ముంద‌స్తు ముచ్చ‌ట‌ను పూర్తి చేసుకున్న తెలంగాణాలో.. ఎన్నిక‌లు ముగిసి మూడు రోజులైనా కూడా ఎవ‌రు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? అనే విష‌యాల‌పై ఇప్ప‌టికీ త‌ర్జ‌న భ‌ర్జ‌ల‌ను సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఎవ‌రి అంచ‌నాలు వారు వేసుకుంటూ.. భ‌రోసా న‌టిస్తున్నార‌నే చెప్పాలి. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌నేది ప్ర‌తి ఒక్క‌రూ అంగీక‌రిస్తున్న మాట‌. అప్ప‌ట్లో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇప్పుడు విభ‌జ‌న త‌ర్వాత తెలంగాణాలో జ‌రిగిన ఎన్నిక‌లు అంద‌రిలోనూ ఆస‌క్తిగా మారాయి. అయితే, గ‌తానికి ఇప్ప‌టికీ ఎన్నిక‌ల ప‌ర్సంటేజ్ కూడా పెరిగింది. హోరాహోరీ పోరులో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోని నేతలు.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడంలో బాగానే సఫలీకృతులయ్యారు. 


పెరిగిన పోలింగ్‌ శాతమే దీనికి నిదర్శనం. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం మీద 4 శాతానికి పైగా పోలింగ్‌ పెరిగింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటింగ్‌ శాతం పెరుగుదల దీనికి కాస్త అటూ ఇటుగా ఉండాలి. కానీ, ఓటింగ్‌ సరళిని చూస్తే అనేక చోట్ల పోలింగ్‌ రికార్డు స్థాయిలో జరిగింది. కొన్ని చోట్ల పోలింగ్‌ శాతం తగ్గింది. 119 నియోజకవర్గాల్లో కేవలం 16 చోట్ల పోలింగ్‌ శాతం తగ్గగా.. మిగిలిన 103 స్థానాల్లో పెరిగింది. పోలింగ్‌ శాతం తగ్గిన 16 నియోజకవర్గాలు కూడా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. రాష్ట్రంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. ఇక 2014తో పోలిస్తే 103 నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ పెరుగుదల కనిపించినా.. అందులో 9 నియోజకవర్గాల్లో గత ఎన్నికలతో పోలిస్తే 10 శాతానికి పైగా పోలింగ్‌ ఎక్కువగా నమోదైంది. 


ఇలా పోలింగ్ పెర‌గ‌డంపై అనేక విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి. పోలింగ్ పెరిగింది కాబ‌ట్టి అధికార పార్టీకి ఇది వ్య‌తిరేక‌మ‌ని, కేసీ ఆర్ ఓట‌మి ఖాయ‌మ‌ని భావించి ఈ ఒక్క‌లైన్‌ను ఆధారంగా చేసుకుని స‌ర్వేలు వెలువ‌రించిన వారు కూడా ఉన్నారు. అదేస‌మ‌యంలో ఈ పెరిగిన ఓటు బ్యాంకు మొత్తంగా కూడా గ్రామీణ స్థాయిలోనే పెరిగింది. ప‌ట్ట‌ణాల్లో ఎక్క‌డా పోలింగ్ శాతం పెర‌గలేదు. దీనికితోడు మ‌హిళా ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న మ‌రికొంద‌రి విశ్లేష‌ణ ప్ర‌కారం.. ప్ర‌భుత్వం ముఖ్యంగా కేసీఆర్ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, వివిధ రూపాల్లో అందుతున్న సామాజిక పింఛ‌న్లు, కంటి వెలుగు వంటి ప‌థ‌కం ప్ల‌స్‌గా మారాయ‌ని, కాబ‌ట్టి గ్రామీణ స్థాయిలో వృద్దులు, మ‌హిళల ఓటు బ్యాంకు పెరిగింద‌ని అంటున్నారు. 


ఇది కేసీఆర్‌కు అనుకూల ఓటేన‌ని చెప్ప‌డంలో సందేహం లేద‌ని చెబుతున్నారు. దేవ‌ర‌కద్ర ప్రాంతంలో మ‌హిళ‌లు పూర్తిగా 99.94% ఓటింగ్‌లో పాల్గొన‌డం వ్య‌తిరేకంగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఇది కేసీఆర్‌కు అనుకూల‌మ‌న్న విశ్లేష‌ణ‌లు వ్య‌క్త‌మ‌వుతుంటే అటు ప్ర‌జాకూట‌మికి షాక్ త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: