లేదు. అంతే కాదు.. ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగని నాయకుడు.. ఆయన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి.. అది తొలిసారి ఎన్నికల బరిలో దిగినప్పుడు తప్ప ఎన్నడూ ఓటమి చవి చూడలేదు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తన సొంత నియోజక వర్గంలో ఎదురీదుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.



తాజాగా.. మంగళవారం మహాకూటమి నిర్వహించిన రోడ్ షో కు జనం ప్రభంజనంలా రావడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పుడు గజ్వేల్ కాంగ్రెస్ రోడ్ షో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ మూడు, నాలుగు సార్లు ఓడిపోయిన వంటేరు ప్రతాప రెడ్డి సంచలనం సృష్టించబోతున్నారా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.



కేసీఆర్ పై గెలుపు అంటే అంత ఈజీ కాకపోయినా.. రాజకీయ సమీకరణాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ తెచ్చిన తర్వాత మొదటి ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇక్కడ సునాయాస విజయం వరించలేదు. ఆయన మెజారిటీ కేవలం 19 వేలు మాత్రమే. అందులోనూ అప్పుడు త్రిముఖ పోటీ నెలకొంది.



ఆ లెక్కన చూస్తే ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ చేతులు కలపడం కేసీఆర్ కు గడ్డు పరిస్థితినే తీసుకువచ్చే అవకాశం ఉంది. ఐతే.. సీఎంగా ఈ నియోజకవర్గంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఆయనకు అండగా నిలిచే అవకాశం ఉంది. అందులోనూ సీఎం అభ్యర్థి కాబట్టి గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్న ప్రచారం కూడా కేసీఆర్ ను గట్టెక్కించవచ్చు. అయితే గెలుపు మాత్రం తెలంగాణాధీశుడికి అంత సులభం మాత్రం కాకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: