తెలంగాణా ఎన్నిక‌ల పోలింగ్‌లో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించిన శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు ఎవ‌రిదో ఎవ్వ‌రికి అంతుప‌ట్ట‌డం లేదు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోనే అన్ని నియోజ‌క‌వ‌ర్గాల కంటే ఎక్కువుగా 5 ల‌క్ష‌ల పై చిలుకు ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గం శేరిలింగంప‌ల్లి. ఐటీ రంగం అంతా ఈ నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండ‌డంతో ముందునుంచి ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తార‌న్న‌దానిపై ఉత్కంఠ నెల‌కొంది. అయితే శుక్ర‌వారం జ‌రిగిన పోలింగ్‌లో మాత్రం ఇక్క‌డ ఓట‌ర్లు ఓటు వేసేందుకు తీవ్ర‌మైన నిరుత్సాహం క‌న‌ప‌రిచారు. ఉద‌యం 11 గంట‌ల‌నే రాష్ట్ర వ్యాప్తం 25% పోలింగ్ న‌మోదు కాగా, ఒక్క శేరిలింగం ప‌ల్లిలో మాత్రం 6% పోలింగ్ న‌మోదైంది. ఇక‌, మ‌ధ్యాహ్నం 1 గంట స‌మ‌యానికి పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 40% దాకా ఓటింగ్ జ‌రిగింది. కానీ, శేరిలింగం ప‌ల్లి విష‌యానికి వ‌స్తే.,. ఇక్క‌డ 22% పోలింగ్ మాత్ర‌మే న‌మోదైంది. ఓవ‌రాల్‌గా ఇక్క‌డ పోలింగ్ కేవ‌లం 48 శాతానికే ప‌రిమిత‌మైంది.


దీంతో ఇక్క‌డ ప‌రిస్థితిపై బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు బెంబేలెత్తుతున్నారు. టీఆర్ ఎస్ త‌ర‌ఫున ఇక్క‌డ నుంచి అరికెపూడి గాంధీ పోటీ చేస్తుండ‌గా మ‌హా కూట‌మి అభ్య‌ర్థిగా వెనిగ‌ళ్ల ఆనంద‌ ప్ర‌సాద్ పోటీ చేస్తున్నారు. గాంధీ గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ నుంచి పోటీ చేసి ఏకంగా 78 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. ముందు నుంచి హోరా హోరీగా ఇద్ద‌రి మ‌ధ్య పోరు జ‌రుగుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. మ‌హాకూట‌మి అభ్య‌ర్థిగా వెనిగ‌ళ్ల‌కు మంచి ఛాన్స్ ఉంద‌ని స‌ర్వేలు కూడా తేల్చి చెప్పాయి. ఇక‌, టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన గాంధీ కూడా ఇదే ధీమాతో ఉన్నారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు త‌న‌కు క‌లిసి వ‌స్తాయ‌ని ఆయ‌న భావించారు. 


గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో నియోజ‌క‌వ‌ర్గంలోని అన్ని డివిజ‌న్ల‌ను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసేసింది. అయితే తాజా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ క‌లిసి పోటీ చేయ‌డంతో ఇటు కూట‌మి, అటు టీఆర్ఎస్ అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రిగింది. అయితే, ఇప్పుడు తీరా ఎన్నిక‌ల పోలింగ్ శాతం విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం ఈ ఇద్ద‌రు నేత‌లూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం రంగారెడ్డి జిల్లాలోనే ఉన్న‌ప్ప‌టికీ.. హైద‌రాబాదీల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇక్క‌డి యువత ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించ‌నున్నారు. అందుకే ఇక్క‌డ యువ‌త‌ను టార్గెట్ చేస్తూ.. ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా నిర్వ హించారు. 


అయితే, ఇప్పుడు వ‌రుస సెల‌వులు రావ‌డంతో ఇక్క‌డ యువ‌త టూర్‌ల‌కు, త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లిపోయార‌నేది తాజాగా తెర‌మీదికి వ‌స్తున్న విష‌యం. ఈ నేప‌థ్యంలో శేరిలింగం ప‌ల్లిలో ఓటింగ్ శాతం చూసి ఎన్నిక‌ల సంఘం అధికారులు సైతం విస్తుపోతున్నారు. ఐటీ ఉద్యోగులు, యువ‌త ఎక్కువుగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో సోష‌ల్ మీడియా ప్ర‌భావం కూడా ఉంది. ముందు నుంచి ఇక్క‌డ పోలింగ్ ఎక్కువ జ‌రుగుతుంద‌ని అనుకున్న అంచ‌నాలు ఇప్పుడు రివ‌ర్స్ కావ‌డంతో ఇది ఎవ‌రి కొంప‌ముంచుతుందో ? అన్న సందేహాలు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: