విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు ఎటు ప‌య‌నిస్తున్నాయి? ఏ పార్టీ ఇక్క‌డ బ‌లంగా ఉంది? ఎవ‌రు గెలుస్తారు?  అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌ను చూసుకుంటే ఇక్క‌డ నుంచి టీడీపీ జెండాపై బ‌రిలోకి దిగిన కిమిడి మృణాళిని విజ‌యం సాధించా రు. దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపు గుర్రం ఎక్కారు. ఉన్న‌త విద్యావంతురాలు కావ‌డంతో చంద్ర‌బాబు వెంట‌నే ఆమెను మంత్రి వ‌ర్గంలోకి తీసుకున్నారు. అయితే, ఆమె ఇక్క‌డ పార్టీని అబివృద్ధి చేయ‌క‌పోగా.. త‌న సొంత ప‌నుల‌తోనే ఎక్కువ కాలం గ‌డిపార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. ఈ క్ర‌మంలోనే ఆమెను త‌ర్వాత జ‌రిగిన మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చంద్ర‌బాబు ప‌ద‌వి నుంచి ప‌క్క‌కు త‌ప్పించారు. ఇక‌, ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ టికెట్‌పై విజ‌యం సాధించారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. 


ఈయ‌న పార్టీలో ఉండ‌గా ఇక్క‌డ కాంగ్రెస్‌ను బాగానే బ‌లోపేతం చేశారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను కూడా బాగానే పెంచుకున్నారు. ఇక‌, ఆ రెండు ఎన్నిక‌ల్లోనూ బొత్స ఒక‌సారి 11 వేల ఓట్లు, త‌ర్వాత త్రిముఖ పోటీ ఉన్న స‌మ‌యంలో 5 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలోనే 2014లో ఆయ‌న కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసినా.. అప్ప‌టి విభ‌జన వేడి పెద్ద‌గా ఇక్కడ ప్ర‌భావం చూపించ‌లేదు. ప‌రాజ‌యం పాలైనా ఆయ‌న‌కు మాత్రం 42 వేల ఓట్లు ల‌భించాయి. ఇక‌, అదేస‌మ‌యంలో వైసీపీ అభ్య‌ర్థిగా రంగంలోకి దిగిన బొల్లాన చంద్ర‌శేఖ‌ర్ కూడా 42 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ త్రిముఖ పోటీ ఉన్నా.. బొత్స ఓటు బ్యాంకు బాగానే ఉంది. ఇక‌, ఇప్పుడు నాలుగు మాసాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో బొత్స తిరిగి ఇక్క‌డ నుంచి పోటీ చేస్తే.. ఆయ‌న గెలుపు సాధ్య‌మేనా? అనే చ‌ర్చ సాగుతోంది. 


వాస్త‌వానికి ఇక్క‌డ టీడీపీ ఒకింత బ‌ల‌హీనంగానే ఉంది. ఆధిప‌త్య పోరు ఎక్కువ‌గా ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కిమిడి మృణాళినిపార్టీని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇక్క‌డ నాయ‌క‌త్వ లోపం బాగానే క‌నిపిస్తోంది. అయితే, కొద్దిగా ఓటు బ్యాంకు త‌గ్గినా.. కాంగ్రెస్‌కు ఇక్క‌డ బ‌లంగా ఉన్న బొత్స వ‌ర్గం ఇప్పుడు వైసీపీలోకి రావ‌డంతో ఇది వైపీపీ అభ్య‌ర్థికి బ‌లాన్నిస్తుంద‌ని అంటున్నారు. అంటే.. బొత్స ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగితే.. కాంగ్రెస్‌+ వైసీపీ ఓటు బ్యాంకు మొత్తంగా ఆయ‌న‌కు ప‌డే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు.

అయితే, ఇక్క‌డ బొత్స వ‌ర్గంలోనూ కుమ్ములాట‌లు క‌నిపిస్తున్నాయి. మాకు ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రంటే.. మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇక‌, బొత్స కుటుంబ రాజ‌కీయాలు కూడా ఎక్కువ‌గా ఆధిప‌త్య ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం మ‌రింత చికాకు తెప్పిస్తోంది. దీనిని ఒకింత అధిగ‌మించేందుకు బొత్స చ‌ర్య‌లు చేప‌డితే..వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: