రాష్ట్రానికి కొత్త పొద్దు సాకారం కానుందా? అనూహ్య రాజ‌కీయ త‌రంగాల త‌ర్జ‌న భ‌ర్జ‌నల న‌డుమ రాష్ట్రంలో ప్ర‌భుత్వం మార‌డం ఖాయంగా క‌నిపిస్తోందా?  సీఎం మారిపోతారా? ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో నే కాదు.. సాధార‌ణ పౌరుల్లోనూ చ‌ర్చ గా  మారిన విష‌యం ఇది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యంలో ఆస‌న్న మ‌వుతున్న నేప‌థ్యంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజ‌కీయాల్లో మార్పు క‌నిపించ‌డం త‌థ్యంగా మారింది. కీల‌క‌మైన మూడు పార్టీలు రాష్ట్రంలో చ‌క్రం తిప్పేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీ.. అయితే, తాము ఎందుకు మ‌ళ్లీ అధికారంలోకి రావాలో వివ‌రిస్తూనే.. మేం అధికారంలోకి రాక‌పోతే.. ఏం జ‌రుగుతుందో అంటూ.. అభివృద్ధిని అడ్డు పెట్టుకుని రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తోంది. వాస్త‌వానికి దీనిని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు.


అదేస‌మ‌యంలో విప‌క్షాలు కూడా అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగానే ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇక్క‌డ కీల‌క‌మైన విష‌యం ఏంటంటే.. ఈ మూడు పార్టీల్లో ఎవ‌రు బెస్ట్‌?  ఎవ‌రిని ఎన్నుకోవాలి? అనేది! ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల మేర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంది. అయితే, అది ఇప్పటి వ‌ర‌కు సాకారం కాలేదు. మీరు ఇవ్వ‌లేదు.. అని చంద్ర‌బాబు కేంద్రంపై పోరు చేస్తుంటే... మీరు వ‌ద్ద‌న్నారు కాబ‌ట్టే... అని కేంద్రం ఎదురు దాడి చేస్తోంది. ఇక‌, ఈ ప్ర‌త్యేక హోదా కోస‌మే తాను మ‌ళ్లీ కాంగ్రె్స్‌తో జ‌ట్టుకు రెడీ అవుతున్నాన‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 


ఇక‌, ప‌వ‌న్ విష‌యానికి వ‌స్తే.. 2014లోనే జ‌న‌సేన పార్టీని పెట్టినా ఆయ‌న పోటీ కి దూరంగా ఉన్నారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబుకు, కేంద్రంలోని న‌రేంద్ర మోడీకి కూడా ప్ర‌చారం చేశారు. బాబు అనుభ‌వ‌జ్ఞుడ‌ని, ఆయ‌న ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే.. రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోవ‌డం ఖాయ‌మ‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. అంతేకాదు, బాబు ఇచ్చే హామీల‌కు తాను బాధ్య‌త వ‌హిస్తాన‌ని, తాను నిల‌దీస్తాన‌ని చెప్పుకొచ్చారు. అయితే, ఈ ఐదేళ్ల‌లో జ‌రిగింది ఏంటి? అనేది ప్ర‌శ్నార్థ‌కంగానే మారింది. ఇక‌, ముచ్చ‌ట‌గా మూడో పార్టీ వైసీపీ. పార్టీ అధినేత జ‌గ‌న్ ఆది నుంచి ఒకే మాట‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీపై పోరాటం చేయ‌డం ద్వారానే మ‌న హ‌క్కులు మ‌నం సాధిస్తాం! అనే కీల‌క నినాదాన్ని ఆయ‌న తెర‌మీదికి తెచ్చారు.


త‌న పార్టీ ఎంపీల‌ను రాజీనామా చేయించారు. అవిశ్వాసం ప్ర‌క‌టించారు. ఒకానొక సంద‌ర్భంలో వైసీపీ ప్ర‌క‌టించిన అవిశ్వాసానికి చంద్ర‌బాబు సైతం మ‌ద్ద‌తిచ్చారు. ఇలా వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్లాడు జ‌గ‌న్‌. ఇప్పుడు సుదీర్ఘ  పాద‌యాత్ర ముగిసింది. ఇక‌, ఇప్పుడు బ‌స్సు యాత్ర ద్వారా ప‌ట్ట‌ణ ప్రాంత ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు జ‌గ‌న్ రెడీ అవుతున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రాష్ట్రంలో మార్పు ఖాయ‌మ‌నే మాట వినిపిస్తోంది. అయితే అది ఏ రూపంలో ఉంటుంది? అనేది ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌లేక పోయినా.. స్ప‌ష్టంగా అయితే.. మార్పు వ‌స్తుంద‌నేది వాస్తవ‌మే! మ‌రి ఎలా ఉంటుంది? అనేది తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి: