గ‌త కాల‌పు అనుభ‌వాలు.. భ‌విష్య‌త్తుకు కీల‌క పాఠాలు!- అంటారు దివంగత రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం త‌న `వింగ్స్ ఆఫ్ ఫైర్` పుస్త‌కంలో. గ‌తించిన దాని నుంచి నేర్చుకుంటూ వ‌ర్త‌మానానికి అనువ‌ర్తింప చేసుకుని ముందుకు సాగేవాడికి భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని బోధిస్తారు.. డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ‌న్‌.- స‌రే! రాజ‌కీయాల్లో అయినా వ్య‌క్తిగ‌త జీవితాల్లో అయినా.. గ‌తం తాలూకు అనుభ‌వాల‌ను మాత్రం విడిచి పెట్ట‌లేం. వాటి నుంచి అనేక కొత్త విష‌యాలు.. అనుభ‌వాలు.. కోకొల్ల‌లుగా మ‌న‌ల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొత్త కొత్త ల‌క్ష్యాల‌ను మ‌న‌కు చేరువ చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు 2018 నుంచి 2019లోకి అడుగు పెట్టాం. ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. ఏనేత సంగ‌తి ఏంటి? ఏనేత ఎలా మారాడు?  ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం ఎలా సాగింది? ఏ పార్టీ ఏ వ్యూహం అనుస‌రించింది?


 ఏ నాయ‌కుడి నాలుక ఎన్ని విధాలుగా ప‌లికింది?  ఎన్నెన్ని ట‌ర్న్‌లు.. మ‌రెన్ని యూట‌ర్న్‌లు.. వంటి అనేక అంశాల‌ను మ‌న‌కు అందించి ఎంచ‌క్కా జారుకున్న 2018.. ఏపీ నాయ‌క నిర్ణాయక పాత్ర‌ను మాత్రం 2019కి వ‌దిలి వెళ్లిపోయింది! ఈ ఏడాది మ‌రో నాలుగు మాసాల్లో అత్యంత కీల‌క‌మైన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వ్యాంధ్రలో తొలిసారి జ‌రుగుతున్న కీల‌క‌, అత్యంత ఉత్కంఠ భ‌రిత ఎన్నిక‌లు కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా అత్యంత సీనియ‌ర్ మోస్ట్ రాజకీయ నాయ‌కుడికి.. అదేస‌మ‌యంలో అత్యంత జూనియ‌ర్ మోస్ట్ రాజ‌కీయ నేత‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న స‌మ‌రం కావ‌డంతో ఓ ర‌కంగా దేశ‌వ్యాప్తంగా ఏపీపై రాజ‌కీయ నేత‌ల, విశ్లేష‌కుల, రాజ‌కీయ నిపుణుల దృష్టి ప‌డింది. భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంద‌నేది విశ్లేష‌ణ చేసుకునే ముందు.. గ‌తించిన కాలం తాలూకు కొన్నిజ్ఞాప‌కాల‌ను నెమ‌రు వేసుకుందాం. 


టీడీపీ
2014లో ఊహించ‌ని విధంగా చంద్ర‌బాబుకు అధికారంలోకి వ‌చ్చారు. అదేస‌మ‌యంలో ఆయ‌న ఊహించ‌ని రీతిలో 2018లో రాజ‌కీయంగా ట‌ర్న్ మీద ట‌ర్న్‌లు తీసుకున్నారు. 2018 ప్రారంభం వ‌ర‌కు కూడా ఏపీకి ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం లేద‌న్న బాబు.. ఈ ఏడాది రెండు, మూడు మాసాల నుంచి మాత్రం ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, ఏప్రిల్ 20న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వంపై ధ‌ర్మ పోరాట దీక్ష‌కు దిగి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించారు. 2014లో క‌లిసి పోటీ చేసి, మోడీని ప్ర‌ధానిని చేయ‌డంలో నా పాత్ర ఉంద‌ని చెప్పుకొన్న చంద్ర‌బాబు అదే మోడీ ప్ర‌భుత్వంపై అవిశ్వాసం ప్ర‌క‌టించి మ‌రో సంచ‌ల‌నానికి శ్రీకారం చుట్టారు. ఇక‌, త‌న బ‌ద్ధ శ‌త్రువు, ఏ పార్టీ వ్య‌తిరేక పునాదుల‌పై టీడీపీ ఉద్భ‌వించిందో అదే పార్టీ కాంగ్రెస్‌తో జట్టుక‌ట్టి.. దానిని కూడా త‌నకు అనుకూలంగా మ‌లుచుకోవ‌డంలో చంద్ర‌బాబు కృత కృత్యుల‌య్యారు. 
ఇక‌, తెలంగాణా ఎన్నిక‌లు అత్యంత కీల‌క మ‌లుపుగా.. చంద్ర‌బాబు జీవితంలో మిగిలిపోయాయి. ఈ ఎన్నిక‌ల్లో త‌ను శాసించాల‌ని ఆయ‌న అనుకున్నారు.
Image result for chandrababu meeting
తెలంగాణాలో చ‌క్రం తిప్ప‌డం ద్వారా త‌నకు శ‌త్రువైన కేసీఆర్‌పై క‌సి తీర్చుకోవాల‌ని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా బెడిసి కొట్టిన ఈ ప‌రిస్థితి చంద్ర‌బాబును కోలుకోలేకుండా చేసింది. ఇక‌, సెంటిమెంటు రాజ‌కీయాల‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే చంద్ర‌బాబు రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. దానిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవ‌డం లో 2018ని బాగానే వాడుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో రెండు తుఫానులు వ‌చ్చాయి. ఒక‌టి శ్రీకాకుళంలో తిత‌లీ, మ‌రొక‌టి పెథాయ్‌. తిత‌లీతో శ్రీకాకుళం దెబ్బ‌తిన్న‌ప్పుడు అక్క‌డ చేసిన స‌హాయ స‌హ‌కారాల‌ను కూడా బాబు త‌నకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇక‌, పెథాయ్ కి ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుని తాను ఏర్పాటు చేసిన సాంకేతిక వ్య‌వస్థ ద్వారానే తుఫాను గండం నుంచి తాము త‌ప్పుకున్నామ‌ని ప్రచారం చేసుకున్నారు.
 ఇక‌, ఈ ఏడాది పార్టీ ప‌రంగా పెద్ద సంచ‌ల‌నాలు లేక‌పోయినా.. కాంగ్రెస్‌తో క‌ట్టిన జ‌ట్టు.. 2019లో కొన‌సాగుతుందా?  తెలంగాణ ఫ‌లితాల కార‌ణంగా ఆగిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కం. ఇక‌. 2018లో బాబు చేసిన ప్ర‌యోగం.. కాంగ్రెస్‌తో కూడిన మ‌హాకూటమి ఏర్పాటు. దీనికి ఆయ‌న బాగానే శ్ర‌మించారు. కేంద్రంలో న‌రేంద్ర మోడీని తిరిగి అధికారంలోకి తీసుకురాకుండా చూసేలా ఆయ‌న చ‌క్రం తిప్పాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్‌, యూపీ వంటి రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌తో జ‌ట్టుకు తెర‌దీశారు. కానీ.. ఇది స‌ఫ‌లం అవుతుందా?  విఫ‌లం అవుతుందా అన్న‌ది తేల్చ‌కుండానే 2018 నిష్క్ర‌మించింది. 2017లో ఏ కాంగ్రెస్‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారో.. చంద్ర‌బాబు అదే పార్టీని త‌న నెత్తిన పెట్టుకోవ‌డం 2018లో చిత్ర‌మైన విచిత్రం! ఈ మొత్తం ప‌రిణామంలో 2018లో బాబు కేంద్రంపై చేసిన యుద్ధంలో సాధించింది ఏమ‌న్నా ఉందా? అంటే ప్ర‌శ్నార్థ‌క‌మే క‌నిపిస్తోంది. 


వైసీపీ:
అధికారంలోకి రావ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ముందుకు సాగుతున్న వైసీపీ నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్‌కు ఈ ఏడాది క‌లిసి వ‌చ్చిందా? ఆయ‌న‌కు సెంటిమెంటు పాళ్లు పెరిగాయా? అంటే లేవ‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది! అత్యంత కీల‌క‌మైన అసెంబ్లీ స‌మావేశాల‌ను ఈ ఏడాది పూర్తిగా ఆయ‌న బ‌హిష్క‌రించారు. దీనికి కార‌ణాలు ఏమైనా కావొచ్చు. కానీ, ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు క‌ట్ట‌బెట్టిన అధికారాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మైన విప‌క్ష నేత‌గా ఆయ‌న దేశంలోని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో మిగిలిపోయారు. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఫిరాయించార‌ని, వారిపై వేటు వేస్తేనే స‌భ‌కు వ‌స్తాను-అనే ఏకైక రీజ‌న్‌తో ఆయ‌న చేసిన రాజకీయం ఏమాత్ర‌మూ స‌క్సెస్ కాలేదు. ఇక‌, త‌న పాద‌యాత్ర ద్వారా నిరంత‌రాయంగా ప్ర‌జ‌ల్లోనే ఉన్నా.. ప్ర‌సంగాలు దంచి కొట్టినా.. అవి కూడా ఆశించిన మేర‌కు సెంటిమెంటు శిఖ‌రాన్ని ఎక్కించ‌లేక‌పోయానేది ఆయ‌న చేయించుకున్న స‌ర్వేలే చెప్పుకొచ్చాయి. 

Related image

జ‌గ‌న్ ఆశించింది ఈ పాద‌యాత్ర ద్వారా ఒక్క అధికారంలోకి రావ‌డ‌మే కాదు.. టీడీపీ నుంచి బ‌ల‌మైన నాయ‌కులు త‌న పార్టీలోకి రావాల‌ని కోరుకున్నారు. కానీ వచ్చింది లేదు. ఇక‌, అధికారంలోకి వ‌చ్చేస్తారా?  ఈ పాద‌యాత్ర సీఎం సీటును జ‌గ‌న్‌కు రిజ‌ర్వ్ చేసేసిందా? అంటే.. అది కూడా అంతుప‌ట్ట‌ని ప్ర‌శ్న‌గా మారిపోయింది. కేంద్రంపై పోరులో భాగంగా ఉన్న ఎంపీలతో రాజీనామాలు చేయించ‌డం జ‌గ‌న్ చేసిన సంచ‌ల‌న‌మే! కానీ, ఇది కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. పార్టీకి సింప‌తీని సంపాయించుకోవ‌డంలో వేసిన పిల్లిమొగ్గ‌లు ఫ‌లితాన్ని దూరం చేశాయి. దీంతో జ‌గ‌న్ పాచిక పార‌లేద‌నే చెప్పాలి. అదేస‌మ‌యంలో అధికార పార్టీ అవినీతి చేస్తోంద‌ని, ఇసుక మాఫియా రాష్ట్రాన్ని మింగేస్తోంద‌ని, బాబు వ‌చ్చినా జాబ్ రాలేద‌ని, చిన్న‌బాబుకు ఉద్యోగం ఇప్పించుకున్నార‌ని చేసిన భారీ విమ‌ర్శ‌లు సైతం బుట్ట‌దాఖ‌లు అయ్యాయి. 


ఇక‌, అంతిమంగా విశాఖ విమానాశ్ర‌యంలో సాక్షాత్తూ జ‌గ‌న్‌పై జ‌రిగిన కోడి క‌త్తి దాడి ఘ‌ట‌న విష‌యంలోనూ దీనిని పార్టీకి అనుకూలంగా మార్చుకోవ‌డంలోనో.. లేదా త‌న‌పై సింప‌తీగా దీనిని వినియోగించుకోవ‌డంలోనో.. జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారా? అంటే లేద‌నే విష‌యం ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక‌, ఇదేవిష‌యాన్ని రాజకీయం చేసిన‌.. టీడీపీ త‌మ్ముళ్లు త‌మ‌పై బుర‌ద జ‌ల్లించుకోకుండా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుని.. ఒడ్డున ప‌డ్డారు. వైసీపీ విష‌యంలో మ‌రో కీల‌క విష‌యం.. 2017 చివ‌ర వ‌ర‌కు ప‌ట్టుకుని పాకులాడిన ప్ర‌త్యేక హోదా నినాదాన్ని.. 2018లో జ‌గ‌న్ ఠ‌క్కున వ‌దిలేయ‌డం మ‌రో పెద్ద మైన‌స్‌గా మారిపోయింది! కీల‌క నేత‌ల‌కు వాయిస్ లేకుండా పోయిన సంవ‌త్స‌రం కూడా ఇదే. ఇక‌, ఎన్నికల వ్యూహంలో భాగంగా ఎక్క‌డిక‌క్క స‌మ‌న్వ‌య క‌ర్త‌ల‌ను మార్చి కేడ‌ర్‌లో అయోమ‌యం, నిర్వేదం సృష్టించి సాధించింది కూడా ఏమీ లేదు? వెర‌సి.. మొత్తంగా విప‌క్ష నేతకు విజ‌యం క‌న్నా.. విమ‌ర్శ‌లే ఎక్కువ‌గా మిగిల్చింది 2018 సంవ‌త్స‌రం!!


జ‌న‌సేన‌
ప్ర‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ఈ 2018 ఏం మిగిల్చింది? ఎటు ప‌య‌నించేలా చేసింది? అంటే.. అయోమయం.. తిక‌మ‌క‌- అనే చెప్పాల్సి ఉంటుంది. 2018 మ‌ధ్య వ‌ర‌కు సినిమాల‌తో గ‌డిపేసిన ప‌వ‌న్‌.. జూన్ నుంచి త‌న రాజ‌కీయ యాత్ర సాగుతుంద‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం క‌లిగించారు. ఇంకేముంది.. ప‌వ‌న్ క‌న్ను తెరిస్తే.. క‌ద‌నం.. ప‌న్నెత్తితే ప్ర‌క‌ళ‌యం! అనే రేంజ్‌లో ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు. తెలంగాణాలోనూ త‌న పార్టీ ప‌రుగు పెడుతుంద‌ని ప్ర‌క‌టించి కొండ‌గ‌ట్టులో బ‌స్సు యాత్ర చేశారు. అక్క‌డ కేసీఆర్ పాల‌న‌కు స‌ర్టిఫికెట్ ఇచ్చి.. ప్ర‌థ‌మ పాదంలోనే త‌ప్పుట‌డుగు వేశాడు. ఇక‌, ఏపీలో శ్రీకాకుళంలో ప్రారంభించిన పోరు యాత్ర కూడా నాలుగు అడుగులు ముందుకు రెండ‌డుగులు వెన‌క్కి అన్న‌చందంగానే మారింది. ప్ర‌త్యేక హోదా హోసం ఏదైనా చేస్తాన‌ని.. వైసీపీ కానీ,టీడీపీ కానీ.. దీనిపై క‌దిలితే.. చాలు.. మిగితాది నేను చూసుకుంటాన‌న్నారు. 

Image result for pawan kalyan meeting

వెన‌క‌టికి ఎవ‌డో.. కొండ ఎత్తి నా నెత్తిన పెడితే.. మోస్తాను! అన్న‌ట్టుగా మాట‌లు దంచికొట్టాడు ప‌వ‌న్‌. అత్యంత కీల‌క‌మైన రాజ‌కీయ సంవ‌త్స‌రంలో ఉన్నామ‌నే వ్యూహం కూడా లేకుండా అర్ధాంతరంగా యాత్ర‌ను ముగించి.. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ఆదాయంపై లెక్క‌లు వేసేందుకు హైద‌రాబాద్‌లో మేధావుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఏపీకి ఎన్ని కోట్లు రావాలో.. దీనికి ఎలా ముందుకు వెళ్లాలో.. తాను నిర్ణ‌యిస్తాన‌ని ప్ర‌క‌టించి తుద‌కు ఈ బాగోతాన్ని బంగాళాఖాతంలో క‌లిపి కూర్చున్నారు. ఇక‌, మ‌ధ్య‌లోనే త‌న ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లు, హామీల‌ను గుప్పించారు. అయితే, వీటిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన వ్యూహ‌క‌ర్త‌ల‌ను కానీ, కార్య‌క‌ర్త‌ల‌ను కానీ, కీల‌క నేత‌ల‌ను కానీ ఆయ‌న నియ‌మించ‌కుండానే పందిరి లేని పెళ్లికి తాటాకుల చ‌ప్పుళ్లు.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.


రాజ‌మండ్రి క‌వాతు, అనంత పురం క‌వాతులు త‌న రాజ‌కీయ పార్టీకి వెన్నుద‌న్నుగా ఉంటాయ‌ని అనుకున్నా.. క‌వాతులు మిగిల్చిన క‌థ కూడా ఏమీ లేకుండా పోయింది. ఇక‌, కానిస్టేబుల్ కుమారుడు సీఎం కాకూడ‌దా? అంటూ పేల్చిన సెంటిమెంటు బాంబు కూడా భారీ సౌండ్ చేయ‌లేక‌పోయింది. త‌న‌కు చేరువ అవుదామ‌నుకున్న కాపు సామాజిక వ‌ర్గాన్ని కూడా త‌న‌కు కులాల‌తో ప‌నిలేద‌ని ప్ర‌క‌టించి దూరం పెట్ట‌డం మ‌రో పెద్ద పొర‌పాటు. వెర‌సి ప‌స‌లేని నేత‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం 2018లో చేరిన అంకం లేకుండా పోయింది. పార్టీలోకి చేరేవారు ఉన్నారా? అనేది ప్ర‌శ్న‌.. చేరే వారు ఉన్నా.. త‌న‌కేదో సిద్ధాంతాలున్నాయ‌ని చెబుతున్న ప‌వ‌న్‌కు ఆ సిద్ధాంతాల‌కు విలువ ఇచ్చే నేత‌లు లేనిరాజ‌కీయాల‌కు మ‌ధ్య చాలా గ్యాపే ఉండ‌డం 2018 మిగిల్చిన పెద్ద అగాథం!!


ముగింపు:
కీల‌క‌మైన ఈ మూడు పార్టీల్లోనూ అధికార దాహానికి మాత్రం ఏమాత్రం త‌క్కువ లేదు. అయితే, ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌విధంగా వ్యూహ లోపం ప్ర‌తి పార్టీలోనూ క‌నిపిస్తోంది. రోజుకో విన్యాసం చేసే చంద్ర‌బాబు.. తాను ప‌ట్టిన కుందేలుకు మూడు కాళ్లే అని.. వ్యూహాల‌కు అనుకూలంగా రాజ‌కీయాలు చేయాలేని వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇక‌, ఎలాంటి వ్యూహం లేకుండా గాలివాటంగా రాజ‌కీయాలు చేసిన ప‌వ‌న్‌లు.. 2018లో సాధించింది శూన్యం! మ‌రి వీరికి 2019 ఎలాంటి భ‌విష్య‌త్తును ఇస్తుందో?  ఎవ‌రిని రాజును చేస్తుందో?  చూడాలి!! 


మరింత సమాచారం తెలుసుకోండి: