విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, బీజేపీ నాయ‌కుడు పెన్మ‌త్స విష్ణుకుమార్ రాజు ఫ్యూచ‌ర్ ఏంటి? ఆయ‌న ఎటు చూస్తున్నారు?  రాజ‌కీయాలంటేనే చిరాకు పుట్టింద‌ని అంటున్న ఆయన అంత‌రంగంలో విష‌యం ఏంటి? అనే ప్ర‌శ్న‌లు తాజాగా తెర‌మీదికి వ‌స్తున్నాయి. 2014లో బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా విశాఖ ఉత్త‌రం నుంచి పోటీ చేసి గెలిచారు విష్ణు! నిజానికి ఆయ‌న పైకి రాజ‌కీయ నాయ‌కుడే అయినా.. లోప‌ల మాత్రం నిజాయితీప‌రుడు. త‌న‌, మ‌న లేకుండా ఎవ‌రు ఏం చేసినా చెప్పేసే మ‌న‌స్త‌త్వం ఉన్న నాయ‌కుడు. దీంతో నేటి త‌రం రాజ‌కీయాల్లో ఆయ‌న చాలానే విమర్శ‌లు ఎదుర్కొన్నారు. అయినా కూడా విష్ణు త‌న‌ను తాను స‌మ‌ర్థించుకుంటూనే ఉన్నారు. 


వాస్త‌వానికి బీజేపీలో ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ టీడీపీతో క‌లిసి ఉన్న నేప‌థ్యంలో రాష్ట్రం, పాల‌న‌, చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి పై  పాజిటివ్ కామెంట్లు చేశారు. ఆ త‌ర్వాత బీజేపీతో టీడీపీ తెగ‌తెంపుల నేప‌థ్యంలో బాబును వ్య‌తిరేకించ‌డం ప్రారంభించారు. కానీ, విష్ణు మాత్రం బాబు పాల‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు మార్కులు వేస్తూనే ఉన్నారు. అదేస‌మ‌యంలో విప‌క్షం వైసీపీని ఏమైనా ఎండ‌గ‌డుతున్నారా? అంటే.. అది కూడా లేదు. కొన్ని సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ను కూడా పొగిడిన ప‌రిస్థితి ఉంది. ఈ క్ర‌మంలోనే విష్ణు వైఖ‌రిపై అనేక మంది పెద‌వి విరిచారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే చంద్ర‌బాబును మించిన పాల‌కుడు ఏపీకి రాడంటూ కామెంట్లు చేసి.. బీజేపీ అదిష్టానం నుంచే మొట్టికాయ‌లు తిన్నారు. 


ఇక‌, బీజేపీ ఇప్పుడు టీడీపీపై ఫైట్ చేస్తోంది. ఈ క్ర‌మంలో విష్ణు కూడా టీడీపీకి వ్య‌తిరేకంగా కామెంట్లు చేయ‌డం కామ‌నే న‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఇప్ప‌టి వ‌రకు కూడా ఆయ‌న ఎక్క‌డా ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. అంతేకాదు, బీజేపీకి అనుకూలంగా కూడా వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఏపీకి కేంద్రం నుంచి ఎంతో ఆర్థిక సాయం రావాల‌ని అయితే కోరుతున్నారు కానీ, నిక్క‌చ్చిగా మాత్రం ఎక్క‌డా ఎలాంటి విమ‌ర్శ‌లు విష్ణు సంధించ‌డం లేదు. దీంతో ఆయ‌న టీడీపీ కండువా కప్పుకొంటారంటూ.. కొన్ని రోజులుగా వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే, ఈ విష‌యంపై విష్ణు ఎక్క‌డా క్లారిటీ ఇవ్వ‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంట‌నే విష‌యంపైనా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. క‌నీసం 20 కోట్ల‌యినా ఉంటే గెలిచేందుకు ఆస్కారం ఉంటుంద‌ని టీడీపీ నుంచి వ్యాఖ్య‌లు వినిపించ‌డంతోనే విష్ణు మౌనం వ‌హిస్తున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా.. విష్ణు మాత్రం మారిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: