ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి సొంత ఇలాకాలోనే అదిరిపోయే షాక్‌ తగిలింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా టీడీపీలో కీలక నేత ఒకరు పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీకి గుడ్‌బై చెప్పిన ఆయన చంద్రబాబు తనను నమ్మించి మోసం చేసారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చెయ్యడం కూడా కలకలం రేపింది. ఏపీ సీఎం చంద్రబాబు గత ఎన్నికల తర్వాత పార్టీని కార్యకర్తలతో క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే అంశంపై కాకుండా విపక్ష వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలోపేతం చెయ్యాలన్న ప్లాన్‌కు తెర తీశారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒకరిద్దరు ఎంపీలను సైతం ఆయన సైకిల్‌ ఎక్కించేసుకున్నారు. దీంతో టీడీపీలో కొత్త‌, పాత నాయకుల మధ్య‌ నాలుగున్నర ఏళ్లుగా తీవ్రమైన వైరుధ్యం నడుస్తూనే ఉంది. 


వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరిన చోట వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడిన వారిని సైతం పక్కన పెట్టేస్తామన్న హిట్లు సైతం చంద్రబాబు ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వారంతా చంద్రబాబు తీరును జీర్ణించుకోలేక తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏం చెయ్యాలా అన్న సమాలోచనల్లో మునిగిపోతున్నారు.ఈ క్రమంలోనే చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో ఓ కీలక నేత తనకు టీడీపీలో రాజకీయ భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చి పార్టీకి రాజీనామా చేసేశారు. ఇప్పుడు ఇదే దారిలో ఇతర జిల్లాల్లో కొందరు కీలక నాయకులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం, కడప జిల్లాల్లో ఇద్దరు, ముగ్గురు కీలక నాయకులు సైతం పార్టీని వీడతారన్న వార్తలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌, మైనార్టి నేత ఇక్బాల్‌ మహ్మద్‌ టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు సైతం టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీని వీడిన ఇక్బాల్‌ మాట్లాడుతూ 25 ఏళ్లుగా టీడీపీకి తాను ఎంతో సేవ చేసి నష్టపోయానని చెప్పారు. 

Image result for kiran kumar posani

చంద్రబాబు ఒత్తిడి చెయ్యడంతోనే 2014 ఎన్నికల్లో తాను అప్పటి సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి కుటుంబం మీద పోటీ చేసానని తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అన్ని విధాలా తనను ఆదుకుంటానని హామీ ఇచ్చిన చంద్రబాబు తనను పట్టించుకోలేదని చెప్పారు. ఆ ఎన్నికల్లో చంద్రబాబుతో పాటు... సీఎం రమేష్‌ కూడా నిన్ను ఆదుకునే హామీ నేను ఇస్తున్నానని చెప్పార‌ని టీడీపీ అధికారంలోకి వచ్చాక క్యాబినెట్‌ పదవి ఇస్తామని చెప్పి అసలు తనను ఏ మాత్రం పట్టించుకోలేదని ఆవేద‌న వ్యక్తం చేశారు. పీలేరు నియోజకవర్గంలో వాస్తవంగా చూస్తే వైసీపీ బలంగా ఉంది. ఇక్కడ వైసీపీని ఓడించేందుకు చంద్రబాబు మాజీ ముఖ్య మంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి ఫ్యామిలీపై వల వేశారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకుని ఆయనకు పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పగ్గాలు అప్పగించారు. 


కిషోర్‌ కుమార్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నప్పుడు ఇక్బాల్‌కు నామినేటెడ్‌ పదవి ఇస్తామని ఆశ పెట్టారు. అయితే చంద్రబాబు విచిత్రంగా ఇక్బాల్‌ను పక్కన పెట్టి నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డికి నామినేటడ్‌ పదవి కూడా ఇచ్చారు. నాలుగున్నర ఏళ్ల పాటు పార్టీ కోసం ఎంతో కష్టపడితే తనను పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు వచ్చిన వారికి నియోజకవర్గ పగ్గాలు ఇవ్వడంతో పాటు ఏకంగా నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతో ఇక్బాల్‌ ఆవేద‌న చెంది పార్టీని వీడారు. ఇక చంద్రబాబుకు ముస్లింల‌పై ఏ మాత్రం ప్రేమ లేదని చెప్పిన ఆయన బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత ఇప్పుడు ముస్లింలు కనిపిస్తున్నారా ? అని సైతం విమర్శించారు.

ఇక ఎంత సేపు అమరావతి అంటూ భజన చేస్తున్న చంద్రబాబు రాయలసీమను పట్టించుకోవడం లేదని... ఈ క్రమంలోనే పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సైతం ఆయన విమర్శించారు. ఏదేమైన చంద్రబాబు సొంత జిల్లాలోనే ఇక్బాల్‌ రూపంలో టీడీపీకి పెద్ద షాక్‌ తగలగా ఇప్పుడు సీమలోనే మరికొందరు కీలక నేతలు సైతం టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి చంద్రబాబు ఇక్కడ ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: