హైద‌రాబాద్‌లోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం, ఇటు ఏపీలోనూ అటు తెలంగాణాలో చ‌ర్చ‌కు వ‌చ్చిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ 60 శాతం దాటిన‌ట్టు ప్రాధ‌మిక అంచ‌నాలు చెపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ 50 శాతం మాత్ర‌మే పోలింగ్ జ‌రిగింది. ఇక్క‌డ నుంచి టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా మాధ‌వ‌రం కృష్ణారావు, మ‌హాకూట‌మి బ‌ల‌ప‌రిచిన టీడీపీ అభ్య‌ర్థిగా నంద‌మూరి సుహాసిని త‌ల‌ప‌డుతున్నారు. వాస్త‌వానికి తొలి రెండు గంట‌లు చాలా మంద‌కొడిగా పోలింగ్ జ‌రిగినా.. త‌ర్వాత మ‌ధ్య‌హ్నం పుంజుకుంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గెలిచిన కృష్ణారావు ప్ర‌స్తుతం టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు.


ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు నేప‌థ్యంలో ఇక్క‌డ బ‌దిలీ ఓటింగ్ జ‌రిగి.. మ‌హాకూట‌మి అభ్య‌ర్థి గెలుపు సాధ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న‌ విశ్లేష‌ణ‌లు కూట‌మిలో విన‌వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఇక్క‌డ సెటిల‌ర్లు ఎక్కువ‌. దీంతో ఇక్క‌డ బాల‌య్య‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని రెండు మూడు రోజుల పాటు రోడ్ షోలు, బ‌హిరంగ స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. దీంతో సెటిల‌ర్ల‌లో మంచి మార్పు క‌నిపించిన‌ట్టు తాజా ఓటింగ్ స‌ర‌ళిని బ‌ట్టి మ‌న‌కు అర్ధ‌మ‌వుతోంది. అయితే ఓటింగ్ శాతం పెరిగితే ఇక్క‌డ కూట‌మి అభ్య‌ర్థి సుహాసిని గెలుపున‌కు ఛాన్సులు ఎక్కువ‌ని టాక్‌.


అంచనాల‌కు మించి గ‌తంలో క‌న్నా భారీగా పోలింగ్ జ‌రిగితే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త పెరిగి.. క్రాస్ ఓటింగ్ జ‌రిగి.. సుహాసిని గెలుపు సునాయాసం అవుతుంద‌ని అనేవారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓట్ల గ‌ల్లంతు అనే విష‌యం భారీగా వినిపిస్తున్నా.. ఒక్క‌కూక‌ట్ ప‌ల్లిలో మాత్రం సుహాసిని ముందు నుంచి ప్ర‌తి ఇంటికీ త‌న ప్ర‌తినిధులను పంపి, ప్ర‌తి ఓటును ప‌రిశీలించి ఉన్న‌దీ లేనిదీ తెలుసుకున్నారు. దీంతో ఇప్పుడు కూక‌ట్ప‌ల్లిలో ఎక్క‌డా కూడా ఓటు గ‌ల్లంతైంది అనే మాట వినిపించ‌డం లేదు. 


ఇక నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు డివిజ‌న్ల‌లో గెలుపు లెక్క‌లు ఎలా ఉన్నా కూక‌ట్‌ప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి హౌసింగ్‌బోర్డు, బాలాజీన‌గ‌ర్‌, మూసాపేట డివిజ‌న్ల‌లో టీడీపీ, అత్తాపూర్‌లో టీఆర్ఎస్‌కు ఎడ్జ్ ఉందంటున్నారు. ప్ర‌శాంతి న‌గ‌ర్‌లో సైతం హోరాహోరీ నేప‌థ్యంలో ఎవ‌రికి ఎడ్జ్ ఉంటుంద‌న్న‌ది అంతుప‌ట్ట‌డం లేదు. బాలాన‌గ‌ర్‌లో నార్త్ ఇండియ‌న్లు బీజేపీ వైపు మొగ్గార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: