అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఒక‌ప‌క్క సిద్ధ‌మ‌వుతూనే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల పైనా టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు దృష్టిసారించారు. 25 ఎంపీ స్థానాల్లో గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న ఆయ‌న‌.. అభ్య‌ర్థుల ఎంపిక‌పై కస‌ర‌త్తు ప్రారంభించారు. ఢిల్లీలో మ‌ళ్లీ చ‌క్రం తిప్పాలంటే వీలైన‌న్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న చంద్రబాబు.. ఇందుకోసం ప్ర‌త్యేక వ్యూహాలు ర‌చిస్తున్నారు. లోక్‌స‌భ బ‌రిలో బ‌ల‌మైన అభ్య‌ర్థుల వేట‌లో ఉన్న ఆయ‌న‌.. అభ్య‌ర్థుల ఎంపిక‌పై దాదాపు క్లారిటీ ఇస్తున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఇందులో భాగంగా రాష్ట్ర కేబినెట్‌లోని ఇద్ద‌రు మంత్రుల‌ను లోక్‌స‌భ‌కు పంపాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. వీరిలో ఒక‌రు అయ్య‌న్న‌పాత్రుడు, మ‌రొక‌రు ఆదినారాయ‌ణ‌రెడ్డి! రాష్ట్ర కేబినెట్‌లో కీల‌క శాఖ‌లు నిర్వ‌హిస్తున్న వీరిని.. ఎంపీగా బ‌రిలోకి దింపనున్నార‌నే చ‌ర్చ టీడీపీలో మొద‌లైంది. బలమైన మంత్రులను ఎంపీలుగా బరిలోకి దింపితే... ఆ ప్రభావం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలపైనా ప‌డుతుంద‌ని చంద్రబాబు యోచిస్తున్నారు. 

Image result for minister adinarayana reddy

ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. రాజ‌కీయ పార్టీలు అసెంబ్లీ, సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు అస్త్రశ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా అభ్య‌ర్థుల ఎంపిక‌పై అన్ని పార్టీలు దృష్టిసారించాయి. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నే దృఢ సంక‌ల్పంతో ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇప్ప‌టికే ఎమ్మెల్యే అభ్య‌ర్థులపై ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లోనూ ఆయ‌న ప్ర‌త్యేక వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అయ్య‌న్న‌, ఆదినారాయ‌ణ రెడ్డి పేర్లు ఎంపీ బ‌రిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్న అయ్యన్నపాత్రుడు వచ్చే ఎన్నికల్లో తన తనయుడు విజయ్ పాత్రుడుకు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. తన కుమారుడికి ఎంపీ సీటు ఇస్తే.. నర్సీపట్నం నుంచి టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నట్టు సమాచారం. 

Image result for ayyanna patrudu

ఇద్ద‌రికీ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే కంటే.. విజ‌య్ పాత్రుడికి న‌ర్సీప‌ట్నం అసెంబ్లీ సీటు ఇచ్చి.. అయ్య‌న్న‌ను అన‌కాప‌ల్లి ఎంపీగా బ‌రిలోకి దించాల‌నే యోచ‌న‌లో టీడీపీ అధిష్ఠానం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించే ఆలోచనలో టీడీపీ ఉందని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక మరో మంత్రి ఆదినారాయణరెడ్డిని ఈసారి కడప ఎంపీగా బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం భావిస్తోందని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వైసీపీని సమర్థంగా ఎదుర్కోవాలంటే ఆయ‌న బ‌రిలో ఉండాల్సిందేన‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి రామసుబ్బారెడ్డిని పోటీ చేయించాలని అనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

Image result for avanthi srinivas

ఆదినారాయ‌ణ రెడ్డి.. టీడీపీలో చేరిక‌ను తొలి నుంచి రామ‌సుబ్బారెడ్డి వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే! స‌ర్దుబాటు కోసం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా.. ఇప్ప‌టికీ ఈ సెగ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి మ‌ధ్య టికెట్ కోసం పోటీ తీవ్ర‌మ‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రో ఒక‌రకి ఎంపీ టికెట్ ఇస్తే.. రాజ‌కీయంగా విభేదాలు త‌గ్గుతాయ‌నేది చంద్ర‌బాబు ఆలోచ‌న‌. అంతేగాక క‌డ‌ప‌లో జ‌గ‌న్ ఫ్యామిలీని ఢీకొట్టేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థి కూడా దొరికిన‌ట్లు అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: