మ‌రో నాలుగు మాసాల్లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీగా ఉన్న టీడీపీ ప్ర‌చారంలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇక‌, వైసీపీ పాద‌యాత్ర‌లు చేస్తోంది. అదేస‌మ‌యంలో కొంత మేర‌కు పోరు యాత్ర అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ మొత్తం  వ్య‌వ‌హారం చూస్తుంటే.. వ‌చ్చే ఎన్నిక‌లు ఎంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయో అర్ధ‌మ‌వుతుంది. ఇక‌, రాజ‌కీయంగా చూస్తే.. నాయ‌కులు కూడా త‌మ ఎవ‌రు అనుకూలంగా ఉంటే వారికి జైకొట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌ధానంగా టికెట్లు ఆశించి కూడా ద‌క్కించుకోనివారు ఈ రూట్‌లోనే ఆలోచిస్తున్నారు. ఇక టీడీపీ,వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో స‌గానికి పైగా మందికి టికెట్ ల‌భించే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది. 


అదేస‌మ‌యంలో కొత్త వారికి, వార‌సుల‌కు కూడా టికెట్లు ఇచ్చేందుకు సిద్ధ ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.  కాగా, ఈ నేప‌థ్యంలో నాయ‌కులు త‌మ‌కు అంది వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అనే తేడా లేకుండా ప్ర‌తి జిల్లాలోనూ ప‌రిస్థితి ఇలానే ఉంది. న‌గ‌రాల ప‌రిస్థితి చూసుకుంటే.. ఒక్కొక్క పార్టీ ప‌రిస్థితి ఒక్కొక్క న‌గ‌రంలో ఒక్కో విధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా కీల‌క‌మైన బెజ‌వాడ‌లో టీడీపీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా క‌నిపిస్తోంది. ఇక‌, క‌డ‌ప‌లో మాత్రం ఎప్ప‌టి మాదిరిగానే జ‌గ‌న్ ప్రభావం కొన‌సాగుతోంది. తిరుప‌తి విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భావం కొంత మేర‌కు క‌నిపించినా.. ఇప్పుడు మాత్రం వైసీపీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. 


ఏలూరులో ప‌రిస్థితి న‌ర్మ‌గ‌ర్భంగా ఉండడం గ‌మ‌నార్హం. విశాఖ‌లో టీడీపీకి బ‌ల‌మైన గాలులే వీస్తున్నాయి. రాజ‌మండ్రిలో మాత్రం ప‌రిస్థితి త‌ట‌స్థంగా క‌నిపిస్తోంది. అత్యంత కీల‌క‌మైన గుంటూరు జిల్లాలోనూ టీడీపీకి అనుకూలంగా నిన్న మొన్న‌టి వ‌రకు ఉన్న ప‌వ‌నాలు త‌ట‌స్థంగా మారిపోతున్నాయి. జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పార్టీకి త‌ట‌స్థ ప‌రిస్థితే క‌నిపిస్తోంది. 

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాబోయే రెండు నెల‌లూ ఈ మూడు పార్టీల‌కూ చాలా కీల‌క‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికిప్పుడు మాత్రం ఏ పార్టీకీ ఆశించిన స్తాయిలో ప‌రిస్థితి అనుకూలంగా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించే నాయ‌కుడు ఎవ‌ర‌నేది తేలితేనే రాష్ట్రం ఏక‌పార్టీ ప్ర‌భుత్వం ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: