తెలంగాణాలో తాజాగా ముగిసిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ త‌న‌యుడు , మంత్రి కేటీఆర్ ఎన్నిక‌ల్లో గెలుపు క‌న్నా కూడా ఆయ‌న సాధించ‌బోయే మెజారిటీపైనే ఎక్కువ‌గా అంచ‌నాలు ఉన్నాయి. వ‌రుస‌గా ఇక్క‌డ నుంచి విజ‌యం సాధిస్తున్న కేటీఆర్‌కు ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ విజ‌యం గ్యారెంటీ అనే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఇక్క‌డ తాజాగా జ‌రిగిన ఓటింగ్‌లోనూ యువ‌త భారీ ఎత్తున పాల్గొన్నారు. సిరిసిల్లలో 62% ఓటింగ్ న‌మోదైన‌ట్టు స‌మాచారం. మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ ఓట‌ర్లు పోలింగ్ బూత్‌ల‌కు పోటెత్తారు. దీంతో ఓటింగ్ స‌ర‌ళి ఆది నుంచి కూడా ఆశాజ‌న‌కంగా ముందుకు సాగింది. ఉద‌యం ఏడు గంట‌ల నుంచే ఓటు వేసేందుకు సిరిసిల్ల ప్ర‌జ‌లు క్యూక‌ట్టారు. దీంతో ఇక్క‌డి ప‌రిస్థితిని అంచ‌నా వేయ‌డం పెద్ద‌గా క‌ష్టం కాలేదు. 

Image result for kcr ktr harish rao

సిరిసిల్ల నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కెకె మ‌హేంద‌ర్‌రెడ్డి రంగంలోకి దిగారు. ఇక‌, బీజేపీ అభ్య‌ర్థిగా ఎం. న‌ర్సాగౌడ్ ఉన్నారు. అయితే, తాజా ఎన్నిక‌ల స‌ర‌ళిని చూస్తే.. ఎప్ప‌ట్లాగే.. కేటీఆర్ అనుకూల ప‌వ‌నాలే వీచాయ‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. గ‌త 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలిచిన కేటీఆర్ దాదాపు 53 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఇక‌, ఈ నాలుగేళ్ల‌లోనూ జ‌రిగిన అభివృద్ది, నీటి స‌ర‌ఫ‌రా వంటి ప‌థ‌కాలు త‌న‌కు మ‌రింత ప్ల‌స్ అవుతాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా న‌మ్మారు. ఇక‌, కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగిన కేకే మ‌హేంద‌ర్‌రెడ్డి కూడా గ‌ట్టిగానే ఇక్క‌డ ప్ర‌చారం చేశారు. ప్ర‌ధానంగా కేటీఆర్‌, కేసీఆర్‌ల‌ను టార్గెట్ చేసుకుని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, బీజేపీ కూడా ఇక్క‌డ బాగానే ప్ర‌చారం చేసింది. 


అయితే, ఇక్క‌డ సంప్ర‌దాయ ఓటు బ్యాంకు మాత్రం గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ కేటీఆర్ విజ‌యం సాధిస్తూ వ‌చ్చారు. 2010లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ నుంచి కేటీఆర్ విజ‌యం సాధించారు. అదేస‌మ‌యంలో కేకే మ‌హేంద‌ర్ రెడ్డి కూడా ఇక్క‌డ రెండు సార్లు పోటీ చేసి కేటీఆర్ పై ఓడిపోయారు. అయితే, ఈ రెండు సార్ల ఓట‌మి తాలూకు సింప‌తీ ఏమైనా ప‌నిచేస్తుంద‌ని ఆయ‌న భావించినా.. పెద్ద‌గా ఈ ప్ర‌భావం క‌నిపించ‌డం లేదు. మ‌రోప‌క్క‌, యువ నాయ‌కుడిగా కేటీఆర్‌కు ఉన్న అనుభ‌వాన్ని కూడా ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌రిగ‌ణ‌నలోకి తీసుకున్నారు. ఇది పోలింగ్ స‌ర‌ళిలో స్ప‌ష్టంగా క‌నిపింది. ఇక‌, త‌న మెజారిటీపై కేటీఆర్ కూడా ధీమా వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 53 వేల పైచిలుకు ఓట్ల క‌న్నా కూడా ఇప్పుడు 60 వేల పైచిలుకు మెజారిటీ ఖాయ‌మ‌నేది కేటీఆర్ వ్యాఖ్య‌. ఆయ‌న ఆలోచ‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ కేటీఆర్ విజ‌యం.. ఖాయం. మెజారిటీ కొంత మేర‌కు త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: