తెలంగాణా ఎన్నిక‌లు ముగిశాయి. రాష్ట్రంలో ఎక్క‌డా ఎలాంటి చిన్న వివాదం, ఘ‌ర్ష‌ణ‌లు వంటివి కూడా చోటు చేసుకోకుండానే తెల‌గాణా ఎన్నిక‌లకు ప్ర‌శాంతంగా తెర‌ప‌డింది. ఇక‌, అంద‌రి క‌ళ్లూ ఈ నెల 11న ప్ర‌క‌టించ‌బోయే ఫ‌లితాల‌పైనే ఉన్నాయి. అయితే, తెలంగాణా ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. అంద‌రూ ముందుగా ఊహించిన‌ట్టే ఇక్క‌డ ప‌ట్ట‌ణ ఓట‌ర్లు ఓటింగుకు ముందుకు రాని ప‌రిణామాన్ని గుర్తించాలి. అదేస‌మ‌యంలో గ్రామీణ ఓట‌ర్ల‌లో చైత‌న్యం బాగానే క‌నిపించింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ముందుగానే ఊహించిన‌ట్టు.. విద్యార్థులు గానీ, ఇత‌ర వ‌ర్గాల‌కుచెందిన యువ‌త కానీ ఎన్నిక‌ల్లో పాల్గొనేందుకు ఉత్సాహం క‌న‌బ‌ర‌చ‌లేదు. అయితే, గ‌తానికి భిన్నంగా సెల‌బ్రిటీలు దాదాపు అంద‌రూ కూడా ఉద‌యాన్నే ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. దీని ఫ‌లితంగా యువ‌త కూడా పోలింగ్ బూత్‌ల‌కు వ‌స్తార‌ని, సెల‌బ్రిటీల‌ను అనుస‌రిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. 


కానీ, ఊహించ‌ని విధంగా గ్రేట‌ర్ స‌హా ప్ర‌ధాన‌మైన వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంలోనూ యువ‌త ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కే 57% ఓటింగ్ న‌మోదైంది. ఇక‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో మాత్రం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు కేవ‌లం 42% ఓటింగ్ న‌మోదైంది. మ‌హాకూట‌మి కీల‌కంగా భావిస్తూ వ‌చ్చిన శేరిలింగం ప‌ల్లిలో చాలా ఎన్నిక‌ల బూత్‌లు ఖాళీగా క‌నిపించాయి. ఇక్క‌డి యువ‌త ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాయి. కూక‌ట్‌ప‌ల్లిలోనూ యువ‌త పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. ఇక్క‌డ చాలా బూతుల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించ‌డంతో పోలింగ్ గంట‌కుపైగా ఆల‌స్యంగా న‌మోదైంది. దీంతో అభ్య‌ర్థుల్లో ఆందోళ‌న క‌నిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదైన ఓటు బ్యాంకులో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ ఓట్లు న‌మోదైన‌ట్టు అధికార వ‌ర్గాలు చెప్పాయి. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా రాజ‌కీయంగా అల‌జ‌డి ప్రారంభమైంది. 


రాష్ట్రంలో మొత్తం 119 స్థానాలకు పోలింగ్‌ జరగ్గా.. 1821 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినా కూడా మ‌హాకూట‌మి వ‌ర్సెస్ టీఆర్ ఎస్ మ‌ధ్యే పోరుసాగింది. సాయంత్రం ఐదు గంట‌ల‌కు అందిన అంచ‌నాల ప్ర‌కారం చూస్తే.. త‌ట‌స్థ ఓట‌ర్లు ఎవ‌రూ కూడా పోలింగ్‌లో పాల్గొన‌లేదు. అదేవిధంగా ప‌ట్ట‌ణ ఓట‌ర్లు కూడా పోలింగ్‌కు చాలా దూరంలోనే ఉండిపోయారు. దీంతో మ‌హాకూట‌మి అభ్య‌ర్తులకు ఒకింత ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. అయితే, అదేస‌మ‌యంలో అధికార పార్టీ అభ్య‌ర్థుల్లోనూ భ‌రోసాలేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ్రేట‌ర్‌లోని, కూక‌ట్‌ప‌ల్లి, ఖైర‌తాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఆదిలాబాద్‌లోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ ఓట్లు గ‌ల్లంత‌య్యాయంటూ వేలాది మంది ఓట‌ర్లు రోడ్డెక్కారు.

త‌మ‌కు గుర్తింపు కార్డులు ఉన్నాయ‌ని, కానీ, ఓట‌రు లిస్టులో త‌మ పేరు మాత్రం క‌నిపించ‌డంలేద‌ని పెద్ద ఎత్తున ఆందోళ‌నకు దిగారు. ఫైర్ బ్రాండ్ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్‌లోను, మ‌హాకూట‌మి అభ్య‌ర్థి నంద‌మూరి సుహాసిని పోటీ చేస్తున్న కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోనూ, కొండా సురేఖ దంప‌తులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓట్లు గ‌ల్లంతు కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. మొత్తంగా తెలంగాణా ఎన్నిక‌ల్లో స్ప‌ష్ట‌మైన మెజారిటీ ఎవ‌రికి వ‌స్తుంద‌నే విష‌యం ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి నెలకొన‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: