సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ ఏపీలో వైసీపీ జెట్‌ రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోంది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప యాత్రకు అటు ప్రజల నుంచి ఇటు పార్టీ శ్రేణుల నుంచి అపూర్వమైన స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. జగన్‌ ప్రజాసంకల్ప యాత్రకు వస్తున్న స్పందనతో వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య‌ హోరా హోరీ పోరు తప్పదని ఇప్పటికే తేలిపోయింది. 2017 చివరిలో ప్రారంభం అయిన ప్రజా సంకల్ప యాత్ర 2018 సంవత్సరం మొత్తం నిర్విరామంగా జరగడంతో పాటు 2019లోనూ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నియోజకవర్గంతో ముగియబోతున్న ఈ ప్రజా సంకల్ప యాత్ర తర్వాత జగన్‌ తిరిగి పాదయాత్రలో కవర్‌ కాని నియోజకవర్గాల్లో బస్సు యాత్రకు కూడా రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో విపక్ష వైసీపీలోకి ఇతర పార్టీల నుంచి కీలక నేతలు జంపింగులు జోరందుకోబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి పలువురు నేతలు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 


టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు ఇత‌ర‌ పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదని డిసైడ్‌ అయిన నాయకులు తమకు వైసీపీనే బెటర్‌ అని భావిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో, అక్కడ పోటీ చేస్తే ఖ‌చ్చితంగా ఎమ్మెల్యే అవుతామన్న అంచనాతోనే చాలా మంది ఆ పార్టీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ కీలక నేత సైతం వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు, మాజీ మున్సిపల్ చైర్మ‌న్‌ బొడ్డేపల్లి రమేష్‌ కుమార్‌ ఈ నెల 9న జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటారన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. వైసీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తనకు అవకాశం కల్పించాలని రమేష్‌ కుమార్‌ ఇప్పటికే వైసీపీలో కీలక నేత అయిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని కూడా కలిసినట్టు సమాచారం. 


ఇక శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సుధీర్ఘ‌మైన అనుబంధం ఉన్న వ్యక్తిగా పేరొందారు. రమేష్‌ కుమార్‌ తల్లి సత్యవతి కాంగ్రెస్‌ నుంచి ఆమదాలవలసలో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్న ఆయన తాజాగా జగన్‌ను ప్రజా సంకల్ప యాత్రలో కలిసారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగానే ర‌మేష్‌ కుమార్‌కు జగన్‌ పార్టీ కండువా కప్పుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైన ఈ పరిణామాలు శ్రీకాకుళం జిల్లాలో ఆమదాలవలసతో పాటు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీకి బలంగా కలిసిరానున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే టైమ్‌లో ఇటు టీడీపీ నాయకుల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది. నిన్నటి వరకు శ్రీకాకుళం జిల్లా లోక్‌సభ సెగ్మెంట్‌లో అన్ని విధాల బలంగా ఉన్నామని భావిస్తున్న టీడీపీ నాయకులు ఇప్పుడు గెలుపు కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి.
ReplyForward


మరింత సమాచారం తెలుసుకోండి: