వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ఏడాదికి చేరువ అవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆయన చేస్తున్న పాదయాత్ర ఏడాది కంటిన్యూ చేయ‌డంతో ఇప్పుడు యావత్‌ దేశ రాజకీయాలను జగన్‌ తన వైపునకు తిప్పుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన వెంటనే జగన్‌ పాదయాత్ర ద్వారా కవర్‌కాని నియోజకవర్గాలను బస్సు యాత్రతో చుట్టేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌ ఆ పార్టీకి తిరుగులేని మైలేజ్‌ తీసుకువచ్చారు. అలాగే మరో వైపు నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను కూడా సెట్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో బలహీనమైన అభ్యర్థులను తప్పించి వారి స్థానాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా అనేక ఈక్వేషన్లలో బలమైన అభ్యర్థులను జగన్‌ రంగంలోకి దింపుతున్నారు. 


అభ్యర్థుల ఎంపికలో జగన్‌ ఈక్వేషన్లు చూసి టీడీపీ వాళ్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. వైసీపీకి వస్తున్న మైలేజ్‌ చూసి రాజకీయంగా సంధి కాలంలో ఉన్న సీనియర్లు సైతం వైసీపీలోకి జంప్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులో మాజీ కేంద్ర మంత్రులు సైతం ఉన్నారు. పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో ఓ వెలుగు వెలిగిన కేంద్ర మంత్రులు అయిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి, నెల్లూరు జిల్లాకు చెందిన పనబాక లక్ష్మి సైతం వైసీపీలోకి వెళ్తారని కొద్ది రోజులుగా వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కిల్లి కృపారాణి పార్టీ మార్పుపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. అయితే ఆమె తనకు వచ్చే ఎన్నికల్లో టెక్కలి సీటు కావాలని పెండింగ్‌ పెట్టడం అక్కడ వైసీపీ నుంచి ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో జగన్‌ ఆమెను పలాస నుంచి పోటీ చెయ్యాలని సూచించారు. ఈ క్రమంలోనే ఆమె మనసంతా టెక్కలి మీదే ఉండడంతో ఆమె వైసీపీ ఎంట్రీ వాయిదాలో పడుతూ వస్తోంది.


షాక్‌.. జగన్‌ వైపు పనబాక లక్ష్మి చూపు..!
మాజీ కేంద్ర‌మంత్రి కిల్లి కృపారాణి వైసీపీ ఎంట్రీ విషయంలో ఆమె ముందు నుంచి ఊగిసలాడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సైతం ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి వీరవిధేయులుగా ఉన్న పనబాక లక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్య కొద్ది రోజులుగా క్రియాశీలక రాజకీయాలు దూరంగా ఉంటున్నారు. గతంలో నెల్లూరు నుంచి ఎంపీగా గెలిచిన పనబాక లక్ష్మి 2009లో నెల్లూరు జనరల్‌ కావడంతో బాపట్లకు మారి అక్కడ నుంచి మరో సారి ఎంపీగా గెలిచి నాటి యూపీఏ ప్రభుత్వ హైయాంలో జౌళీ శాఖా స‌హాయ‌ మంత్రిగా పని చేశారు. పనబాక లక్ష్మి ఆమె భర్త కృష్ణయ్య 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు కారణంతో ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి పలువురు కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్‌ చేసేస్తున్నారు. సుదీర్ఘ‌గా టీడీపీతో వైరం ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు అదే టీడీపీలో చేతులు కలపడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ వాదులు ఎక్కువగా వైసీపీ ఆ తర్వాత జనసేనలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 


ఈ క్రమంలోనే పనబాక లక్ష్మి దంపతులు సైతం మధ్య‌వర్తులు ద్వారా వైసీపీ అధినేత జగన్‌కు రాయభారం పంపినట్టు తెలుస్తోంది. ఇంకా కాంగ్రెస్‌ పార్టీని పట్టుకుని వేలాడితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చర్చించుకున్న పనబాక ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలిసింది. పనబాక లక్ష్మికి బాపట్ల లోక్‌సభ సీటు, ఆమె భర్త పనబాక కృష్ణయ్యకు గుంటూరు జిల్లాలోని వేమూరు లేదా నెల్లూరు జిల్లాలోని ఏదో ఒక రిజర్వ్‌డ్‌ సీటు నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా తమకు హామీ ఇవ్వాలని వారు కోరుతున్నట్టు తెలిసింది. ఎస్సీ సామాజికవర్గంలో బలమైన మహిళా నేతగా ఉన్న పనబాక లక్ష్మితో పాటు, ఆమె భర్త కృష్ణయ్య వైసీపీలోకి చేరితే ఆ పార్టీకి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్లస్‌ అవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇక సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీలో పలువురు కీలక నేతల జంపింగులు జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: