నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్షలు, ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ‌లూ పూర్త‌య్యాయి! వ‌రుస‌గా స‌ర్వేలు నిర్వ‌హించి ఎవ‌రిని బ‌రిలోకి దించాలనే విష‌యంపై క్లారిటీ వచ్చేసింది! అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని.. అభ్య‌ర్థుల బ‌లాబ‌లాలు, ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌హీన‌త‌లు.. అన్నీ బేరీజు వేసుకున్న అనంత‌రం జాబితాకు తుది రూపు వ‌చ్చింది! ఆఖ‌రు నిమిషం వ‌ర‌కూ అభ్య‌ర్థులను ప్ర‌క‌టించ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఈసారి మాత్రం ఆ విధానానికి స్వస్తి ప‌లికారు. ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామని వెల్ల‌డించిన ఆయ‌న‌.. ఈమేర‌కు క‌స‌ర‌త్తు పూర్తిచేశార‌ని తెలుస్తోంది. దీంతో ప్ర‌చారానికి త‌గినంత స‌మ‌యం ఉండ‌టంతో పాటు అల‌క‌లు, విభేదాల‌ను త్వ‌ర‌గా ప‌రిష్క‌రించ‌గ‌లిగే అవ‌కాశ‌ముంటుంద‌నే ఆలోచ‌న‌తో ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తొలి ద‌శ‌ అభ్య‌ర్థుల జాబితా సిద్ధం చేశార‌ని తెలుస్తోంది. ఈ జాబితా విడుద‌ల‌కు కూడా ముహూర్తం ఖ‌రారు అయిన‌ట్లు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో తొలి జాబితా విడుద‌ల‌వుతుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి. 


బీజేపీపై యుద్ధం ప్ర‌క‌టించి జాతీయ స్థాయిలో పోరుకు సిద్ధ‌మ‌వుతున్న చంద్ర‌బాబు.. ప్ర‌తిప‌క్షాల‌కు ఏమాత్రం అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్నారు. అందుకే ఈసారి ఎన్నిక‌ల వ్యూహాన్నిపూర్తిగా మార్చారు. ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేందుకు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు. జనవరిలో తొలి జాబితా విడుదల చేస్తామ‌ని కొంతకాలం క్రితం పార్టీ నేతల టెలి కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఆ దిశగా అంతర్గత కసరత్తు కూడా చేపట్టారు. కానీ తాజా పరిణామాలతో ఆ ముహూర్తం మారినట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో తొలి జాబితా విడుదల ఉంటుందని ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాల్లో వినిపిస్తోంది. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ తర్వాత అభ్యర్థుల పేర్ల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. 


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జన్మభూమి కార్యక్రమం జరుగుతోంది. 11 వరకూ ఇది జరగనుంది. తర్వాత సంక్రాంతి పండుగ సెలవులు వస్తున్నాయి. ఆ తర్వాత 18న మంత్రివర్గ సమావేశం, 20న దావోస్‌ పర్యటనకు వెళ్లి 25న చంద్ర‌బాబు తిరిగి వస్తారు. ఆ మర్నాడు రిపబ్లిక్ డే. 27న రాజమండ్రిలో జయహో బీసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఏతావాతా ఫిబ్రవరిలోనే తొలి జాబితా విడుదలయ్యే వాతావరణం కనిపిస్తోంది. ఫిబ్రవరిలో అమరావతిలో భారీ బహిరంగ సభకు టీడీపీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానించాలని సీఎం భావిస్తున్నారు. ఈ సభ తర్వాత అభ్యర్థుల జాబితా విడుదల ఉంటుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోపు చంద్రబాబు అభ్యర్థుల ఎంపికపై అంతర్గత కసరత్తు పూర్తి చేసుకుంటున్నారు. 


నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకోవడం, ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా అభిప్రాయ సేకరణ, గత ఎన్నికలతో వివిధ అంశాలను పోల్చి చూడటం వంటివి జరుగుతున్నాయి. జిల్లాల వారీగా ముఖ్య నేతలతో కొన్ని నియోజకవర్గాల పరిస్థితిపై చర్చించడంతోపాటు పీటముడి ఉన్న నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారంపై కూడా సీఎం దృష్టి పెట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: