ప్ర‌కాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప‌రిస్థితి ఏంటి? ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంటాడు? ఎటు వెళ్తాడు?  ప్ర‌స్తుతం ఉన్న టీడీపీలోనే ఉంటాడా ?  లేక త‌న దారి తాను చూసుకుంటాడా ? అనే ప్ర‌శ్న‌లు రాజ‌కీయ తెర‌పై త‌ర‌చుగా క‌నిపిస్తున్నాయి. త‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌తో ప్ర‌జ‌ల్లో పేరు తెచ్చుకున్నారు ఆమంచి. కాంగ్రెస్ దిగ్గజం రోశ‌య్య శిష్యుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసినా.. త‌ర్వాత త‌ర్వాత మాత్రం ఆయ‌న సొంత ఇమేజ్‌తో ముందుకు సాగారు. కాంగ్రెస్‌లో నుంచి విభ‌జ‌న త‌ర్వాత సొంత గానే చీరాల నుంచి పోటీ చేశారు. అప్ప‌టి ఎన్నిక‌ల్లో టీడీపీ నాయ‌కురాలు పోతుల సునీత‌పై విజ‌యం సాధించారు. 


దీంతో చంద్ర‌బాబు.. ప్ర‌జ‌ల్లో బ‌ల‌మైన నాయ‌కుడు త‌న పార్టీలో ఉంటే బాగుంటుంద‌ని భావించి.. ఆమంచిని స్వ‌యంగా పార్టీలో చేర్చుకున్నారు. చంద్ర‌బాబు పిలుపు స‌హా త‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల నేప‌థ్యంలో ఆమంచి టీడీపీ తీర్థం పుచ్చుకు న్నారు. అయితే, స్థానిక నాయ‌కులు మాత్రం ఆమంచిని త‌మ‌తో క‌లుపుకొనేంద‌కు ప్ర‌య‌త్నించ‌లేదు. పైగా ఎన్నిక‌లకు వేళ మించి పోతుండ‌డంతో చీరాల టీడీపీ టికెట్ ను ఆశిస్తున్న పోతుల వ‌ర్గం ఆమంచిని  సాధ్య‌మైనంత వ‌ర‌కు పార్టీకి దూరం చేయాల‌ని భావిస్తోంది. ఇక‌, పార్టీలోనూ త‌న‌కు పెద్ద‌గా గౌర‌వం లేద‌ని భావిస్తున్న ఆమంచి ఇక్క‌డ ఉండ‌డం క‌న్నా వేరే పార్టీని ఎంచుకోవ‌డం మంచిద‌ని భావిస్తున్నారు. నిజానికి త‌న‌ను చంద్ర‌బాబు స్వ‌యంగా ఆహ్వానించారు కాబ‌ట్టి కీల‌క‌మైన ప‌ద‌వి ఏదైనా ద‌క్కుతుంద‌ని ఆమంచి ఆశించారు. 


కానీ, ఆమంచి ఆశ‌లు ఫ‌లించ‌లేదు. నాలుగున్న‌రేళ్ల కాలం పూర్తిగా గ‌డిచిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప‌ద‌వీ వ‌చ్చే అవ‌కాశం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు టీడీపీలో ఉండి టికెట్ తెచ్చుకున్నా.. త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న పోతుల వ‌ర్గం చాప కింద నీరు మాదిరిగా త‌న ఓట‌మికి పావులు క‌దిపే ఛాన్స్ ఉంటుంద‌ని భావిస్తున్న ఆమంచి.. త‌న దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ పార్టీ జ‌న‌సేన‌లోకి వెళ్తార‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ప‌వ‌న్‌కు ఆమంచి మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర‌లేద‌ని, దీంతో ఆమంచి సొంత‌గానే బ‌రిలోకి దిగుతార‌ని కొంత మేర‌కు ప్ర‌చారం ఊపందుకుంది. ఇంతలోనే మ‌ళ్లీ.. వైసీపీ నుంచి ఆమంచికి ఆహ్వానాలు అందుతున్నాయ‌ని స‌మాచారం. దీంతో ఆమంచి త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఆమంచి ఎటు న‌డుస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: