ప్ర‌త్య‌ర్థులు ప‌న్నే రాజ‌కీయ‌ వ్యూహాల‌ను ప‌సిగ‌ట్టి వాటికి చెక్ పెట్టుకుంటూ వెళ్ల‌లేక పోతే.. ఏ పార్టీ అయినా ఏపీలో బతికి బ‌ట్ట‌క‌ట్ట‌డం అనేది అంత ఈజీ విష‌యం కాదు. మ‌నం ఎంత బ‌లంగా ఉన్నామ‌నే విష‌యం క‌న్నా.. ప్ర‌త్యర్థిని ఎంత బ‌ల‌హీన ప‌రిచాం అనేది రాజ‌కీయాల్లో కీల‌క ఘ‌ట్టం! ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు నాలుగు మాసాలే గ‌డువు ఉండ‌డంతో నాయ‌కులు ఎవ‌రికి వారే త‌మ బ‌లాన్ని నిరూపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక‌, విప‌క్ష నాయ‌కుడిగా జ‌గ‌న్ అనుస‌రించే వ్యూహంపైనే ఇప్పుడు అంద‌రి క‌ళ్లూ ఉన్నారు. నాయ‌కులు ఎవ‌రు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నార‌నేది ప్ర‌ధాన‌మే అయినా.. జ‌గ‌న్ వంటి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం ఉన్న ఏపీలో ఆయ‌న వేసే అడుగుల‌కు కూడా ప్రాధాన్యం ఉంటుంది.


అధికార పార్టీపై ఒక‌ప‌క్క విమ‌ర్శ‌లు చేస్తూనే.. మ‌రొప‌క్క‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుతో వెళ్లాలా?  లేక ఒంట‌రి పోరు చాలా?  అనే విష‌యంపై వైసీపీలో గ‌త కొన్నాళ్లుగా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. అయితే, ఈ విష‌యంలో తాము ఎలాంటి అడుగు వేసినా.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో విప‌క్షం వైసీపీ మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింతగా మారిపోయాయి. అధికార పార్టీ త‌మ‌కు ఎవ‌రొ ఒక‌రు తోడుగా ఉంటేనే త‌ప్ప ఎన్నిక‌ల‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి. ఇక‌, మ‌రోపక్షం జ‌న‌సేన ఇప్ప‌టి వ‌ర‌కు సంస్థాగ‌తంగా బ‌ల‌ప‌డ‌లేదు. 


ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. త‌న బ‌లాబ‌లాల‌ను విశ్లేష‌ణ చేసుకుని ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల తాలూకు అనుభ‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం కూడా ఇప్పుడు అత్యంత అవ‌స రం. ఇప్ప‌టికే రాష్ట్రంలో రాజ‌కీయాల‌పై ఒక అవ‌గాహ‌న వ‌చ్చింది. చంద్ర‌బాబుతో క‌లిసి ముందుకు న‌డిచేందుకు ఒక్క కాంగ్రెస్‌(దీనికి ఏపీలో ఎక్క‌డా బ‌లం క‌నిపించ‌డం లేదు) త‌ప్ప మ‌రొక పార్టీ ముందుకు రానిప‌రిస్థితి ఉంది. నిజానికి ఇంత సుదీర్ఘ రాజ‌కీయ జీవితంగా చంద్ర‌బాబుకు ఇంత వ్య‌తిరేక‌త రావ‌డం ఇదే తొలిసారి అని అంటున్నారు.ఇక‌, వామ‌ప‌క్ష నేత‌ల‌తో ముందుకు వెళ్తున్న ప‌వ‌న్ కూడా పెద్ద‌గా పోటీ ఇచ్చే ఛాన్స్ లేద‌ని అంటున్నారు. 


ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌.. త‌న పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే.. మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రించి నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సూచిస్తున్నారు విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుంటే.. జ‌గ‌న్‌కు విజ‌యం త‌థ్య‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: