ఏపీ సీఎం చంద్ర‌బాబు గురించి తెలిసిన వారికి ఆయ‌న వ్యూహాలు కూడా తెలిసే ఉంటాయి.  ఏ విష‌యాన్న‌యినా త‌న కు అనుకూలంగా మార్చుకోవ‌డంలో చంద్ర‌బాబు దిట్ట‌. వ్య‌తిరేక విష‌యాన్న‌యినా కూడా త‌న‌కు అనుకూలంగా మార్చు కోవ‌డంలో ఆయ‌నది ఎప్పుడూ పైచేయే! ఇప్పుడు కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు రాజ‌కీయాల‌ను త‌ను ఇష్టానుసారంగా మార్చేసుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా స‌రే విజ‌యం సాధించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టికే.. త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువైన కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్టారు. అయితే, ఏపీలో బ‌ల‌మైన ప‌క్షంగా ఉన్న వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు త‌న బ‌లం స‌రిపోద‌ని భావిస్తున్న చంద్ర‌బాబు మ‌రింతగా క‌లిసి వ‌చ్చే వారిని క‌లుపుకొని పోయేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.  


ఈ క్ర‌మంలో త‌న‌ను తిట్టిపోసిన వారిని కూడా క‌లుపుకొని పోవాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. వాస్త‌వానికి చంద్ర‌బా బుకు వాడుకుని వ‌దిలేస్తార‌నే పేరుంది. ఆయ‌న ఎవ‌రితోనైనా పొత్తు పెట్టుకోగ‌ల స‌మ‌ర్ధుడు. అదేస‌మ‌యంలో ఆయ‌న పొత్తును కూడా వ‌దులుకొని దానిని కూడా త‌న‌కు అనుకూలంగా మార్చుకోగ‌ల రాజ‌కీయ ప‌రిజ్ఞానం ఉన్న నాయ‌కుడు. ఇక‌, ఇప్పుడు ఇలాంటి వ్యూహ‌మే ప‌న్నిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌ను 2014లో పొత్తు పెట్టుకుని మ‌ళ్లీ వ‌దులుకున్న ప‌వ‌న్‌తోనే మ‌ళ్లీజ‌ట్టుకు రెడీ అయ్యార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విష‌యంపై చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. నేను  ప‌వ‌న్ క‌లిస్తే జ‌గ‌న్‌కు న‌ష్ట‌మే..? అయినా నేను ఆయ‌న క‌లిసి పోటీ చేస్తే జ‌గ‌న్‌కు ఎందుకు.? అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి. 


వ‌చ్చే ఎన్నిక‌ల‌కు 2014 ఎన్నిక‌ల‌కు చాలా తేడా క‌నిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో బాబు ఏదో అభివృద్ధి చేస్తాడ‌ని, అంత‌కు మించిన బుర్ర ఎవ్వ‌రికీ లేద‌ని ఏపీ ప్ర‌జ‌లు భావించారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌కు ప‌ట్టం క‌డ‌దామ‌ని అనుకున్న వారు కూడా బాబు వైపు మొగ్గారు. దీనికి జ‌న‌సేనాని ప‌వ‌న్ ప్ర‌చారం కూడా తోడ్ప‌డింది. అయితే, నాలుగున్న‌రేళ్లు గ‌డిచి పోయే స‌రికి.. అస‌లు విష‌యం స్ప‌ష్ట‌మైంది. బాబు మాట‌ల్లో 100 శాతం అభివృద్ధి ఉంటే.. చేత‌ల్లో మాత్రం 50 శాత‌మే క‌నిపిస్తోంది. దీనికి తోడు అవినీతి పెచ్చ‌రిల్లుతోంది.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒంట‌రిగానో లేక‌... కాంగ్రెస్ వంటి వెంటిలేట‌ర్ పార్టీనో వెంటేసుకుని వెళ్తే.. విప‌క్షంలోకి వెళ్లాల్సిందేన‌ని భావించిన చంద్ర‌బాబు.. ఏదేమైనా.. ప‌వ‌న్ అన్న మాట‌లు తుడిచేసుకునైనా స‌రే.. ఆయ‌న‌తో జ‌ట్టుకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.  అయితే, ప‌వ‌న్ ఈ విష‌యంలో అనుకూలంగా మాత్రం వ్య‌వ‌హ‌రిస్తే.. మొత్తానికే ప‌రిస్థితి బ్యాడ్ అవుతుంద‌ని ప‌వ‌న్ హెచ్చ‌రిస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి జానీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: